రూ.100 కోట్లు క‌లెక్ట్ చేసిన మూవీపై క‌న్నేసిన టాలీవుడ్

గ‌త ఏడాది ద‌స‌రా సీజ‌న్‌లో రిలీజైందా మూవీ. విడుద‌లైన తొలి రోజు నుంచే బాక్సాఫీసును ద‌డ‌ద‌డ‌లాడించేస్తోంది. ఇప్ప‌టికీ హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో న‌డుస్తోంది. నిర్మాత‌కు కాసుల పంట పండించింది. 100 కోట్ల రూపాయల మార్క్‌ను అందుకుంది. దేశ‌వ్యాప్తంగా మార్కెట్ ఉండే బాలీవుడ్ సినిమా ఏమీ కాదు. ఓ మ‌ల‌యాళ మూవీ. టైటిల్..`కాయంకుళం కోచుణ్ని`.

1830 నాటి బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమా మొత్తం సాగుతుంది. ఓ ర‌కంగా ఇదో పీరియాడిక‌ల్ మూవీగా చెప్పుకోవ‌చ్చు. రాబిన్‌హుడ్ త‌ర‌హా స్టోరీ. బ్రిటీష‌ర్ల హ‌యాంలో దారి దోపిడీకి పాల్ప‌డ‌టం, చేతికి అందినంత దోచుకుని, పేద‌ల‌కు పంచ‌డం ఈ మూవీ సెంట‌ర్ పాయింట్‌. ర‌హ‌దారుల‌పై కాపుకాసి, బ్రిటీష‌ర్ల‌తో పాటు సంస్థానాధీశుల‌ను దోచుకుని లేని వారికి పెట్టే త‌ర‌హా ఘ‌ట‌న‌లు సెంట్ర‌ల్ ట్రావెన్‌కోర్ రీజియ‌న్‌లో నిజంగానే చోటు చేసుకున్నాయ‌ట‌.

దీనికి సంబంధించిన కొన్ని పుస్త‌కాల ఆధారంగా సినిమాను తీశారు. అది ఇప్పుడు క‌లెక్ష‌న్ల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. 40 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో రూపొందించిన ఈ మూవీ కేర‌ళ‌లో రూ.100 కోట్ల రూపాయ‌ల‌కు పైగా క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. మాలీవుడ్‌లో అతి త‌క్కువ వ్య‌వ‌ధిలో వంద కోట్ల రూపాయ‌ల‌ను అందుకున్న సినిమాగా గుర్తింపు పొందింది. రోష‌న్ ఆండ్రూస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

శ్రీ‌గోకులం మూవీస్ బ్యాన‌ర్ కింద రూపొందిందా మూవీ. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ ఇందులో ఓ కామిక్ రోల్ చేశారు. నివీన్ పౌలీ లీడ్‌రోల్‌లో క‌నిపిస్తారు. ప్రియా ఆనంద్, ప్రియాంక తిమ్మేష్‌, స‌న్నీ వేన్‌, బాబు ఆంటోనీలు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. తెలుగు తెర‌కు బాగా ప‌రిచ‌యం ఉన్న గోపీ సుంద‌ర్ సంగీతాన్ని అందించారు.

శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్‌. ఈ సినిమా ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ టౌన్‌గా మారింద‌ని చెబుతున్నారు. ఈ మూవీ హ‌క్కుల‌ను కొనుగోలు చేయ‌డానికి బ‌డా నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. మోహ‌న్‌లాల్ క్యారెక్ట‌ర్‌ను ఆయ‌న‌తోనే చేయిస్తూ, హీరో క్యారెక్ట‌ర్‌లో ఓ యంగ్ హీరోను తీసుకోవాల‌నే ప్లాన్ చేస్తున్నార‌ట నిర్మాత‌లు.