తెలుగు సినిమా టిక్కెట్ల వ్యవహారంపై సినీ, రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా రచ్చ జరుగుతున్న విషయం విదితమే. తెలంగాణలో టిక్కెట్ల రేట్లు పెంచారు, ఏపీలో తగ్గించారంటూ గతంలో యాగీ జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ సినిమా టిక్కెట్ల ధరలు పెరిగాయి.
కానీ, తమ సినిమా టిక్కెట్ల ధరలు పెంచడంలేదంటూ ఈ మధ్య చాలా సినిమాలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది. సామాన్యుడికి సినిమా టిక్కెట్ ధర అందుబాటులో వుండాలని అప్పట్లో వైఎస్ జగన్ చెప్పారు. ‘కొందరు మా మంచి నిర్ణయాన్ని కూడా తప్పు పడుతున్నారు.. పేదవాడికి సినిమాని దూరం చేస్తున్నారు..’ అని మండిపడ్డారు కూడా.
అప్పుడు వైఎస్ జగన్ చెప్పిందే, ఇప్పుడు చాలామంది సినీ ప్రముఖులూ చెబుతున్నారు. సినిమా టిక్కెట్ల ధరలు అందుబాటులోకి వచ్చాక, క్రమంగా సినిమా థియేటర్ల వైపు జనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగని, పూర్తిగా సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అనలేం.
జనం సినిమా థియేటర్లకు రాకపోవడానికి చాలా కారణాలున్నాయి. అందులో సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారం కూడా ఒకటి. ఆ ఒక్కటి గురించి వైఎస్ జగన్ గట్టిగా మాట్లాడారు గనుక, సినీ అభిమానులు కూడా ‘వైఎస్ జగన్ చెప్పిందే రైటు..’ అంటూ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమలోనూ లోతైన చర్చ జరుగుతోంది. దాన్ని సినీ పరిశ్రమలోనే ఇంకొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అన్న ప్రస్తావననే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు చాలాకాలంగా.
ఒక్కటి మాత్రం నిజం.. సమోసా కంటే తక్కువ ధరకి సినిమా టిక్కెట్ అనడం సబబు కాదు. అదే సమయంలో టిక్కెట్ల ధరలు పెంచేయడమూ సబబు కాదు. చంద్రబాబు హయాంలో సాగిలపడ్డ తెలుగు సినీ పరిశ్రమలో కొందరు, వైఎస్ జగన్ విషయంలో ‘జీర్ణించుకోలేని తత్వాన్ని’ ప్రదర్శించడం శోచనీయం. ఆ పైత్యం ఇంకా ఇంకా కొనసాగుతుండడం ఆశ్చర్యకరం.