1986 అంతర్జాతీయ చిత్రోత్సవం … చిరస్మరణీయం

భారత దేశంలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఢిల్లీ , ముంబై , కలకత్తా , త్రివేండ్రం , బెంగళూరు మరియు హైదరాబాద్ లో జరిగాయి . ఆ తరువాత 2004 నుంచి గోవా కేంద్రంగా జరుగుతున్నాయి . అయితే హైద్రాబాద్లో 1986లో జరిగిన అంతర్  జాతీయ చలన చిత్రోత్సవం చిరస్మరణీయమైనది .

1986లో అప్పటి రాష్ట్ర ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు చిత్రోత్సవాన్ని నిర్వహిస్తామని ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ నుంచి ఆమోదం పొందారు . ఇందుకు ప్రారంభ వేదిక ఆరుబయట ఉంటే ఎక్కువ మంది చూడ వచ్చానే ఉద్దేశ్యంతో పబ్లిక్ గార్డెన్లో లలిత కళాతోరణమ్ కు శ్రీకారం చుట్టారు . అప్పుడు రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షులు డి .వి .ఎస్ రాజు కు రామారావు ఈ భాద్యత అప్పగించారు . యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం మొదలైంది . ప్రతిరోజూ రామారావు పబ్లిక్ గార్డెన్ కు వెళ్లే నిర్మాణ పనులను చూసేవాడు . 90 రోజుల్లో లలిత కళాతోరణం అద్భుతంగా రూపొందింది .

అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడుగా నిర్మాత దర్శకుడు యు . విశ్వేశ్వర రావు ఉండేవాడు . రామారావు ఇటు రాజు , అటు విశ్వేశ్వర రావు తో సమన్వయము చేస్తూ “ఈ చిత్రోత్సవాన్ని  మరపురాని విధంగా , చిరస్మరణీయంగా జరపాలని వారిని ఆదేశించారు .

సినిమారంగం నుంచి వచ్చిన రామారావు సినిమా వేడుకలను  కన్నుల పండువుగా జరపాలని అనుకున్నారు .

తెలుగు సినిమా రంగం మొత్తం ఆయన ఆదేశాలను పాటించడానికి ఒకే త్రాటి మీదకు వచ్చింది .

హైదరాబాద్ అబిడ్స్ లో వున్న రామకృష్ణ ఎస్టేట్ ప్రధాన కేంద్రంగా ఎంపిక చేశారు . పబ్లిక్ గార్డెన్లో వున్న జూబిలీ హాల్  మీడియా సెంటర్ . అక్కడ నుంచి రామకృష్ణ ఎస్టేట్ వరకు ఆర్టీసీ  బస్సులను ఉచితంగా నడిపింది . నగరంలో మరో 10 థియేటర్ లలో ఫెస్టివల్ సినిమాలు ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగాయి .

నవంబర్ 20 న లలిత కళా తోరణంలో ప్రారంభోత్సవ చిత్రాన్ని ప్రదర్శించాలని , దానికి ముందు సభ జరపాలని నిర్ణయించారు .

ముఖ్యమంత్రి ఎన్ .టి .రామారావు తమిళ, మళయాళ, కన్నడ, హిందీ రంగాల ప్రముఖులందరినీ పాల్గొనమని లేఖలు వ్రాశాడు . స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించాడు . తెలుగు సినిమా రంగ ప్రముఖులతో సమావేశమై అంతర్జాతీయ చిత్రోత్సావాన్ని అద్భుతంగా జరపడానికి సహకరించమని విజ్ఞప్తి చేశాడు .

చిత్రోత్సవం జరిగే వారం రోజులపాటు నగరమంతా విద్యుత్ దీపాలతో అలంకరిస్తామని చిత్రరంగ ప్రముఖులు తెలిపారు .సినిమా రంగ ప్రముఖులు , అధికారులతో కమిటీలు ఏర్పాటు చేశారు .

రామకృష్ణ ఎస్టేట్  ప్రధాన వేదిక కాబట్టి ,అక్కడకు వచ్చే అతిధులు , జర్నలిస్టులను మధ్యాహ్న భోజనం పెట్టె ఏర్పాట్లు చేసినట్టు రామారావు కు వారు తెలిపారు . అందుకు రామారావు ఎంతో సంతోషించాడు . అలా ఎప్పుడు ఎక్కడా జరగలేదు .

ఇక ప్రారంభ సభ తెలుగు సంప్రదాయ పద్దతిలో అపూర్వంగా జరిగింది . ప్రారంభ సినిమా ముందు దీపావళి ని గుర్తుకు  వచ్చేలా ఆకాశంలో మందుగుండు తో రంగుపూల అద్భుతాలను సృష్టించారు .

ఈ వేడుకల్లో హిందీ రంగం నుంచి రాజ్ కపూర్ , అశోక్ కుమార్ , కన్నడ రంగం నుంచి రాజకుమార్ మొదలైన వారు హాజరయ్యారు . వారందరినీ రామారావు దగ్గర ఉండి ఆహ్వానించారు . అందరినీ వేదిక మీదకు పిలిచి ఘనంగా సత్కరించి వెండి వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను బహూకరించాడు . 

1986 చిత్రోత్సవం జరిగి 32 సంవత్సారాలు అవుతుంది. నిజంగానే హైదరాబాద్ లో  నిర్వహించిన చిత్రోత్సవాన్ని ఇప్పటివరకు  ఎవరూ మరిపించలేకపొయ్యారు .

ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో అప్పటిదే. కన్నడ రాజకుమార్ ను సత్కరిస్తున్న ఎన్ .టి . రామా రావు .

-భగీరథ