ఆధునిక తెలుగు సినిమా మైలురాయి: కేరాఫ్ కంచరపాలెం (మూవీ రివ్యూ)

 

దర్శకత్వం: వెంకటేశ్ మ‌హా

తారాగణం : సుబ్బారావు, రాధాబెస్సీ, కేశ‌వ్, కార్తిక్ ర‌త్నం, నిత్య‌శ్రీ, విజ‌య ప్ర‌వీణ‌, మోహ‌న్ భ‌గ‌త్, ప్ర‌ణితా ప‌ట్నాయ‌క్ త‌దిత‌రులు

సంగీతం: స్వీకర్‌ అగ‌స్తి, ఛాయాగ్ర‌హ‌ణం: ఆదిత్య జ‌వ్వాడి, వ‌రుణ్ ఛాపేక‌ర్

నిర్మాత‌: విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి

స‌మ‌ర్ప‌ణ‌: ద‌గ్గుపాటి రానా

విడుద‌ల‌:  సెప్టెంబర్ 7, 2018

 

మారేటింగ్ 3 / 5

 

 

          ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో వుంటున్న సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. అతి తక్కువ బడ్జెట్ లో కొత్త కళాకారులతో సినిమాలు రావడం కొత్తేం కాదు. అయితే తక్కువ బడ్జెట్లో తీసినప్పటికీ అవి  పెద్ద సినిమాలకి జిరాక్స్ కాపీలుగా తీస్తేనే నిర్మాతలు ముందుకువచ్చే రోజులు నడుస్తున్నాయి. దీనివల్ల సహజ సినిమాలు తెరకెక్కకుండా భూస్థాపిత తమైపోతున్నాయి. చాలా అరుదుగా ఎప్పుడోగానీ సహజత్వాన్ని కూడా వ్యాపారంగా నమ్మి డబ్బు పెట్టే నిర్మాతలు రావడంలేదు. ఇలాటి అరుదైన సందర్భంలో నిర్మాతగా విజయ ప్రవీణ పూనుకుని దర్శకుడు వెంకటేశ్ ప్రయత్నాన్ని పూర్తి చేశారు. ఈ ప్రయంతం ఎలా వుందో ఒకసారి చూద్దాం…

 

కథ

          కంచర పాలెంలో రాజు (సుబ్బారావు) అనే వయసు మళ్ళిన వ్యక్తి ప్రభుత్వాఫీసులో అటెండర్ గా పనిచేస్తూంటాడు. 49 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకపోవడంతో వూళ్ళో అందరికీ చులకన అవుతాడు. అదే ఆఫీసుకి ఓడిశా నుంచి రాధ (రాధా బెస్సీ) అనే ఆఫీసర్ ట్రాన్స్ ఫరై వస్తుంది. ఆమె వయసు 42. ఆమెకి భర్త పోయి, ఇరవయ్యేళ్ళ కూతురు వుంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఆమె రాజుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. దీంతో ఆమెకి విషమ పరిస్థితులు ఎదురవుతాయి.

          వూళ్లోనే వైన్ షాపులో గడ్డం (మోహన్ భగవత్) అనే అతను పని చేస్తూంటాడు. ఆ వైన్ షాపుకి ప్రతిరోజూ సలీమా (విజ‌య ప్ర‌వీణ) అనే అమ్మాయి వచ్చి మద్యం కొనుక్కు పోతూంటుంది. ఆమెని ప్రేమించిన గడ్డం ఆమెకి దగ్గరైనప్పుడు, ఆమె గురించిన ఒక చేదు నిజం తెలుస్తుంది.

          వూళ్ళో ఒక రౌడీ దగ్గర పనిచేసే జోసఫ్ (కార్తీక్ రత్నం), భార్గవి (ప్రణితా పట్నాయక్) వెంటపడతాడు. ఇద్దరి మధ్య ఒక గొడవ వుంటుంది.  ఆ గొడవ రౌడీ తీర్చి ఇద్దరి ప్రేమకి బాసటగా నిలుస్తాడు. కానీ భార్గవి తండ్రి వల్ల సమస్య వచ్చి భార్గవి జోసఫ్ కి దూరమై పోతుంది.

          స్కూల్లో చదివే సుందరం (కేశవ్), సునీత (నిత్యశ్రీ) పరస్పరం ఆకర్షణ పెంచుకుంటారు. ఆమె స్కూలు పోటీల్లో ఓ పాట పాడేందుకు సుందరం నేర్పుతాడు కూడా. ఆ పాటే వాళ్ళిద్దర్నీ విడదీస్తుంది. దీంతో ఆగ్రహించిన సుందరం తండ్రి తయారు చేసిన వినాయకుడి విగ్రహానికి నష్టం చేస్తాడు. దీంతో అతడి జీవితమే మారిపోతుంది…

          ఈ నాల్గు ప్రేమ కథల  అసలు ముగింపేమిటన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

          నాల్గైదు కథల సినిమాలు ఇటీవల తెలుగులో కొన్ని వచ్చాయి. చందమామ కథలు, మనమంతా, ఆ! … అనేవి. ఇవేవీ సక్సెస్ కాలేదు. ప్రస్తుత కథల సంపుటి భిన్నమైనది. పూర్తిగా రస్టిక్ వాతావరణంలో, అండర్ డాగ్స్ పాత్రలతో, అధోజగత్ ప్రేమల్ని ఇది చూపిస్తుంది. మతం –ప్రేమ ఈ రెండిటి చెలగాటాన్ని ముసుగు తీసి చూపిస్తుంది. ఫార్ములా  కథల బారిన పడకుండా పచ్చి జీవితాలెలా వుంటాయో రుచి చూపిస్తుంది. హాస్యాన్ని షుగర్ కోటింగ్ లా వాడుకుంటూ సీరియస్ గా ఆలోచింపజేస్తుంది. ఇది ఇండీ ఫిలిం కోవకి చెందిన సమాజిక కథ. సమాజంలో తెరకెక్కని జీవితాల్ని తెరకెక్కించిన కొత్త పంథా కథ.

ఎవరెలా చేశారు

          ఇందులో నటించిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. సలీమా ముస్లిం అనే వేశ్య పాత్ర నటించిన నిర్మాత విజయ ప్రవీణ కూడా. ప్రధాన పాత్ర రాజుగా సుబ్బారావు, ఇతర ముఖ్య పాత్రల్లో రాధా బెస్సీ,  కార్తిక్ ర‌త్నం, ప్ర‌ణితా ప‌ట్నాయ‌క్, మోహ‌న్ భ‌గ‌త్, నిత్య‌శ్రీ, కేశవ్ మొదలైన వారంతా ఈ కథకి, తమ పాత్రలకి కొత్త వాళ్ళనే తేడా తెలియనివ్వకుండా ఉత్తమ స్థాయి ప్రతిభ కనబర్చారు. ప్రేక్షకుల మనస్సుల్లో ముద్రేసుకుని చాలాకాలం వుండిపోయే సహజ నటనలివి. ఆఫీసర్ పాత్రలో ఒడిశా నటి రాధా బెస్సీ చాలా ఎక్సెలెంట్. ఇంకా  సహాయ పాత్రలు సహా వీళ్ళందరూ కంచరపాలెం కి చెందిన వాళ్ళే కావడం ఒక రికార్డు. ఊరు ఊరంతా కదిలి తమ వూరి కథ – సినిమా తీసి గర్వంగా చూపినట్టుంది.

          తక్కువ బడ్జెట్ లో తీశారన్నవెలితి ఎక్కడా కలగనివ్వకుండా కథకి, పాత్రలకి తగ్గ సందుగొందుల లొకేషన్స్ లో సాంకేతికంగా ఉన్నతంగా తీశారు.  స్వీకార్ సంగీతం కూర్చిన సందర్భానుసారం వచ్చే పాటలూ, నేపధ్య సంగీతం పాటలు సన్నివేశాలకి బలాన్ని చేకూరుస్తాయి. వరుణ్‌ చపేకర్‌, ఆదిత్య జవ్వాదిల ఛాయాగ్రహణం పూర్తిగా రియలిస్టిక్ లుక్ తో వుంటుంది. రవితేజ ఎడిటింగ్ లో ఎలాటి గిమ్మిక్కులు వుండవు. విజువల్ కాలుష్యం ఎక్కడా కనపడదు. సంభాషణలు నిత్య జీవితంలో ప్రజలు మాట్లాడుకునే మాటలే. కమర్షియల్ సినిమాల్లో కన్పించని కులాల్ని, మతాల్ని ఎదిరించే మాటలు సూటిగా సహజంగా ఒలికిపోతాయి. ఒడిశా పాత్ర రాధతో చెప్పించిన హిందీ డైలాగులు హిందీ సినిమాల ఉచ్ఛారణతోనే వుంటాయి.

 

చివరికేమిటి

          ఇది ఇండీ ఫిలిం. అంటే ఇండిపెండెంట్ ఫిలిం గా దర్శకుడి సినిమా. షార్ట్ మూవీస్ నుంచో, ఇంకెక్కడ్నుంచో వస్తున్న కొత్త కొత్త దర్శకులు ఇండీ ఫిలిమ్స్ పేరుతో, క్రౌడ్ ఫండింగ్ మూవీస్ పేరుతో ఇష్టారాజ్యమైన  కళా ప్రదర్శన చేస్తూంటారు. అసలిలాటి సినిమాలకి కళే బలం, టెక్నాలజీ కాదు. ఆ కళేమీ తెలియకుండా ఎలాపడితే అలా చుట్టేసే వాళ్ళే ఎక్కువ. ప్రస్తుత ఇండీ ఫిలింతో దర్శకుడు వెంకటేష్  రాయడంలోనే గాక, తీయడంలో కూడా నిష్ణాతుడన్పించుకున్నాడు. తన ఇండీ ఫిలిం తనిష్టం అన్నట్టు స్ట్రక్చర్ లేకుండా ఈ కథలు చూపెట్టలేదు. పూర్తిగా స్ట్రక్చర్ లోనే రాయడం, తీయడం చేశాడు. దీన్ని చూసి ఇతర షార్ట్ మూవీస్, ఇండీ ఫిలిమ్స్ ఔత్సాహికులు నేర్చుకోవాల్సిందెంతో వుంది. ఇలాటి కమర్షియలేతర సినిమాలు కూడా ఎంతో కొంత ఆడాలంటే కమర్షియల్ సినిమాల స్ట్రక్చర్ లో పాత్రలు, కథా కథనాలూ వుండాల్సిందే. సుమారు రెండున్న గంటల ప్రేమకథల ఈ ఆంథాలజీని, ఎలాటి కమర్షియల్ మసాలాలూ గట్రా లేకుండా, క్షణం బోరుకొట్టకుండా, ఆద్యంతం కుతూహలాన్ని పెంచుతూ దర్శకత్వం వహించడానికి ఎంతో అనుభవం కావాలి. ఆ అనుభవమంతా వెంకటేష్ కి వుంది. తెలుగు సినిమాల ఆధునిక చరిత్రలో ‘కేరాఫ్ కంచరపాలెం’ ఒక మెయిలు రాయి.

 

―సికిందర్