‘2.0’ సీక్వెల్ ‘3.0’ చేస్తా కానీ..: డైరక్టర్ శంకర్

రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘2.0’. శంకర్‌ దర్శకుడు. అక్షయ్‌కుమార్‌ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మాత ఎన్వీప్రసాద్‌ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 29న ఈ చిత్రం విడు దలవుతోంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ స్పీడు పెంచారు. ఇందులో భాగంగా కలిసిన మీడియావారు.. సీక్వెల్ గురించి దర్శకుడు శంకర్ ని అడగటం జరిగింది. దానికి ఆయన పాజిటివ్ గా స్పందించారు.

శంకర్ స్పందిస్తూ.. ‘3.0 చిత్రాన్ని తప్పకుండా చేస్తాను. కానీ రజనీకాంత్ లేకుండా మాత్రం సాధ్యం కాదు. రోబో చిట్టి పాత్రలో రజనీకాంత్‌ స్థానంలో ఎవరినీ ఊహించలేము. ప్రస్తుతానికి 3.0 గురించి ఆలోచన చేయలేదు. అందుకు తగిన స్టోరీలైన్, కన్విన్సింగ్ స్క్రిప్టు సిద్ధమైతే తప్పకుండా 3.0 చేస్తాను. ఇండియన్ సినీ ప్రేక్షకులను చిట్టి రోబో ఎంతగానో అలరించింది అని శంకర్ అన్నారు.

అలాగే… సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ తరహాలోనే ఇండియన్ సినిమాలో ‘రోబో’ సీక్వెల్స్ సాధ్యమే అని దర్శకుడు శంకర్ తెలిపారు. అయితే ప్రస్తుతం తన ఆలోచన అంతా 2.0 రిలీజ్ మీదనే ఉందని, సీక్వెల్స్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేయలేదని తెలిపారు.

ఇక ఈ సినిమాలో ..స్క్రిప్ట్‌ డిమాండ్‌ మేరకే త్రీడీ టెక్నాలజీ వాడాం. కొత్తగా డిజైన్‌ చేయాలనుకున్నాం. అందుకు కొంత ఖర్చు పెట్టక తప్పదు. ట్రైలర్లో కనిపించిన సెల్‌మెన్, బర్డ్‌.. అన్నీ సెటప్‌నే. వాటిని డిజైన్‌ చేయడానికి చాలా టైమ్‌ పట్టింది. బడ్జెట్‌ కూడా పెరిగింది. క్రియేట్‌ చేసిన క్యారెక్టర్స్‌లో ఎమోషన్స్‌ని సిల్వర్‌స్క్రీన్‌పై చూపించడం చాలెంజింగ్‌గా అనిపించింది అన్నారు.

‘2.0’ సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహించారు. అక్షయ్‌ కుమార్‌ విలన్ పాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సినిమాను నిర్మించింది. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. శాటిలైట్‌, డిజిటల్‌ తదితర హక్కుల ద్వారా ఇప్పటికే ఈ చిత్రం రూ.370 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. నవంబరు 29న ఈ చిత్రం విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.