శివాలయాల్లో గర్భగుడి ముందు నందీశ్వరుడు ఉండడం, ఆయన కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడాన్ని హిందూ సంప్రదాయం ఎంతో పవిత్రంగా భావిస్తుంది. కానీ ఇటీవల ఒక టీవీ షోలో ఈ సాంప్రదాయాన్ని సరదాగా చూపించడంతో పెద్ద వివాదమే చెలరేగింది. ప్రముఖ యాంకర్ రవి హోస్ట్ చేస్తున్న “సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్” షోలో సుడిగాలి సుధీర్ టీమ్ రూపొందించిన స్కిట్ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ స్కిట్‌లో నంది కొమ్ముల మధ్య నుంచి హీరోయిన్ ను చూపించడం హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది. దీన్ని గౌరవహీనంగా చిత్రీకరించారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెచ్చాయి. వివాదం పెద్ద స్థాయిలో చర్చకు దారి తీసింది. హిందూ సంస్థలు గట్టిగా స్పందించడంతో యాంకర్ రవి దీనిపై స్పందిస్తూ ఓ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు.
“ఈ స్కిట్ వల్ల ఎవరికైనా అనవసరమైన బాధ కలిగితే దాని బాధ్యత నాదే. ఇది మా ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదు. ఒక సినిమా సీన్‌ను స్పూఫ్‌గా ప్రదర్శించాం. కానీ అది ఇలా అభ్యంతరకరంగా మారుతుందని అనుకోలేదు. భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం,” అని రవి స్పష్టం చేశారు. జై శ్రీరామ్, జై హింద్ అంటూ తన వీడియోను ముగించారు.
మొత్తంగా చూస్తే… హాస్యంగా చేయబడిన ఓ స్కిట్, గంభీరమైన మతపరమైన అంశాన్ని తప్పుగా చూపించడంతో చర్చనీయాంశమైంది. ఈ అంశంపై రవిపైనే కాకుండా సుధీర్ టీమ్‌పైనా విమర్శలు కొనసాగుతుండటంతో, భవిష్యత్తులో టీవీ షోలలో ఇలాంటి భావనలతో కూడిన సన్నివేశాలు ఉండకుండా చూసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
