రేవంత్ రెడ్డిపై సిఇఓ రజత్ కుమార్ కు ఫిర్యాదు

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి షాకింగ్ న్యూస్. ఆయన మీద ప్రత్యేకమైన నిఘా పెట్టాలంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు టిఆర్ఎస్ పార్టీకి చెందిన అడ్వొకెట్స్. 

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి పొత్తు పెట్టుకుంటున్నాయని, ఈ ఎన్నికల్లో ఎపి సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు 500 కోట్లు ఖర్చు చేయబోతున్నారని అడ్వొకెట్స్ తెలిపారు. ఆ డబ్బును రేవంత్ ద్వారానే తెలంగాణలో పంచబోతున్నారని తమకు అనుమానం ఉందని తెలిపారు.

రేవంత్ రెడ్డి గతంలో కూడా ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయలను ఆంగ్లో ఇండియన్ సభ్యుడైన స్టీఫెన్ సన్ కు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ విషయాన్ని ఈ సందర్భంగా అడ్వొకెట్స్ గుర్తు చేశారు. 

రజత్ కుమార్ కు రేవంత్ మీద ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న టిఆర్ఎస్ అడ్వకెట్ అనీల్ కుమార్

మరోవైపు రేవంత్ రెడ్డి తెలంగాణ ఆపద్ధర్మ సిఎం కేసిఆర్ మీద, తెలంగాణ మంత్రుల మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు కుట్రలు, కుతంత్రాలకు రేవంత్ ను పావుగా వాడుకుంటున్నాడని, రేవంత్ రెడ్డి మీద ప్రత్యేక నిఘా ఉంచాలని వారు ఎన్నికల సంఘాన్ని కోరారు. 

తెలంగాణలో ఈ ఎన్నికలు సాఫీగా సాగాలంటే రేవంత్ ను ఎన్నికల కమిషన్ కట్టడి చేయాలని, ఆయన కదలికలపై అనుక్షణం నిఘా పెట్టాలని వారు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రేవంత్ పై ప్రత్యేక నిఘా ఉంచాలని కోరారు. 

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్న చంద్రబాబు ఆ పార్టీకి 500 కోట్లు రేవంత్ ద్వారానే ఇవ్వబోతున్నట్లు వివిధ పత్రికల్లో వచ్చిన లీడర్ల స్టేట్ మెంట్స్ ను కూడా ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో జత చేశారు అడ్వొకెట్స్. రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయకపోతే ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయని వారు అనుమానం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ న్యాయవాదులు  అనీల్ కుమార్, రాంరెడ్డి, ఇంద్రకుమార్, ఇంద్రసేనారెడ్డి, చక్రధర్ రెడ్డి, పి. శ్రీధర్ తదితరులు ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ న్యాయవాదులు రేవంత్ రెడ్డి మీద ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

అడ్వొకెట్స్ చేసిన ఫిర్యాదు కాపీ కింద ఉంది చూడొచ్చు.