ఎవరు హీరో? ఎవరు విలన్? : ‘పులిజూదం’ (మూవీ రివ్యూ)

‘పులిజూదం’

రచన, దర్శకత్వం : బి. ఉన్నికృష్ణన్  
తారాగణం : మోహన్ లాల్, విశాల్, రాశీ ఖన్నా, హన్సిక, మంజూ వారియర్, శ్రీ కాంత్ తదితరులు 
సంగీతం : 4 మ్యూజిక్స్, సుశిన్ శ్యమ్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, ఎన్ కె ఏకాంబరం 
బ్యానర్ : రాక్ లైన్ ఎంటర్ టైనర్స్ 
నిర్మాత : రాక్ లైన్ వెంకటేష్  
విడుదల : మార్చి 21 2019
3 / 5

***
        2017 లో మలయాళంలో విడుదలైన మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘విలన్’ తెలుగులో ‘పులిజూదం’ గా ఈ వారం విడుదలైంది. మోహన్ లాల్ తో బాటు విశాల్, రాశీ ఖన్నా, హన్సికల వంటి పాపులర్ స్టార్స్ నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మలయాళంలో రికార్డు కలెక్షన్స్ తో విజయం సాధించింది. మరి తెలుగులో ఇంత విడుదల ఆలస్యమైతే దీని ప్రభావమెలా వుంది? ఇది తెలుసుకుందాం…

కథ

మాథ్యీవ్ (మోహన్ లాల్) అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ). ఏడు నెలలు సెలవుమీద వెళ్లి వచ్చేసరికి ముగ్గురు హత్యకి గురైన కేసు చేపట్టాల్సి వస్తుంది. ఇద్దరు పోలీసు అధికారులు హర్షితా చోప్రా (రాశీ ఖన్నా), ఇక్బాల్ (చెంబన్ వినోద్ జోస్) లని అసిస్టెంట్స్ గా తీసుకుంటాడు. డ్రగ్ మాఫియా ఫెలిక్స్ విన్సెంట్ (శ్రీకాంత్) మీద అనుమానంగా వుంటుంది. మాథ్యీవ్ ఒక ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోతుంది, భార్య నీలిమ (మంజూ వారియర్) కోమాలో కెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ముగ్గురు హత్యకి గురైన కేసు కాక, ఇంకో ముగ్గురు హత్యకి గురైన తాజా కేసు మాథ్యీవ్ ముందుకొస్తుంది. ఈ కేసులో డాక్టర్ దువ్వాడ మదన గోపాల్ (విశాల్) ని అనుమానిస్తాడు మాథ్యీవ్. మదనగోపాల్ కి అసిస్టెంట్ గా డాక్టర్ శ్రేయ (హన్సిక) వుంటుంది. వీళ్ళిద్దరి కార్యకలాపాలు అనుమానాస్పదంగా వుంటాయి. అసలు వీళ్ళ లక్ష్యమేమిటి? డ్రగ్ మాఫియా ఫెలిక్స్ విన్సెంట్ పాత్ర ఏమిటి? చివరికి డిజిపి (సిద్దీఖ్) ఈ నేరాల్లో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? మాథ్యీవ్ కీ, మదన్ గోపాల్ కి మధ్య జరిగే సంఘర్షణలో ఎవరు ప్రేమతో చంపారు? ఎవరు ద్వేషంతో చంపారు? ద్వేషంతో చంపడం తప్పయి, ప్రేమతో చంపడం తప్పెలా కాకుండా పోయింది? …ఇవి తెల్సుకోవాలంటే వెండితెర మీద చూడాల్సిందే…

ఎలావుంది కథ 

ప్రేమతో ప్రాణం తీయడం, ద్వేషంతో ప్రాణాలు తీయడం – ఏది ఎందుకు తప్పు, ఎందుకు ఒప్పు – అన్న ఆర్గ్యుమెంట్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ కథ. భావోద్వేగభరిత మానవీయ కోణం జోడింపుతో రాణించిన కథ. 

ఎవరెలా చేశారు 

మోహన్ లాల్ టాప్ నటనతో ఆకట్టుకుంటాడు. తనకి జరిగిన వ్యక్తిగత నష్టాన్ని మోస్తూ కూడా ఎక్కడా బరస్ట్ అవకుండా, ఆ బరువు కింద నలుగుతూ భావోద్వేగాలు పండించే క్లాస్ నటన. ముగింపులో గుండెలు బరువెక్కించే నిశ్శబ్ద నటన. పాత్ర నిష్క్రమణతో కాస్త ఏడ్పించే గుణం కూడా. మొత్తం పాత్ర ప్రయాణమంతా ప్రేక్షకులకి సైలెంట్ కిల్లర్ లాంటి ఎమోషనల్ కంటెంట్. 

రాశీఖన్నా దర్యాప్తులో సహకరించే, కొత్త ఆధారాలు అందించే సహ పోలీసు పాత్రలో భావోద్వేగ రహితంగా వుంటే, విశాల్ వెంట వుండే నెగెటివ్ పాత్రలో హన్సిక ఎక్కువ ఆకట్టుకుంటుంది. విశాల్ చివరి సన్నివేశంలో పాత్ర స్వరూపన్నంతా సమగ్రంగా బయట పెడతాడు. మోహన్ లాల్ తో న్యాయన్యాయాల గురించిన సంవాదంలో సానుభూతిని రాబట్టుకుంటాడు. ఇద్దరి మధ్య ఈ పోలీస్ వర్సెస్ డాక్టర్ భీకర ఫైట్ సీను ఒక హైలైట్.

పోలీస్ ఇక్బాల్ గా చెంబన్ వినోద్ జోస్, డిజిపిగా సిద్దీక్ లు కూడా క్లాస్ గా నటిస్తారు. ఇక డ్రగ్ మాఫియాగా శ్రీకాంత్ ది కాస్త నవ్వించే విచిత్ర విలనీ. సాంకేతికంగా సాధారణంగా వుంది. సంగీతం డిటో. దర్శకుడు ఉన్ని కృష్ణన్ కంటెంట్ మీద ఎక్కువ శ్రద్ధపెట్టి  సాంకేతికాలని లైట్ తీసుకున్నట్టున్నాడు.

చివరికేమిటి 

పోలీసులు పరిశోధించే హత్యల కేసులతో రొటీన్ కథే అయినా, విలనెవరో తెలిసి పోతూనే వున్నా, చివరి దృశ్యాల్లో డాక్టరే కాదు, పోలీసు కూడా ఇంకో విధంగా విలనే అన్న అసలు విషయం బయటపడడంతో – ఈ సాదాసీదా సస్పెన్ థ్రిల్లర్ కి బలమైన డెప్త్ వచ్చింది. ద్వేషంతో న్యాయం కోసం చంపుతున్నవాడికి, సమాధానం చెప్పుకోలేని విధంగా ప్రేమతో మానవత్వం కోసం చంపిన వాడు దొరికిపోవడమే ఈ థ్రిల్లర్ లోని అనూహ్య ఎమోషనల్ డ్రామా. దీన్ని కన్ఫ్యూజన్ లేకుండా చిత్రీకరించాడు దర్శకుడు. ప్రతీ విలన్ లో హీరో వుంటాడు, ప్రతీ హీరోలో విలన్ వుంటాడని జస్టిఫికేషన్ ఇచ్చాడు. నియంతల్ని అభిమానించే వెర్రితనాన్ని మించింది మరోటి ఈ లోకంలో లేదని, అలాగే ఒక మనిషి మరో మనిషి ప్రాణాలు తీసే అస్వాభావిక చర్యలాంటిది ఈ లోకంలో మరోటి లేదనీ ఆలోచనాత్మ డైలాగులతో స్టార్స్ ఇద్దరి పాత్రల్ని నిలబెట్టాడు. ‘పులిజూదం’  టైటిల్ తో మరో మసాలా సినిమాలా అన్పించినా, చూస్తే మసాలా అలాటి మసాలాలేవీ లేని క్లీన్ పాయింట్ బేస్డ్ కమర్షియల్ ఇది. విడుదల ఆలస్యమైనా ప్రభావం పడని థ్రిల్లర్.  

―సికిందర్