‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్‌ అక్షయ్‌ ఎంట్రీ.. శివుడి పాత్రధారి అతడేనంటూ ప్రచారం!

కథానాయకుడు మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రానున్న చిత్రం ‘కన్నప్ప’.. స్టార్‌ ప్లస్‌లో ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో ఇది రానుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో వివిధ భాషలకి చెందిన పలువురు అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మరో స్టార్‌ హీరోను చిత్రబృందం రంగంలోకి దింపింది. అక్షయ్‌ కుమార్‌ దీనిలో భాగం కానున్నారని తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసింది.

సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ను తెలుగు చిత్ర పరిశ్రమలోకి స్వాగతం పలుకుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన భాగం కావడంతో ‘కన్నప్ప’ మరింత ఉత్కంఠభరితంగా మారింది. మాకు థ్రిల్‌గా ఉంది. మర్చిపోలేని సాహసానికి సిద్ధంగా ఉండండి అని పేర్కొంది. గతంలో 1993లో ఓ కన్నడ సినిమాలో అక్షయ్‌ కనిపించారు. ఆ తర్వాత 2018లో రజనీ హీరోగా తెరకెక్కిన ‘రోబో2.0’లో తమిళ పరిశ్రమకి పరిచమయ్యారు. ఇ

ప్పుడు ఈ మూవీతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవల ‘ఓమైగాడ్‌2’లో అక్షయ్‌ శివుడిగా కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. ‘కన్నప్ప’లోనూ ఆయన అదే పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు శివుడి పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్నట్లు టాక్‌ వినిపించింది. ఇప్పుడు అక్షయ్‌ ఎంట్రీ ఇవ్వడంతో మలుపు తిరిగింది.

ఈ చిత్రంలో అగ్ర కథానాయకులు మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శివరాజ్‌కుమార్‌, శరత్‌ కుమార్‌ భాగమయ్యారు. విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా.. ప్రభాస్‌, నయనతారలు కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భరతనాట్యంలో నిష్ణాతురాలైన ప్రీతి కథానాయికగా కనిపించనున్నారు. పోరాట ఘట్టాలతోపాటు, నృత్య నైపుణ్యంతో ప్రేక్షకులకు కనువిందు చేసే పాత్రలో ఆమె కనిపిస్తుందని దర్శకుడు చెప్పారు.