చిన్న పనికే ఈ కలెక్టరమ్మకు పిట్టకూర తెచ్చి ఇచ్చారు

ఆమె బాగా చదువుకుని కలెక్టర్ అయింది. అయినా ఆమె చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆమె ఎక్కడ పనిచేసినా ప్రజలకు సేవ చేస్తూ వారి మనసు గెలుచుకుంటుంది. కలెక్టర్ ను అన్న గర్వం ఈసమంత కూడా కనబడదు ఆమెలో. నిరాడంబరతకు పెట్టింది పేరు ఈ కలెక్టరమ్మ. కాసులు, కమిషన్ల కోసం ఆరాటపడే కలెక్టర్లు ఉన్న ఈ రోజుల్లో.. ప్రజలకు సేవ చేయడం కోసం ఊరు కాని ఊరిలో పట్టుపట్టి వారి భాష నేర్చుకుని మరీ వారిలో కలిసిపోతున్న ఈ కలెక్టరమ్మ ఎవరో కాదు.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దేవరాజన్ దివ్య.  కలెక్టర్ దేవరాజన్ దివ్య పై తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ మీకోసం చదవండి.

దేవరాజన్ దివ్య.. తన పని తీరుతో ఆదిలాబాద్ ప్రజల  గుండెల్లో స్థానం సంపాదించింది. దివ్య స్వస్థలం తమిళనాడు రాజధాని చెన్నై. ఆమె విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగింది. ఆమె చెన్నై బిట్స్ పిలానిలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అందులో నుంచే పీజీ చేశారు.  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రైల్వే అకౌంట్స్ ఆఫీసర్ గా కూడా ఆమె పనిచేశారు. ప్రజలకు సేవ చేయాలనే తపన దివ్యలో బాగా ఉంటుంది.  అందుకే ఎక్కువ మంది ప్రజలకు సేవా చేయాలంటే సివిల్స్ సాధించాలనే లక్ష్యం పెట్టుకుంది దివ్య. అలా తన ప్రణాళిక వేసుకుని సివిల్స్  ప్రిపరేషన్ కోసం  చైన్నై నుంచి ఢిల్లీ వెళ్లింది. అలా సివిల్స్ కోసం కోచింగ్ తీసుకుంటూ 2009 లో రాసిన సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 37 వ ర్యాంకు సాధించింది.  2010 లో ఐఎఎస్ ట్రైనింగ్ ముగిశాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను తన సర్వీసులో ఎంచుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆమె తెలంగాణను ఎంచుకున్నారు. అలా ఆమె హైదరాబాద్ జీహెచ్ ఎంసీలో అకౌంట్స్ ఆఫీసర్ గా ఆ తర్వాత భువనగిరి సబ్ కలెక్టర్ గా పనిచేశారు.

భువనగిరి సబ్ కలెక్టర్ గా పనిచేసినప్పుడు ఎదురైన తన అనుభవాలను దివ్య పలు సందర్భాల్లో జనాలతో పంచుకున్నారు. ఒకరోజు ఆమె ఆఫీసుకు వెళుతుండగా ఎరుకల కులానికి చెందిన కొంత మంది ఆమెకు ఎదురుపడ్డారు. తమ ఇళ్ల పట్టాల పత్రాలు జారీ  చేయాలని ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని వారు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే స్పందించిన దివ్య వారికి ఇళ్లపత్రాలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

రెండు రోజుల తర్వాత ఆ ఎరుకల కులస్థులు ఆఫీసుకు రెండు పిట్టలను కాల్చుకొని వాటికి  పసుపు పూసి తీసుకొచ్చి దివ్యకు అందజేశారు. దాంతో ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్న పని చేసి పెడితే కృతజ్ఞతగా వారు తన కడుపు నింపాలని చూశారని ఆమె వారి అభిమానాన్ని మెచ్చుకున్నారు. అటువంటి వారికి సేవ చేయడంలోనే మనకు సంతోషం ఉంటుందని చెప్తుంటారు దివ్య. ఈ  సంఘటనను తాను ఎప్పుడూ మర్చిపోనని దివ్య చాలా సందర్భాల్లో తన మిత్రులతో షేర్ చేసుకున్నారు.

ఆ తర్వాత ఖమ్మం ఐటిడీఎ పీడిగా అటు నుంచి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత  వికారాబాద్ కు కలెక్టర్ గా నియమితులయ్యారు. వికారాబాద్ కలెక్టర్ గా పనిచేసినప్పుడు ఆమె ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా శక్తి వంచన లేకుండా పనిచేశారు. అంతేకాకుండా పెద్దేముల్ మండలం చైతన్య నగర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, వీధి దీపాలు, నీటిఫ్లాంట్లు, వైద్య సదుపాయాలు, ఆడపిల్లల చదువుపై ప్రత్యేక శ్రధ్ద తీసుకొని అన్ని వసతులు కల్పించారు.

ఇదే సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులకు, లంబాడీలకు మధ్య రిజర్వేషన్ల చిచ్చు రేగింది. పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. దీంతో ఆదిలాబాద్ లో నెలకొన్న అశాంతిని చల్లబరచాలంటే దివ్వ దేవరాజన్ ను కలెక్టర్ గా పంపాలని సర్కారు నిర్ణయించి అమలు చేసింది. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి మంచి పేరున్న కారణంగా ఆమెను గొడవలు చల్లార్చడానికి ఆదిలాబాద్ బదిలీ చేశారు. అప్పటి వరకు పెద్దగా తెలియని ఆమె పేరు ఆదిలాబాద్  కలెక్టర్ గా బాద్యతలు చేపట్టాక హాట్ టాపిక్ అయింది.

ఆదిలాబాద్ కలెక్టర్ గా దివ్య బాధ్యతలు చేపట్టాక ప్రజలలో చాలా మార్పు తీసుకొచ్చింది. ఆదిలాబాద్ అటవీ జిల్లా కావడంతో ఎక్కువ మంది  ప్రజలు అడవుల్లోనే జీవిస్తున్నారు. దీంతో ముందుగా దివ్య ప్రజల చెంతకు వెళ్లి వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకున్న చతురతతో వారి మధ్య గొడవలను సునాయాసంగానే చల్లార్చింది. ఒక దశలో ఆమె గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు ఎవ్వరూ ఆమెతో సమస్యలు చెప్పటానికి ముందుకు రాలేదు. దీనికి కారణం కలెక్టర్ దివ్యకు వారి  భాష అర్థం కాకపోవడం. భాష రాని కలెక్టర్ కు ఏం సమస్యలు చెప్తామని జనాలు దూరంగా ఉండేవారట. ఈ విషయాన్ని ఆమె పసిగట్టారు.

విషయం తెలుసుకున్న కలెక్టర్ దివ్య  తమ  ఆఫీసులో పనిచేసే గిరిజన సామాజికవర్గానికి చెందిన ఉద్యోగి నుంచి రోజు ఉదయం రెండు గంటల పాటు ట్యూషన్ చెప్పించుకొని గిరిజన భాష  నేర్చుకున్నారు. ఇప్పుడు ఆమె గ్రామాలకు వెళ్లినప్పుడు గిరిజన భాషలోనే మాట్లాడుతుంది. దీంతో ప్రజలంతా తమ సమస్యలు చెబుతున్నారు. వాటిని ఆమె కూడా వెంటనే పరిష్కరించి వారికి న్యాయం  చేస్తున్నారు.

ఈ మధ్య కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనిచేసే గోపాల్ తన పెండ్లికి కలెక్టర్ ను ఆహ్వానించారు. అసలు ఆమె పెళ్లికి వస్తుందో రాదో అని గోపాల్ కూడా అనుమానం వ్యక్తం చేశాడట. ఆ అనుమానాలను పటా పంచలు చేస్తూ గుడిహత్నూర్ మండలం గోపాల్ పూర్ లో జరిగిన గోపాల్  పెళ్లికి దివ్య  హాజరయ్యారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పెళ్లికి రావడంతో తండా ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అక్కడ ఆమె ఏ మాత్రం హంగామా  ప్రదర్శించకుండా పెళ్ళికి వచ్చిన వారితో కలిసిపోయింది. సాధారణ  మహిళగా కిందే కూర్చోని పెళ్లిజరిగేంత వరకు అక్కడే ఉంది. ఆ తర్వాత గిరిజనుల సాంప్రదాయం ప్రకారం చేసే ధింసా నృత్యం చేసి అందరిని ఆకట్టుకున్నారు.

ఉట్నూర్ మండలంలో జరిగిన మండల సమావేశంలో గిరిజనుల భాషను మాట్లాడి అధికారులను, ప్రజలను దివ్య ఆశ్చర్యపరిచారు. ఈ మధ్య కురిసిన వర్షాలకు చెరువులు నిండి పలు గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. ఓ గర్బిణికి నొప్పులు రావడంతో సకాలంలో అంబులెన్సు అక్కడికి చేరుకోలేక పోయింది. గర్బిణి కడుపులోనే బిడ్డ చనిపోయింది. విషయం తెలుసుకున్న దివ్య చలించిపోయారు. వెంటనే తను ఆ గర్బిణి ఉన్న  గ్రామానికి చేరుకుని బిడ్డను కోల్పోయిన తల్లిని ఓదార్చి ధైర్యం చెప్పారు.

దేవరాజన్ దివ్య  భర్త ఢిల్లీ యూనివర్సిటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. చిన్నపాటి పనిచేస్తేనే పెద్ద హడావుడి చేసే ఈ రోజుల్లో కలెక్టర్ గా ప్రజలకు తాను ఎంత సేవ చేసినా దివ్య మాత్రం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ప్రజల మనిషిగా వ్యవహరించి, ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న కలెక్టర్ దేవరాజన్ దివ్య ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు.