ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్ లో రజనీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం 2.o. లైకా సంస్థ సుమారు రూ.550 కోట్లతో రూపొందించింది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో భారీ అంచనాల మధ్య ఈ నెల 29న అంటే రేపు విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉంటుందనే అంచనాలు,ఊహలు మొదలయ్యాయి.
అందుతున్న సమాచారం ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడం, కుప్పలు తెప్పలుగా సెల్ టవర్లు నిర్మించడం, ఈ రేడియేషన్ వల్ల కలిగే విపరీతాలు, నష్టాలే కథాంశంగా 2.0 సినిమాను తెరకెక్కించాడట దర్శకుడు శంకర్.
ఈ చిత్రంలో పక్షులకు …మొబైల్ సిగ్నల్స్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల హాని జరుగుతోందని, లక్షళాది పక్షలు చనిపోతున్నాయని అక్షయ్ కుమార్ గమనిస్తాడు. ఓ పక్షి ప్రేమికుడుగా ఓ స్టైంటిస్ట్ గా ఆయన చాలా బాధపడతాడు. ఈ ప్రపంచం కేవలం మనష్యులదే కానీ అన్ని జీవరాసులదని ఆయన నినదిస్తాడు. అయితే మనష్యులు అదేమి పట్టించుకోకుండా తమ సౌకర్యాల కోసం..మిగతా జీవులను ఇబ్బంది పెట్టడం, వాటికు హాని కలిగించటం చేస్తున్నాడని కోపంతో మండిపడతాడు. ఆ క్రమంలో అసలు సెల్ ఫోన్స్ అనేవి లేకుండా చేస్తే …అప్పుడు వాటికి జరిగే హాని తగ్గుతుందని భావిస్తాడు.
దాంతో తన తెలివితో సెల్ పోన్స్ ఆకర్షించే ఓ రోబో ని రెడీ చేస్తాడు. అది సిటీలో ఉన్న మొత్తం సెల్ ఫోన్స్ ని ఎత్తుకువచ్చేస్తుంది. అప్పుడు ప్రభుత్వానికి ఏం చెయ్యాలో తెలియదు. దాంతో మన దేశంలోనే గొప్ప సైంటిస్ట్ అయిన వశీ కరణ్ ని సంప్రదిస్తుంది. ఆయన ఈ విపత్తు నుంచి రక్షించాలంటే రోబో చిట్టిని మళ్లీ రంగంలోకి దింపాలని నిర్ణించుకుంటాడు. అయితే చిట్టికు ఉన్న పరిమిత శక్తులతో అక్షయ్ కుమార్ ని కంట్రోలు చేయటం కష్టమని భావించి..దాన్ని 2.0 గా అప్ గ్రేడ్ చేస్తాడు. అక్కడ నుంచి చిట్టి రోబో ఎలా అక్షయ్ కుమార్ నుంచి ప్రపంచాన్ని కాపాడింది అనేదే మిగతా కథ అని తెలుస్తోంది.
ఈ కథ ఎలా పుట్టింది? అనేదానికి శంకర్ ఇచ్చిన సమాధానం..
నా మదిలో తట్టిన ఓ దృశ్యం నుంచి వచ్చిన కథే ఇది. రాత్రి వేళ కొన్ని సెల్‌ఫోన్‌లు ఒక చోటకి గుంపుగా చేరి, రోడ్డుపై అలా వరుసకట్టి వెళితే ఎలా ఉంటుందనే విజువల్ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అప్పుడు ఆలోచనలు మొదలయ్యాయి. ఈ ఫోన్లన్నీ ఎక్కడికి వెళతాయి? ఇలా వెళ్లడం వెనక ఏదైనా కథ ఉంటుందా? ఉంటే ఆ కథ ఎలాంటిది? ఇలా రివర్స్‌గా వచ్చిన ఆలోచన సరళి నుంచి పుట్టిందే ఈ కథ. మరికొన్ని పరిశోధనాత్మక విషయాల్ని కలిపి దీన్ని సిద్ధం చేశాం.
వివాదం కూడా పైన చెప్పబడిన కథను బలపరుస్తోంది..
ఇక ఈ మూవీలో మొబైల్ ఫోన్, టవర్లు, మొబైల్ సేవలపై చిత్ర దర్శక,నిర్మాతలు అశాస్ర్తీయ ప్రచారం చేశారని సెల్యులార్ ఆపరేటర్ల సంఘం (సీఓఏఐ) ) సెన్సార్‌బోర్డు, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ పోషించిన పాత్ర ద్వారా మొబైల్ ఫోన్ వాడకందారులను పర్యావరణానికి పక్షులు, జంతువులకు రేడియేషన్‌తో హాని చేసే వారిలా దూషిస్తుంటారని పేర్కొంది. టీజర్, ట్రైలర్‌లలో మొబైల్‌ఫోన్లు, టవర్లు పర్యావరణానికి హానికరం అన్న రీతిలో చూపించారని దీనిపై సెన్సార్‌బోర్డు మరోసారి పునః సమీక్ష జరపాలని ఫిర్యాదులో పేర్కొంది.
‘‘మొబైల్ ఫోన్లు, టవర్లు పక్షులకు హాని కలిగిస్తాయని చిత్రంలో తప్పుగా చూపించారు’’ అని కాయ్ అభిప్రాయపడుతూ ఈ కంప్లైంట్ చేసింది. అక్షయ్ ఇందులో పక్షి ప్రేమికుడిగా కనిపిస్తారని సమాచారం. సెల్‌ఫోన్, సెల్ టవర్ల వల్ల పక్షులకు జరిగిన హానికి ప్రతీకారంగా పోరాటం చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెన్సార్‌బోర్డుకు కాయ్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. సెల్‌ఫోన్ వల్ల పర్యావరణానికి హాని జరిగినట్లు శాస్త్రీయంగా ఎక్కడా రుజువుకాలేదని పేర్కొంది.