తెలంగాణ సర్కార్ పై రేషన్ డీలర్ల గుస్సా

తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై రేషన్ డీలర్లు అసంతృప్తిగా ఉన్నారు. గురువారం రేషన్ డీలర్ల సమస్యలపై తెలంగాణ సబ్ కమిటీ చర్చించింది. గతంలో డీలర్లకు కిలో బియ్యంపై ఇస్తున్న కమిషన్ 20 శాతం నుంచి 70 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపు సెప్టెంబర్ 1వ తేది నుంచి అమల్లోకి వస్తుందన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం 2015 అక్టోబర్ 1 నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లిస్తామని తెలిపారు.

ప్రభుత్వం చేసిన ప్రకటనపై రేషన్ డీలర్లు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 80 శాతం కమిషన్ ఇస్తుందని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏం చేసిందని వారు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం కేంద్రప్రభుత్వం 35 శాతం కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం 35శాతం కమిషన్, మెయింటనెన్స్ చార్జీల కింద 17 శాతం కమిషన్ మొత్తం 87 శాతం కమిషన్ ఇవ్వాలని నిబంధనే ఉందన్నారు. ప్రభుత్వం 70 శాతం కమిషన్ మాత్రమే ఇస్తుందని వారు వాపోయారు.

రేషన్ డీలర్లకు నెల వారీ జీతం లెక్కన ఇవ్వాలని, తమను ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్న డిమాండ్ చేశారు. నెలల తరబడి ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఉద్యమం చేస్తే ప్రభుత్వం కొత్తవారిని తీసుకుంటాం, మహిళ సంఘాలకు అప్పగిస్తామని బెదిరించడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రభుత్వం పెంచిన కమిషన్ ఏ మాత్రం సరిపోదని ఇది న్యాయబద్దమైనది కాదన్నారు. తమకు నెలవారీ జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెంచిన కమిషన్ పై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.