అన్నకి తక్కువ, బాబుకి ఎక్కువ: మహా నాయకుడు’ (రివ్యూ)

‘మహా నాయకుడు’ 
దర్శకత్వం : క్రిష్ 
తారాగణం : బాలకృష్ణ, విద్యాబాలన్, కళ్యాణ్ రామ్, రానా, సచిన్ ఖెడేకర్
తదితరులు 
రచన : బుర్రా సాయినాథ్, సంగీతం : కీరవాణి, ఛాయాగ్రహణం : జ్ఞాన శేఖర్ 
బ్యానర్ : ఎన్ బి కే ఫిలిమ్స్, వరాహ చలనచిత్రం, విబ్రి మీడియా 
నిర్మాతలు : బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి 
విడుదల : ఫిబ్రవరి 22, 2019
2.5 / 5

          రెండు భాగాల ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం కథానాయకుడు జనవరిలో విడుదలైంది. దానికి  ప్రేక్షకుల తీర్పు ఆశించిన విధంగా రాలేదు. దీంతో వెంటనే విడుదల కావాల్సిన రెండో భాగాన్ని వాయిదా వేశారు. ఈలోగా వైఎస్ ఆర్ బయోపిక్ ‘యాత్ర’ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందననే రాబట్టుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం విడుదలైంది. మొదటి భాగం ఎన్టీఆర్ సినిమా జీవితమైతే, రెండో భాగం రాజకీయ జీవితం. ఈ రాజకీయ జీవితం కూడా పూర్తిగా తీయలేదనేది తెలిసిందే. మరి ఈ అసంపూర్ణ రాజకీయ జీవితాన్ని ఎలా చూపించారు? బాలకృష్ణ ఎలా నటించారు? ఫలితమెలా వచ్చింది? ఇవి తెలుసుకుందాం.

కథ 

          మొదటి భాగం ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించడంతో ముగిస్తే, అక్కడ్నించీ ఈ రెండో భాగం ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ పార్టీ లోగో తనే రూపొందించుకుని, ఆ పార్టీ జెండాతో చైతన్య రధం మీద ప్రజల్లోకి  వెళ్తారు. ఎన్టీఆర్ కి ప్రజల నుంచి వస్తున్న విపరీత మద్దతు చూసి ఆయన రాజకీయ కలల్ని దెబ్బతీయడానికి హఠాత్తుగా ప్రధాని ఇందిరా గాంధీ ముందస్తు ఎన్నికలకి వెళ్ళడంతో, ఎన్టీఆర్ దీన్నిప్రజా మద్దతుతోనే ఎదుర్కొని భారీ మెజారిటీతో ఎన్నికలు గెల్చి ముఖ్యమంత్రి అవుతారు. తను వాగ్దానం చేసిన విప్లవాత్మక సంస్కరణల్ని అమలు చేసేస్తారు. కాంగ్రెస్ పార్టీలో వుంటూ ఓడిపోయిన అల్లుడు చంద్రబాబు నాయుడుని పార్టీలో  చేర్చుకుని పార్టీ నిర్మాణ బాధ్యతలప్పగిస్తారు. ఢిల్లీలో జరిగిన ఎన్ డిసి సమావేశంలో ఇందిరా గాంధీ బిత్తరపోయేలా ప్రవర్తించి వస్తారు. దీంతో ఇందిరాగాంధీ మనసులో బీజం పడుతుంది. ఈ బీజానికి ఆర్ధిక మంత్రిగా వున్న నాదెళ్ళ భాస్కరరావు రూపంలో ఎరువు లభిస్తుంది. ఇంతలో ఎన్టీఆర్ భార్య బసవతారకమ్మకి క్యాన్సర్ అని తెలియడంతో, తనకీ గుండాపరేషన్ అవసరముండడంతో, ఇద్దరి చికిత్సకీ ఆమెని తీసుకుని అమెరికా వెళ్తారు ఎన్టీఆర్. ఇటు నాదెళ్ళ తన పనికానిచ్చేస్తారు. ఎన్టీఆర్ వచ్చేటప్పటికి తిరుగుబాటు ఎమ్మెల్యేలతో తను ముఖ్యమంత్రి అయిపోతారు. ఈ ‘వెన్నుపోటు’ కి ఎన్టీఆర్ షాక్ తింటారు. ఇక అనూహ్యంగా అధికారాన్ని కోల్పోయిన తను ఇప్పుడేం చేశారన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 

          ఎన్టీఆర్ కి తక్కువ, బాబుకి ఎక్కువ అన్నట్టు వుంది. పార్టీ యువ కార్యకర్తలకి చంద్రన్న భరోసాలా వుంది. ఇప్పటి పార్టీ అవసరాలకి తగ్గట్టు వుంది. అంతే కదా? కాలాన్ని బట్టి కథల్ని వాడుకోవాలి. బాబు లేకపోతే బర్తరఫ్ అయిన అన్నఇక ఇంతే సంగతులు – అనే అర్ధం వచ్చేలా బాబు బయోపిక్ – సారీ – ఎన్టీఆర్  బయోపిక్ తీసినట్టు  తెలిసిపోతూనే వుంటుంది. ఈ రెండు భాగాల బయోపిక్ బసవతారకమ్మ జ్ఞాపకాలుగా ఫ్లాష్ బ్యాక్ గా ప్రారంభమైనవి కనుక, ఆమె మృతి వరకే ఎన్టీఆర్ రెండేళ్ళ రాజకీయ జీవితాన్ని చూపే వీలయ్యింది. బసవతారకమ్మ పాయింటాఫ్ వ్యూలో చూపడం వల్ల, ఇంకా ఎన్టీఆర్ మృతి వరకూ కొనసాగిన వివాదాస్పద రాజకీయ పరిణామాల్ని చూపించకుండా తప్పించుకునే ఎలిబీ దొరికినట్టయింది. చూపించనంత వరకే ఎన్టీఆర్ బయోపిక్ అయితే, మిగతా జీవితం?

ఎవరెలా చేశారు 

          రాజకీయ పాత్రలో ఎన్టీఆర్ కి బాలకృష్ణ సరిపోయారు. అయితే వాయిస్, మాడ్యులేషన్ రొటీన్ బాలకృష్ణ మాట్లాడుతున్నట్టే వుంటాయి. ఎన్టీఆర్ మాటాడినట్టు గొంతు తగ్గించి నిదానంగా, గంభీరంగా మాట్లాడినట్టు లేదు. ఎన్టీఆర్ వాడే పదాలు కూడా వుండవు. ప్రధానంగా బ్రదర్ అనే పదం మిస్సయ్యింది. మిగతా హావభావాలు, శరీర భాష బాలకృష్ణ సమర్ధవంతంగానే పోషించారు. ఐతే భార్యతో వున్న సెంటిమెంటల్ సీన్లు బలహీనంగానూ, కృత్రిమంగానూ వుండడంతో ఫ్యామిలీ డ్రామా విషయంలో బాలకృష్ణ నిస్సహాయులై పోయారు. ఒక ఫ్యామిలీ డ్రామా చాలా రివర్స్ లో వుంటుంది. గుండాపరేషన్ చేయించుకుని వచ్చి, బర్తరఫ్ కి గురైన ఎన్టీఆర్ ఇంటికి వస్తే- మీరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని భార్య అనడం, ప్రజాబలమే ఆయన గుండె బలమని కొడుకు హరికృష్ణ అనడం-అన్యాయంగా వుంది. ప్రజల్లోకి వెళ్తానని ఆయన అంటే, వద్దని వారించాల్సిన పాత్రచిత్రణ జరగాల్సిన చోట రివర్స్ దారుణంగా చూపించారు.

          ఎన్నికల ప్రచారంలో కూడా, అనుకోకుండా ఇందిరా గాంధీ సభ జరుగుతూంటే ఎదురు పడిన ఎన్టీఆర్ వూరేగింపుని పోలీసులు అడ్డుకునే డ్రామా కూడా అసహజంగా వుంది.  పోలీసులు ఆపగానే ఎన్టీఆర్ ఊరేగింపుని ఆపెయ్యమని నాయకులకి చెప్పకుండా, రభస జరిగాక మందలించడం, తెలుగు సంస్కృతి అంటూ ప్రసంగించడం అసహజంగా వుంది. ప్రధాని ప్రధానియే. ఈ ప్రోటోకాల్ చాలు గౌరవించడానికి. ఆడవారిని గౌరవించడం తెలుగు సంస్కృతి అనే డైలాగుకి, జెండర్ ప్రస్తావన కి చోటేలేదు. అనవరంగా తెలుగు సంస్కృతిని లాగి వూగిపోవడం.

          ఎన్ డిసి సమావేశం అసలుకి వివాదాస్పదమైంది. ఇంకా రాజకీయ పరిణతి సంతరించుకోని ఎన్టీఆర్ ఇందిరాగాంధీ ముందు ఓవరాక్షన్ చేసి చేతులారా పదవికి ఎసరు తెచ్చుకున్నారనేది కాదనలేని వాస్తవం. దీన్ని బయోపిక్ పరంగా ఇందిరా గాంధీ ముందు హీరోయిజంగా చూపించినప్పటికీ, లాజికల్ గా చూపించలేక పోయారు. దీంతో ఇక్కడ బాలకృష్ణ పాత్రచిత్రణ సినిమా కథగా ఒప్పించదు. దీని ప్రభావం ఆ తర్వాత చూపించిన పరిణామాలపై కూడా పడింది. బాలకృష్ణ పాత్ర అలా ప్రవర్తించకపోతే ఈ బయోపిక్ అంతా అంత జరిగేది కాదుకదా అన్న ప్రశ్న ఎదురవుతుంది. 

          ఢిల్లీ నుంచి డమ్మీ ముఖ్యమంత్రులూ అని తెగిడిన ఎన్టీఆరే, తన మంత్రివర్గంలో మంత్రులు డమ్మీలు కావడమనే వైరుధ్యం కూడా వుంది. పాత్ర చిత్రణ పరంగా చూస్తే బాలకృష్ణ పాత్రని ఏమనుకోవాలి? కానీ ఎన్టీఆర్ లోపాల్ని కూడా హీరోయిక్ లక్షణాలు అన్నటుగా చూపించారు. ఇదే ‘థాకరే’ బయోపిక్ లో అతడి అడ్డగోలు తనాన్ని దాచుకోకుండా అడ్డగోలు తనంగానే చూపించారు- అతను సమాజం బాగుకోరే యాంటీ హీరో అనే నిర్మోహమాటంగా చూపించారు. 

          బసవతారకమ్మ పాత్రలో విద్యాబాలన్ బావుంది. తెలుగు పాత్రలో ఇమిడిపోయింది. ఇక చంద్రబాబుగా రానా స్థానంలో మరొకర్ని ఊహించలేం. ఆ చూపు, మొహం, గొంతు సరీగ్గా సరిపోయాయి. కాకపోతే బయోపిక్ తనదే అన్నట్టు వుంది పాత్ర. అయితే ఈ పాత్ర వాస్తవంలో ఎన్టీఆర్ పిలిచి పెట్టుకుంటే పార్టీలోకి వచ్చిందా, లేక తానుగా వచ్చి చేరిపోయిందా? మొదటిదే కరెక్ట్ అని చూపించారు. ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోయాక మిగిలిన ఎమ్మెల్యేలని కాపాడుకునే వ్యూహ ప్రతివ్యూహాలు, ఎమ్మెల్యేలతో ఢిల్లీ యాత్రలో హీరోయిజాలూ వగైరా కాస్త ఓవర్ గానే వున్నాయి. తను లేకపోతే ఎన్టీఅర్ పునర్ పట్టాభిషేకం లేదన్నట్టే వుంది. ఇది బసవతారకమ్మ పాయింటాఫ్ వ్యూలో వుంది. నాదెళ్ళ భాస్కరరావుగా సచిన్ ఖెడేకర్ పవర్ఫుల్ గా వున్నాడు. 

          బుర్రా సాయినాథ్ మాటలు రాజకీయ ఎన్టీఆర్ ని అంతగా ప్రతిబింబించవు. కీరవాణి సంగీతం ఫర్వాలేదు. జ్ఞాన శేఖర్ ఛాయగ్రహణం ఓకే. కానీ ఈ బయోపిక్ కి పీరియడ్ లుక్ తో లేకపోవడం దర్శకుడు క్రిష్ లోపం.

చివరికేమిటి 

          ఫస్టాఫ్ కథని ఎస్టాబ్లిష్ చేస్తూ నీటుగా వున్నా, సెకండాఫ్ బర్తరఫ్ ఆందోళనలతో డాక్యుమెంటరీలా మారిపోయింది. దీన్ని నివారించే అవకాశమూ లేదు. అక్కడి వరకూ ఎన్టీఅర్ రాజకీయ ప్రస్థానమే అలావుంది. ‘వెన్నుపోటు’ చుట్టూ కథలో ఎన్టీఆర్ కేంద్రంతో తలపడ్డారే తప్ప నాదెళ్ళతో కాదు. దీంతో ప్రత్యర్ధితో ప్రత్యక్ష పోరుగా సినిమాటిక్ అనుభవానికి దూరమైపోయింది. డాక్యుమెంటరీ మాత్రంగా మిగిలింది. ఇంకోవైపు బాబు పాత్ర డామినేషన్ తో ఎన్టీఆర్ నాయకత్వ పాత్ర చిత్రణ అంతంత మాత్రమై పోయింది. 

          దర్శకుడు క్రిష్ ఇంతకంటే న్యాయం చేయడం సాధ్యం కాదు,  పార్టీ కోసం తీసిన బయోపిక్ కాబట్టి. అయితే పార్టీ కోణంలో తీసి వుంటే, ఇదే అదునుగా బాబు చేత కేంద్రం మీద డైలాగులు కొట్టిస్తే, నేడు ఆయన కేంద్రం మీద విసురుతున్న బాణాలకి కనెక్ట్ అయి మాస్ అప్పీల్ తో ఈలలు పడేవి. ఎలక్షన్ బయోపిక్ గా వుండేది. ఈ మార్కెట్ యాస్పెక్ట్ ని వదులుకున్నారు.

―సికిందర్