చట్రంలో చిత్రం -‘సాహో’ స్క్రీన్ ప్లే విశ్లేషణ -2

చట్రంలో చిత్రం – ‘సాహో’ స్క్రీన్ ప్లే విశ్లేషణ -2

‘సాహో’ ఆవిష్కరణ
ఇప్పుడు ‘సాహో’ విషయానికొద్దాం. ఎంతో అయోమయంగా వున్న ‘సాహో’ స్క్రిప్టు లో అసలు కవి (దర్శకుడి) హృదయమేమిటో పట్టుకోవడానికి పైన చెప్పుకున్న నమూనాలు ముందుపెట్టుకుని, నాల్గైదు రోజులాలోచిస్తే గానీ సాధ్యం కాలేదు. ఇలాకూడా స్క్రిప్టులు రాసేస్తారా అనుకోవాల్సిన పరిస్థితి.

‘సాహో’ కి పెట్టిన బడ్జెట్ వచ్చేసింది కాబట్టి బంపర్ హిట్టే నంటున్నారు. అలాంటప్పుడు ఈ స్క్రీన్ ప్లే సంగతులు ఇంకోలా రాయాలి బ్రహ్మ రథం పడుతూ. అప్పుడిదీ కరెక్టు స్క్రీన్ ప్లేనే అనుకుని మరికొన్ని సినిమాలు ఇలాగే తీసేసే ధైర్యం చేస్తారేమో? చేయక పోతే ఇంత హిట్టయి ఎందుకు? ‘బాషా’ ని పట్టుకుని కొన్ని డజన్లు తీశారు, ‘సాహో’ ని ఎందుకు వదలాలి? అయితే ‘సాహో’ దర్శకుడి అపనమ్మకమే దీనికి అడ్డు. ఒక పక్క బంపర్ హిట్టే నంటూ, ఇంకో పక్క దర్శకుడు ఏమంటున్నాడో చూద్దాం…

… తన మొదటి షార్ట్ ఫిల్మ్ 17 ఏళ్ల వయసులో తీశానని చెబుతూ, విమర్శ ఎప్పుడూ తనకు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాడు. సినిమా చాలా మందికి నచ్చిందని, అయితే ఎవరైతే అంచనాలకు మించి చేరలేదని అనుకుంటున్నారో, వారు మరోసారి సినిమా చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారని పేర్కొన్నాడు.

‘సాహో’ చిత్రంలోని గొప్ప స్క్రీన్ ప్లే, అలాగే తాము పడ్డ కష్టం తెలియాలంటే మరొక్క మారు థియేటర్లకు వెళ్లి చూడాలని మనవి చేశాడు. భారీ అంచనాలతో సినిమా చూడడం వలనే ‘సాహో’ చిత్రం నచ్చడం లేదని అభిప్రాయపడ్డాడు.
అలాగే ఇన్నేళ్ల కెరీర్ లో ఏనాడు వెనక్కి తగ్గలేదని, ‘సాహో’ సినిమాలో మీరు మిస్ అయిన విషయాలు అర్ధం కావాలంటే మరోసారి చూడండని సుజిత్ వివరణ ఇచ్చాడు.
―తెలుగు రాజ్యం డాట్ కాం

ఇదీ విషయం! అంచనాలకు మించి చేరలేదని భావించడం వల్ల… భారీ అంచనాలతో సినిమా చూడడం వల్ల … నచ్చడం లేదనీ, మిస్ అయిన విషయాలు అర్ధం కావాలంటే మరోసారి చూడాలనీ – ఇలా అన్నికోణాల్లో సినిమా ఎలా వుందో తేల్చేశాడు. దీన్ని ఇంకేం ఫాలో అయి ఇలాగే తీస్తారు.

350 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తూంటే, ప్రేక్షకులు కనీసం రెండు టన్నులు భారీగానే అంచనాలు పెట్టుకోకుండా ఎలా వుంటారు. కంటెంట్ పరంగా తప్పకుండా భారీగానే అంచనాలు పెట్టుకుంటారు. ఇది గొప్ప స్క్రీన్ ప్లేనే అయితే అదెలా అయింది చెప్పాలి – గొప్ప స్క్రీన్ ప్లేనే అయితే, మిస్ అయిన విషయాలు అర్ధం కావాలంటే, మరోసారి చూడమనడ మేమిటి. గొప్ప స్క్రీన్ ప్లే అర్ధమవాలంటే రెండు సార్లు చూడాలా? తన బొమ్మ మంచిదైతే, పదేపదే మరొక్క మారు చూసి అర్ధం జేసుకోండని నచ్చ జెప్పుకోవాల్సిన పని లేదు.

మరి ‘సాహో’ లో ఏ నమూనా వుంది? ఫస్టాఫ్ 50 వ నిమిషంలో, బ్లాక్ బాక్స్ క్లూతో ప్లాట్ పాయింట్ -1 రావడంతో, ఇది నాన్ లీనియర్ కథనమన్పించదు. బిగినింగ్ – మిడిల్ -ఎండ్ వరసలో లీనియర్ కథనమే అన్పిస్తుంది. ఈ లీనియర్ కథనంలో ప్లాట్ పాయింట్ -1 వచ్చేసిందంటే, ఇక మిడిల్ మటాష్ వుంటుందని వూహించలేం. ప్లాట్ పాయింట్ -1 వచ్చిందంటే, హీరోకి గోల్ తో, మిడిల్ -1 అంటే, కథ ప్రారంభమైనట్టే. ఇలా హీరో బ్లాక్ బాక్స్ జాడ కనుక్కునే గోల్ తో, ఫస్టాఫ్ లో 50 వ నిమిషంలో కథ ప్రారంభమయ్యాక, దీని కొనసాగింపుగా ఇంటర్వెల్లో ఏం జరగాలి? ఆ గోల్ దెబ్బతినడమో, లేదా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడమో జరగాలి. ఇంటర్వెల్లో హీరో బ్లాక్ బాక్స్ ని చేజిక్కించుకోవడంతో రెండోదే జరిగింది. ఇలా ఇంటర్వెల్లో గోల్ నెక్స్ట్ లెవెల్ కెళ్లాక సెకండాఫ్ లో, అంటే మిడిల్ -2 లో ఏం జరగాలి? ఆ బ్లాక్ బాక్స్ కోసం విలన్లు వెంటపడాలి. ఇదే జరిగింది సినిమాలో.

అయితే … అయితే …ఇంటర్వెల్లో బ్లాక్ బాక్స్ చిక్కడమనే టర్నింగ్ మాత్రమే కాదు, హీరో తను అశోక్ చక్రవర్తి కాదనీ, సాహో ననీ ట్విస్టు నివ్వడం కూడా వుంది. దీంతో టర్నింగ్ కంటే మాంచి రేంజిలో వున్న ఈ ట్విస్టు టర్నింగ్ కి చెక్ పెట్టేసింది. హీరో సాహో అనే మాట బిగ్ డిక్లరేషన్. దీని ముందు టర్నింగ్ పాయింటు (బ్లాక్ బాక్స్ చిక్కడం) వెలవెలబోతూ వుంది. ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు టర్నింగ్ పాయింటు మీంచి ఈ ట్విస్టు మీద కేంద్రీకృతమైపోతుంది. బ్లాక్ బాక్స్ సంగత్తర్వాత, ముందు ఈ సాహో అంటున్న హీరో కథేమిటో తెలుసుకోవాలన్న ఉత్కంఠకి లోనవుతారు. ఇది కామన్ సెన్సు.

ఈ కామన్ సెన్స్ కాదనుకుని న్యూసెన్స్ చేశారు. బిగ్ డిక్లరేషన్ తో వున్న ట్విస్టుని వదిలేసి, సెకండాఫ్ కథగా బ్లాక్ బాక్స్ చిక్కిన విలువ తగ్గిన – మార్కెట్ వేల్యూ లేని టర్నింగ్ ని ఎత్తుకున్నారు. దీంతో సెకండాఫ్ సమస్యల్లో పడింది. అంటే ఇంకా కథ ప్రారంభం కాలేదు… మిడిల్ మటాష్ వైపుగా సాగుతోంది. బిగ్ డిక్లరేషన్ అయిన సాహో ఎవరనే దాని మీదికెళ్తే కదా కథంటూ ప్రారంభమయ్యేది? ఇందుకే సెకండాఫ్ లో బిగినింగ్ కథనం కంటిన్యూ అనాల్సి వచ్చింది…

అదేమిటి, ఫస్టాఫ్ లో బ్లాక్ బాక్స్ క్లూతో ప్లాట్ పాయింట్ -1 వచ్చి మిడిల్ – 1 ప్రారంభమయిందిగా అంటే -ఇలాగే మిస్ లీడ్ చేస్తాయి మిడిల్ మటాషులు. సెకండాఫ్ వస్తే గానీ మిడిల్ మటాష్ అని అర్ధంగాదు. అర్ధమయ్యాక వెనక్కెళ్ళి మొదట్నించీ ఏర్పరచుకున్న అవగాహనని సవరించుకోవాలి. ఇప్పుడు అది ప్లాట్ పాయింట్ -1 కాదు. ఇంకా ప్రారంభంకాని కథకి సంబంధించిన పర్యవసానం. ఇంటర్వెల్లో బ్లాక్ బాక్స్ చిక్కడం కూడా ఇంకా ప్రారంభం కాని కథకి మిడ్ పాయింట్ కాదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కాదు, అదింకో పర్యవసానం. అసలు ఫస్టాఫ్ అంతా బిగినింగ్ విభాగం కాదు. పైన చెప్పుకున్న ఫ్యాక్షన్ సినిమాల్లో లాగా పైకి తెలియని మిడిల్ -1. ఇంటర్వెల్లో బాలకృష్ణ బాలకృష్ణ కాదన్న బిగ్ డిక్లరేషన్ తో బయటపడేలాంటి మిడిల్ -1. అంతవరకూ బిగినింగ్ లాగే అన్పిస్తుంది.

ఇంటర్వెల్లో ఏదో ఒక్కటే పెట్టకుండా టర్నింగ్ పెట్టారు, ట్విస్టు కూడా పెట్టారు. పెట్టినప్పుడు ట్విస్టుతో కథ చెప్పకుండా, టర్నింగ్ కి కథనం చేశారు. ట్విస్టు సుప్రీమ్. టర్నింగ్ కేవలం సిట్యుయేషన్. సిట్యుయేషన్ లోంచి ట్విస్టు పుట్టిందంటే, ఆ ట్విస్టే డామినేట్ చేస్తుంది. బ్లాక్ బాక్సుతో టర్నింగ్ కాదు, అతను సాహో అనే ట్విస్టు వెరీ ఇంపార్టెంట్ అవుతుంది.

ఈ ఫస్టాఫ్ కథనంలో చూపించిందంతా నాన్ రెగ్యులర్ నాన్ లీనియర్ (ఫ్యాక్షన్) తో మిడిల్ -1 విభాగం. అయితే ఇంటర్వెల్ నుంచి హీరో సాహో అన్న ట్విస్టుని పక్కనబెట్టి, హీరోకి బ్లాక్ బాక్స్ చిక్కిన టర్నింగ్ లో కథనాన్ని కొనసాగించారు. అంటే సెకండాఫ్ నుంచీ మిడిల్ -2 ఎత్తుకున్నారు. మిడిల్ -1, మిడిల్ -2 పక్కపక్కన ఎలా వుంటుంది? మధ్యలో బిగినింగ్ వుండాలిగా, ఖైదీలో – ఫ్యాక్షన్ లో వున్నట్టు. లేనప్పుడు ఏం కథ చూస్తున్నామో ఏమర్ధమవుతుంది? అందుకే సాహో ఎవరు, అతడి సమస్య, గోల్ ఏమిటనే బిగినింగ్, దాని ప్లాట్ పాయింట్ -1 లేకపోయేసరికి, (బిగినింగ్ లేని) ఈ మిడిల్ -1.మిడిల్ -2 రెండూ వుండీ కూడా మటాష్ అయిపోయాయి.

ఎల్పీ ఎఫ్ లో మిడిల్ ఎక్కడో చివర పిసరంత వుండి మటాషై మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్పించుకోవడాన్ని చూస్తూ వచ్చాం. ఇప్పుడు సాహోలో మిడిల్ వుండీ బిగినింగ్ లేక మిడిల్ మటాష్ అయ్యే అనర్ధాన్ని కొత్తగా చూస్తున్నాం.

సెకండాఫ్ సంగతులు

సరే, ఫస్టాఫ్ బిగినింగ్ కథనమంటూ పైన చాలా ముందే చెప్పుకున్నాం. ఇంటర్వెల్ తర్వాత మిడిల్ మటాష్ బయటపడ్డాక, అది మిడిల్ -1 అని గుర్తిస్తూ, వెంటనే ఇప్పుడు సెకండాఫ్ లో మిడిల్ -2 కథనమెలా వుందని చూస్తే… మనకి ఒక్కముక్కా అర్ధంగాలేదన్న కఠోర సత్యాన్ని ఒప్పుకు తీరాలి. నిజంగా సెకండాఫ్ సినిమా మనకేమీ అర్ధం గాలేదు. అర్ధంగావాలంటే దర్శకుడు రెండో సారి చూడమన్నాడు. రెండో సారి చూసి అర్ధంజేసుకోవడానికి ‘టైటానిక్’ స్క్రీన్ ప్లే పాఠమైతేగా?

రావణాసురుడికి ఎన్ని తలకాయలుంటాయో అంతమంది విలన్లు. ఎవరికి ఎవరేమవుతారో, ఎప్పుడే ట్విస్టు పెడతారో అంతుచిక్కదు. ట్విస్టు మీద ట్విస్టులు. ఎవరితో ఎవరు ఎందుకు కలబడుతున్నారో, ఏమి కోరుకుంటున్నారో బుర్రకెక్కదు. బ్లాక్ బాక్సుతో హీరో ఏం చేయాలనుకుంటున్నాడో, అది చెయ్యకుండా ఎందుకు తనమీద దాడులు జరిపించుకుంటూ బిగ్ యాక్షన్ సీన్సు లో పాల్గొంటున్నాడో తెలియదు. ఒక విలన్ బ్లాక్ బాక్సుకి ట్రాకర్ వుందని, అదెక్కడున్నా తెల్సిపోతుందనీ కంప్యూటర్ మీద ఏదో చేస్తాడు. ఆ తర్వాత దాని సంగతే మర్చిపోతాడు. బ్లాక్ బాక్స్ అనే మాట విమాన ప్రమాదాలు జరిగినప్పుడు వింటూంటాం. ప్రమాద కారణాలు ఆ బ్లాక్ బాక్సులో డేటా వల్ల తెలుస్తాయి. ఇక్కడ ఏ విమాన ప్రమాదంలోంచి దాన్నెత్తు కొచ్చారో, దాంట్లో రెండు లక్షల కోట్ల రూపాయల రహస్యముందని ఒకటే ఆడుకుంటున్నారు. రెండు లక్షల కోట్ల నగదు ఎవరైనా నిల్వ చేయడం సాధ్యమా, అలా చేస్తే 15 లక్షల కోట్ల రూపాయల నగదు చలామణిలో వుండే ఇండియాలో ఆ కొరతకి అల్లకల్లోలం మొదలవదా…అన్న ప్రశ్నలు వద్దు. ఉన్న విలన్లు చాలనట్టు, లీగల్ అడ్వైజర్ గా వున్నావిడ ఉన్నట్టుండి ఒక విలన్ని లేప్పారేసి ఇంకో విలనై పోతుంది. ఇలా చెప్పుకుంటూపోతే పొంతనలేని ట్విస్టు లెన్నో. ఈ ట్విస్టుల వల్ల ఇంటర్వెల్లో ఫ్లాగ్ షిప్ ట్విస్టు – సాహో ఎవరు? – అన్నది కూడా మార్కెట్ వేల్యూ కోల్పోతోందని స్క్రీన్ ప్లే రచయిత గుర్తించలేదు.

ఈ పాటికే మనకి సాహో కథ తెలుసుకోవాలన్న ఆసక్తి నశిస్తుంది. ఎవడైతే ఏంటి, సినిమానే ఐపోతూ వస్తున్నాక. చిట్ట చివరి నిమిషాల్లో సాహో ఫలానా కారు ప్రమాదంలో చనిపోయిన నరాంతక్ రాయ్ కొడుకని ఫ్లాష్ బ్యాక్. అంటే ఇప్పుడు బిగినింగ్ వచ్చిందన్నమాట – మిడిల్ అయిపోయాక! ఇక ఆ తండ్రి చావుకి పగదీర్చుకోవడానికి హీరో ఏమేం చేశాడో ఆ దృశ్యాలు రీప్లే చేస్తూ మనకి గుర్తు చేయడం. అప్పటికి రెండున్నర గంటలు డస్సి పోయివున్న మనకి, ఈ రీప్లే అదనపు భారం బుర్రకెక్కదు. ఇందుకే ఎండ్ సస్పెన్స్ కథలు వద్దురాబాబూ అని హాలీవుడ్ ఏనాడో మానుకుంది. ఇపుడు  మిడిల్ మటాష్ తో బాటు, ఎండ్ సస్పెన్స్ గండంలో కూడా పడిందన్న మాట. మిడిల్ – 1, మిడిల్ -2 ల తర్వాత బిగినింగ్ వస్తే మిడిల్స్ మటాషవడంతో బాటు, ఎండ్ సస్పెన్స్ అవుతుందని ‘సాహో’ తో తెలుసుకోవచ్చు.

మరేం చేసి వుండాలి?
మిడిల్ -1 కీ, మిడిల్ – 2 కీ మధ్య ఫ్లాష్ బ్యాక్ రూపంలో బిగినింగ్ రావాలని శాస్త్రం చెప్తుంది. ఖైదీ చెప్పింది, ఫ్యాక్షన్ సినిమాలు చెప్పాయి. అందువల్ల – ఇంటర్వెల్లో బ్లాక్ బాక్స్ తో వచ్చిన టర్నింగ్ ని సస్పెన్స్ లోపెట్టి, సాహో ట్విస్టుతో సెకండాఫ్ ప్రారంభించాలి. అంటే సాహో ఫ్లాష్ బ్యాక్ ఏమిటో, దాని తలూకు బిగినింగ్ విభాగం పూర్తి చేయాలి. మఫియాలతో అతడి రివెంజి గోల్ ఏమిటో రివీల్ చేయాలి. అప్పుడు ఇంటర్వెల్లో సస్పెన్స్ లో పెట్టిన బ్లాక్ బాక్స్ టర్నింగ్ తో మిడిల్ – 2 ని మొదలెట్టుకుని, క్లయిమాక్స్ లో రివెంజి తీర్చుకుని ముగించాలి.

ఇలా చేస్తే హీరోది తండ్రిని చంపిన రివెంజి కథేనని మధ్యలోనే తెలిసిపోయి ప్రేక్షకులు చప్పరించేస్తారని, స్క్రీన్ ప్లే రచయిత ఈ బిగినింగ్ ని తీసికెళ్ళి చివర్లో పెట్టుకున్నట్టుంది. దీంతో వరసగా రెండు మిడిళ్ళు ఎందుకోసం జరుగుతున్నాయో రెండున్నర గంటలపాటు అర్ధంగాకుండా పోయింది. మరి రొటీన్ రివెంజి కథని రివెంజి కథ అని తెలియకుండా చేయడమెట్లా?

అకిరా కురసావా ‘సెవెన్ సమురాయ్’ తీశాడు. దాని రీమేకుగా హాలీవుడ్ ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ తీసింది. దీని రీమేకుగా హాలీవుడ్లోనే తాజాగా ఆంటన్ ఫుక్వా, డెంజిల్ వాషింగ్టన్ తో, రీబూట్ చేసిన ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ తీశాడు. ఇది బందిపోట్ల బారి నుంచి ఊరుని కాపాడే ఏడుగురు కిరాయి సైనికుల కథ. దీన్నే తీసుకుని హిందీలో ఖోటే సిక్కే, షోలే లాంటివి వచ్చాయి. అయితే కురసావా వొరిజినల్లో, మొదటి హాలీవుడ్ రీమేక్ లో, హీరో పాత్రతో పర్సనల్ టచ్ లేదు. ఊరుని కాపాడే సామాజిక ఎమోషనే వుంటుంది. ఫుక్వా రీబూట్ చేసి పర్సనల్ టచ్ ఇచ్చాడు బిగ్ స్టార్ డెంజిల్ వాషింగ్టన్ పాత్రకి. ఎంత యాక్షన్ హీరో అయినా కంట్లో తడి అవసరం.

కిరాయి సైనికులకి ఓ పని చేపట్టడానికి డబ్బే మోటివ్. ఇంతకంటే కారణం వుండనవసరం లేదు. అలా ఊరుని కాపాడ్డానికొచ్చిన డెంజిల్ వాషింగ్టన్, కథ ముగిసి చివర్లో విలన్ని పట్టుకున్నాక, ‘ఆ నాడు మా అమ్మనీ, చెల్లినీ చంపింది నువ్వే కదరా’ అని ఒక్క డైలాగుతో ఎమోషనలై లేప్పారేస్తాడు.

రెప్పపాటులో ఒక ఫ్లాష్ లా వెళ్లి పోతుందీ చివరి బిట్. తనవాళ్ళని విలన్ ఎలా చంపాడూ, ఏం జరిగిందీ ఫ్లాష్ బ్యాక్ తో రచ్చబండ పెట్టుకోలేదు. రొచ్చు అవుతుంది. కేవలం ఒక్క డైలాగే మెరుపులా.

ఇది మనకి సూటిగా గుచ్చుకుని ఉలిక్కిపడతాం. ఇంత పర్సనల్ బాధని గుండెల్లో దాచుకుని పరోపకారం చేస్తున్నాడా – అని హీరో పాత్ర ఉన్నతంగా కన్పిస్తుంది. ఇదే వాషింగ్టన్ ని ఫుక్వా తర్వాత ‘ఈక్వలైజర్ -2’ లో, చివర్లో పర్సనల్ టచ్ తో ఉన్నతమైన వ్యక్తిగా బలంగా రిజిస్టర్ చేస్తాడు. హై కాన్సెప్ట్ కథల్లో హీరో లేదా హీరోయిన్, చిన్న మనసుతో తమ కోసమే బతుకుతూ వుండవు, పెద్ద మనసుతో పరులకోసం కూడా బతుకుతాయి. సాహోసారు ఇలా బతకాల్సింది.

అప్పుడు రివెంజి పాయింటు బయటపడకుండా ఆల్టర్నేట్ స్క్రీన్ ప్లే ఎలా వుండొచ్చు? స్ట్రెయిట్ నేరేషన్ అంటే లీనియర్ కథనంతో ఫస్టాఫ్ తో అదే ప్లాట్ పాయింట్ -1 తోనే, తర్వాత ఇంటర్వెల్లో బ్లాక్ బాక్సు తో ఆ టర్నింగ్ తోనే, దాని కథ చేస్తూ సెకండాఫ్ కెళ్ళాలి. ఇంటర్వెల్లో అతను సాహో అని రివీల్ చేయకూడదు. సాహో అన్న సంగతి, రివెంజి సంగతీ, ఇప్పుడు తనే మాఫియా వారసుడనే సంగతీ, అనూహ్యంగా చిట్టచివర్లో పైన చెప్పుకున్న పుఖ్వా రీబూటింగ్ ప్రకారం – పర్సనల్ టచ్ గా, పనిలో పనిగా మాస్టర్ స్ట్రోక్ గా డైలాగ్ తో ఇచ్చి వదిలెయ్యాలి.

మరి కేవలం బ్లాక్ బాక్స్ తో స్ట్రెయిట్ నేరేషన్ కథెలా చెప్పొచ్చు? ఫస్టాఫ్ లో హీరో అండర్ కవర్ పోలీసుగా కథనం ఏమైనా బాగుందా? అతను దొంగ అన్న విషయం దాచి పెట్టారు, తర్వాత సాహో అన్న విషయమూ దాచి పెట్టారు. ఇన్ని దాచిపెట్టడాలు బావున్నాయా ఎండ్ సస్పెన్స్ తో? ఇది మర్డర్ మిస్టరీ కాదుగా? యాక్షన్ జానర్ కదా? యాక్షన్ జానర్ కి సీన్ టు సీన్ సస్పెన్స్ వుండాలిగా? దొంగ అన్న సంగతి మూసి పెట్టి, నడపడం వల్ల డ్రామా లేకుండా పోయిందిగా? రెండు వేల కోట్ల దోపిడీ ఇన్వెస్టిగేషన్ అతడితో ఏ డైమెన్షన్ లేకుండా ఫ్లాట్ గా, డల్ గా, యమబోరుగా సాగిందిగా?

అందుకని, దొంగోడని ప్రేక్షకులకి చెప్పేసి, పాత్రలకి దాచి పెట్టి, తను చేసిన దోపిడీని తనే ఇన్వెస్టిగేట్ చేసే గమ్మత్తైన డైమెన్షన్, డ్రామా, డైనమిక్స్ వగైరాలాతో హుషారెక్కించేలా ఫన్ రైడ్ చేయొచ్చుగా? ఆఫ్టరాల్, హై కాన్సెప్ట్ మూవీ అంటే ఏమిటి? పిల్లల కాడ్నించీ పెద్దల వరకూ అలరించేదేగా? అన్నీ డార్క్ పాత్రలతో వికర్షించేలా ఇంత డార్క్ మూవీయే తీయాలా? హాలీవుడ్ వాడైతే ఆ బ్లాక్ బాక్స్ కి మిథికల్ మహిమ అంటగట్టేసి ఫాంటసీ చేస్తాడు. టెక్నికల్ గా హాలీవుడ్ రేంజిలో తీశామనడం గొప్పా? విషయపరంగా భారతీయత ఏది? హై కాన్సెప్ట్ ‘భారతీయుడు’ లాంటి భారతీయత? అంతర్జాతీయ సమాజం ఇదే చూస్తుంది : టెక్నికల్ గా హాలీ వుడ్ తో సరితూగారు సరే, హాలీవుడ్ కథలే మళ్ళీ మామీద ఎందుకు మోపుతారు, మీ భారతీయ కథేదీ? ఆస్కార్ కూడా ఇదే ప్రశ్న వేస్తుంది.

―సికిందర్