హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కామన్ మ్యాన్ నుంచి ప్రముఖ సెలబ్రెటీల వరకు అందరూ కూడా ఈ ప్రకృతిని ఇంకా డ్యామేజ్ చేయవద్దనేలా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఇప్పటికే నగరంలో కాలుష్యం ఎక్కువవుతోందని అంటున్నారు. ఇక వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం తమదిగా ప్రకటించి, పారిశ్రామిక అవసరాల కోసం వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించింది.
ఇప్పటికే బుల్డోజర్లు, ప్రొక్రెయినర్లతో చదును పనులు వేగంగా కొనసాగాయి. ఈ పనులపై విద్యార్థులతో పాటు పలువురు ప్రజా సంఘాలు, విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వర్సిటీ భూములపై రాష్ట్రానికి ఎలాంటి హక్కు లేదని వారు వాదిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2004లోనే ఈ భూములు తమకు బదలాయింపు జరిగాయనీ, వర్సిటీకి గోపనపల్లిలో ప్రత్యామ్నాయ భూములు అప్పట్లో ఇచ్చామని వివరణ ఇచ్చింది.
అయినా ఆ భూములు చట్టబద్ధంగా ఎలా తమకు వచ్చాయని స్పష్టత లేదని విద్యార్థులు అంటున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన కొంతమంది సంఘాలు, ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. బుధవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు… పూర్తిగా వాదనలు వినలేకపోవడంతో విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే తదుపరి తీర్పు వెలువడేవరకు చదును పనులను నిలిపివేయాలని మౌఖికంగా ప్రభుత్వానికి సూచించింది. దీంతో అక్కడ జరుగుతున్న చదును కార్యక్రమాలకు తాత్కాలిక బ్రేక్ పడినట్టయింది.
ఇప్పుడు అందరి దృష్టి గురువారం జరిగే హైకోర్టు విచారణపై ఉంది. కోర్టు తీర్పు వచ్చే వరకు వర్సిటీ భూముల్లో ఎలాంటి పనులు జరగవు. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే చదును తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఈ భూముల విషయంలో మరింత చర్చ, రాజకీయ తగాదాలు ముదిరే అవకాశం ఉంది. మొత్తానికి వర్సిటీ భూములపై తుది తీర్పు వెలువడే వరకు ఉద్రిక్తత మాత్రం అలాగే కొనసాగేలా కనిపిస్తోంది.