బహిరంగ క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి

ప్రముఖ టీవీ యాంకర్ రవి ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. గత నెలలో ఓ టీవీ షోలో ఏపీ ప్రజలను కించపరిచే విధంగా కంటెస్టెంట్ వ్యాఖ్యానించడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ సందర్భంగా రవి వ్యవహార శైలి.. కంటెస్టెంటును ప్రోత్సహించినట్టుగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చెలరేగాయి. దీంతో రవి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చుకున్నాడు. దీనికి సంబంధించి ఓ వీడియో పోస్టు చేశాడు.

తనకు ఏపీ, తెలంగాణ వేర్వేరు కాదని.. రెండు రాష్ట్రాల ప్రజలు సమానమేనని తెలిపాడు. గత నెల 23నాటి షోలో కంటెస్టెంట్ మహిధర్ చేసింది తప్పేనని.. తాను దాన్ని ఒప్పుకుంటున్నాని వివరణ ఇచ్చుకున్నాడు. అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే తనకు చాలా అభిమానమని.. ఎంతో ఇష్టమని.. నెలరోజుల్లోపు ఆయన్ను కలుస్తున్నట్టు తెలిపాడు.

వివాదాలు తనకు అలవాటుగా మారాయన్నాడు. తాను ఏ తప్పు చేయలేదని.. ఓ యాంకర్‌గా ఆ ప్రోగ్రామ్‌లో ఆరోజు అలా వ్యవహరించాల్సి వచ్చిందని తెలిపాడు. దయచేసి తనను ఇందులోకి లాగొద్దని విజ్ఞప్తి చేశాడు.