తెలంగాణలో ఒంటి గంట వరకు 48.09 శాతం పోలింగ్

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 48.09 శాతం పోలింగ్‌ నమోదైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం ఎక్కువగా నమోదవుతోంది. ఉదయం 11 గంటలకే గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం ఓటింగ్‌ నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది.

ఓటు వేసేందుకు యువత ఎక్కువగా తరలివస్తున్నారు. చాలా ప్రాంతాలలో ఓటర్లంతా స్వచ్చందంగా తరలివచ్చి ఓటింగ్ లో పాల్గొంటున్నారు. మరో 3 గంటల్లో పోలింగ్ ముగియనుంది. 13 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తున్నారు.

ముఖ్యంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గంలో 11 గంటలకు 35 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నల్లగొండలో 39.86 శాతం నమోదైంది.

తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 1821 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 2.81 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1.90 లక్షల మంది భద్రతా సిబ్బంది పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్నారు.

అధికార టిఆర్ఎస్, ప్రజాకూటమి అధికారం కోసం తలపడుతున్నాయి. మరోవైపు భాజపా, బీఎల్‌ఎఫ్‌, ఎంఐఎం సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వల్ప ఘటనల మినహా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.