నాడు ఇందిరా గాంధీ – నేడు వైఎస్ జగన్!

ఎన్నికలు సమీపిస్తున్నాయి. “సిద్ధం” అంటూ జగన్ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. “రా.. కదలిరా” అంటూ చంద్రబాబు సభలు పెడుతున్నారు. ఇక టెంటులు వేసి “శంఖారావం” అంటూ లోకేష్.. తాను వెళ్లిన ప్రతీచోట ఫంక్షన్ హాల్ లో పవన్ కల్యాణ్.. మీటింగ్స్ ఏర్పాటూ చేస్తున్నారు. అలా ఎవరికి వారు రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజేస్తున్నారు. ఈ సమయంలో సామాన్యుడికి ఒక సందేహం.. రెండు ప్రశ్నలు! ఒకటి… ఈసారి కూడా జగన్ గెలిస్తే…? రెండు… ఈసారి జగన్ ఓడిపోతే…?

సాధారణంగా 2019లో వచ్చిన మెజారిటీతో పాటు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అందించిన సంక్షేమ ఫలాలను.. మాట నిలబెట్టుకునే తత్వాన్ని.. కరోనా కష్టకాలంలోనూ ప్రజల గురించి ఆలోచించిన విధానాన్ని.. పోర్టులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, కొత్త విమానాశ్రయాల నిర్మాణాలపై తీసుకున్న శ్రద్ధను.. దృష్టిలో పెట్టుకుంటే రెండో ప్రశ్న ఉత్పన్నం కాదు! కానీ… ఈసారి జరుగుతున్నది ఎంపీలు, ఎమ్మెల్యేలను ఓట్ల రూపంలో ఎన్నుకునే ఎన్నిక కాదు.. యుద్ధం!!

అవును… రాష్ట్రంలోని ఆల్ మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపైకి వచ్చాయి. కొన్ని తెరముందు పొత్తు పెత్తుకుంటే.. కొన్ని తెరవెనుక పసుపు రంగు పూసుకున్నాయని అంటున్నారు! వాస్తవానికి కమ్యునిస్టులు సైతం టీడీపీ – జనసేనతో కలవాల్సిందే… అయితే బీజేపీ కలిసే అవకాశం ఉండటం వల్ల వారు కాస్త వెనకడుగు వేస్తున్నారు తప్ప… మనసంతా టీడీపీ – జనసేన కూటమి మీదే ఉందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి! ఇక మీడియా సంగతి చెప్పేపనేలేదు!

ఏపీలో ఒకవర్గం మీడియా పూర్తిగా కూటమి వైపు వెళ్లిపోయింది అనేకంటే… జగన్ కు తీవ్ర బద్ద శత్రువుగా మారిపోయింది అనడం బెటర్. మీడియా కక్ష గడితే ఈ స్థాయిలో ఉంటుందా అన్న విషయం 1977లో ఇందిరాగాంధీ సమయంలో, 1995 ఎన్టీఆర్ సమయంలో నాటి తరం పెద్దలు చూసి ఉంటారు! ఈ క్రమంలో.. ఈ జనరేషన్ కు జగన్ పై ఒక వర్గం మీడియా వ్యవహరిస్తున్న తీరు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది!

వాస్తవానికి 1977 సమయంలో దేశంలోని ఆల్ మోస్ట్ అన్ని రాజకీయ పక్షాలు కలిసి ఒక్క తాటిపైకి వచ్చాయి. అటు పక్క ఇందిరా గాంధీ మాత్రం మిగిలారు. ఇలా అన్ని రాజకీయ పక్షాలు, బలమైన మీడియా, మొదలైనవారంతా ఒకవైపు ఉండగా.. ఇందిరా గాంధీ ఒంటరిగా నిలిచారు. ఈ సమయంలో దేశం మొత్తం మీద కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీయడంతో ఇందిర గాంధీ ఓడిపోయారు. దీంతో.. అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే… అచిరకాలంలోనే ఆ ప్రభుత్వం పేకమేడలా కూలిపోయింది!

కట్ చేస్తే… ఇప్పుడు ఏపీలో ఆల్ మోస్ట్ అలాంటి పరిస్థితే ఉంది! ఈ సమయంలో.. జగన్ ఓడిపోతే..? కచ్చితంగా ఇబ్బందులు పడొచ్చు! అటు పార్టీపరంగా, ఇటు వ్యక్తిగతంగా ప్రత్యర్థుల దాడిని భరించాల్సి రావొచ్చు. కోర్టు మెట్లు ఎక్కడం, దిగడం తప్పకపోవచ్చు! 2014 తరహాలోనే పోరాటాలు చేయాల్సి రావొచ్చు! గతంలో కంటే ఎక్కువ సమస్యలే ఫేస్ చేయాల్సి రావొచ్చు. కుటుంబం కూడా ఇబ్బందిపడొచ్చు. ఆనుచరులకూ ఇబ్బందులు తప్పకపోవచ్చు.

ఈ క్రమంలో.. 2029 ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వంపై ప్రజలకు మనసు విరిగినా.. సంక్షేమ పథకాల అమలులో తేడా కొట్టినా.. చంద్రబాబు 2014 తరహా పాలననే మరోసారి తెరపైకి తెచ్చినా.. జగన్ ని వెంటనే అందలం ఎక్కించేస్తారు ప్రజలు! నాడు ఇందిరాగాంధీ 1977 తర్వాత ఎంత బంపర్ మెజారిటీతో గెలిచారో అలాంటి విక్టరీనే జగన్ కు దక్కే అవకాశం ఉంది!

ఒక వేళ వచ్చే ఎన్నికల్లో కూడా చాలామంది భావిస్తున్నట్లుగా జగన్ బంపర్ మెజారిటీతో కాకపోయినా.. ఒక మోస్తరు మెజారిటీతో గెలిచి అధికారంలోకి వస్తే మాత్రం… పరిస్థితులు పూర్తిగా మారిపోతాయనే భావించాలి. 2029 ఎన్నికల సమయానికి ఏపీలో ప్రతిపక్షం మనుగడే ప్రశ్నార్థకం అయినా ఆశ్చర్యపోనక్కరలేదని అంటున్నారు పరిశీలకులు! అందుకే… జగన్ ఈసారి గెలవకూడదని యాగాలు, యజ్ఞాలు, పూజలు, పోరాటాలు చేస్తున్నాయి విపక్షాలు! ఒకవేళ అవేవీ ఫలించక ప్రజలు తిరిగి జగన్ ను కోరుకుంటే… మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ టైపులోనే ఉంటుందేమో..!!