తెలంగాణ సిఎం కేసిఆర్ ఖాతాలో మరో రికార్డు

తెలంగాణ సిఎంగా ప్రమాణం చేసిన నాటినుంచి కేసిఆర్ అనేక రంగాల్లో రికార్డులు నెలకొల్పారు. రికార్డులు నెలకొల్పే ఉద్దేశంతోనే కేసిఆర్ పలు విప్లవాత్మకమైన కార్యక్రమాలు, పథకాలు షూరూ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసిఆర్ పథకాలు ప్రవేశపెట్టారంటూ గులాబీ నేతలు పదే పదే తమ ప్రసంగాల్లో అంటూ ఉంటారు. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ప్రకటనల్లో చాలా సందర్భాల్లో దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రభుత్వం ఇది చేస్తుంది.. అది చేస్తుందంటూ రావడం పరిపాటిగా మారింది.

రికార్డులు మీద రికార్డులు నెలకొల్పినట్లు గులాబీ నేతలు చెబుతున్నమాట. అందులో భాగంగానే కోట్లాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి రికార్డు నెలకొల్పారు కేసిఆర్. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని రీతిలో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని రీతిలో మిషన్ భగీరథ చేపట్టినట్లు ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్నమాట. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో మిషన్ కాకతీయ చేపట్టినట్లు చెబుతారు. అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గొర్రెల పంపిణీ చేపట్టి యాదవుల మనసు దోచుకున్నారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపు అయితే మరో రికార్డు నాణినికి రెండో వైపు ఉంది అదేమిటో కింద చదవండి.

తెలంగాణ సిఎం కేసిఆర్ పలు కారణాల రిత్యా సచివాలయానికి రాకుండా పాలన సాగిస్తున్నారు. ఆరంభంలో ఆయన సచివాలయానికి వచ్చారు. తర్వాత తర్వాత రావడం తగ్గించారు. వారంలో ఒకసారి రెండుసార్లు మాత్రమే వచ్చారు. కొన్నిసార్లయితే ఆదివారం కూడా సచివాలయం వచ్చారు. ఆదివారాల్లో సచివాలయంలో కేబినెట్ సమావేశాలు జరిపిన దాఖలాలున్నాయి. 2016 నవంబరు 25న ప్రగతి భవన్ నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశం చేశారు. కానీ నవంబరు 28న సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు కేసిఆర్. అదే ఆయన సచివాలయంలో కాలు పెట్టిన చివరి రోజు.  ఎప్పుడైతే ప్రగతి భవన్ నిర్మాణం పూర్తయిందో అప్పటి నుంచి కేసిఆర్ సచివాలయం రావడం కంప్లీట్ గా మానేశారు. అంతకుముందు కూడా సచివాలయానికి రాకుండా బేగంపేటలోని పాత క్యాంపు ఆఫీసులోనే అదికారిక సమీక్షలు, సమావేశాలు నడిపారు. సరిగ్గా ఇప్పటికి కేసిఆర్ సచివాలయం రాకుండా 606 రోజులు (జులై 27వ తేదీనాటికి)  అయిందని చెబుతున్నారు. సిఎం కేసిఆర్ గురించి కార్యకర్తలు చెప్పుకోలేని రికార్డు ఇది. వాళ్లకు ఇష్టం లేకపోయినా ఈ రికార్డును కేసిఆర్ సొంతం చేసుకున్నారు.

ఆయన సచివాలయానికి రాకపోవడానికి భయంకరమైన వాస్తుదోషమే కారణమని ఒకసారి చెప్పారు. తర్వాత దాన్ని సవరించుకుని వాస్తు దోషం కూడా అందులో ఒక భాగం అని సెలవిచ్చారు. వాస్తు దోషం ఉన్న కారణంగానే సచివాలయాన్ని కూలగొట్టి వేరేచోట కొత్తది కట్టాలని సంకల్పించారు. దానికోసం కొద్దికాలం హడావిడి చేసి తర్వాత సైలెంట్ అయ్యారు. కేసిఆర్ సచివాలయానికి వచ్చిన రోజుల సంఖ్య కంటే గవర్నర్ వద్దకు వెళ్లిన రోజుల సంఖ్య ఎక్కువ అని బిజెపి నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఏకంగా సమాచార హక్కు చట్టం ద్వారా కేసిఆర్ సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారు? రాజ్ భవన్ కు ఎన్నిసార్లు వెళ్లారు అన్నదానిపై దరఖాస్తు కూడా చేశారు. 

ఇక కేసిఆర్ సచివాలయం రాకపోవడానికి, మంత్రి మండలిలో మహిళా మంత్రులు లేకపోవడానికి కేసిఆర్ నమ్మకాల్లో భాగమే అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కొత్త సచివాలయాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తామని ప్రకటించినా దాని గురించి ఇప్పుడు ఊసే ఎత్తడంలేదు. విపక్షాలు కూడా కొత్త సచివాలయ నిర్మాణం చేపడతామన్న ప్రకటనపై భగ్గుమన్నాయి. ముందుగా క్యాన్సర్ హాస్పటల్ ను ఖాళీ చేయించి అక్కడ సచివాలయం కడతామన్నారు. కానీ అది కుదరలేదు. తర్వాత బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయం అన్నారు. కానీ అక్కడా ఏమాత్రం హడావిడి లేదు. ఇదంతా వ్యూహాత్మక వైఖరిగానే ప్రతిపక్ష పార్టీలు అంచనాకొచ్చాయి.

సచివాలయానికి రాకుండా 600 రోజులు పాలించిన ముఖ్యమంత్రులెవరూ దేశంలో లేరని చెబుతున్నారు. కేసిఆర్ నెలకొల్పిన ఈ రికార్డు గతంలో ఎవరూ నెలకొల్పలేదు. భవిష్యత్తులో ఎవరు కూడా ఈ రికార్డును బ్రేక్ చేయకపోవచ్చని అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సిఎం లుగా పనిచేసిన వారంతా సచివాలయం నుంచే పాలన సాగించారు. మొన్న మొన్న పరిపాలన చేసిన చంద్రబాబు ఉదయం 10గంటలకు సచివాలయం వచ్చి సాయంత్రం వెళ్లిపోయేవారు. తర్వాత రాజశేఖరరెడ్డి కూడా ఉదయం పదిన్నరకు వచ్చి సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో వెళ్లిపోయేవారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా సచివాలయం నుంచే పాలన సాగించారు. ఇక రోశయ్య అయితే కొత్త రికార్డు నెలకొల్పారు. ఆయన రాత్రి పూట కూడా సచివాలయంలోనే బస చేసి పాలన సాగించిన సందర్భం ఉంది. వైఎస్ హెలిక్యాప్టర్ గయబ్ అయి ఆయన మరణించారని ధృవీకరణ అయిన తర్వాత సిఎం గా రోశయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో వైఎస్ మృతదేహం కోసం వెతకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అందుకోసం ఆయన రాత్రి సచివాలయంలోనే బస చేశారు. తర్వాత వరదలు సంభవించినపుడు కూడా ఆయన సచివాలయంలో రాత్రి నిద్ర చేశారు.

ఇలా తెలంగాణ సిఎం కేసిఆర్ టిఆర్ఎస్ నేతలు గర్వంగా చెప్పుకునే రికార్డులతో పాటు మింగుడుపడని రికార్డులను సైతం నెలకొల్పడం చర్చనీయాంశమైంది. 

కేసిఆర్ సచివాలయానికి రాక 600 రోజులే అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కేసిఆర్ కొత్త రికార్డు ఇదే అంటూ ఒక ఫొటోను పోస్టు చేస్తున్నారు. అది సరైన సమాచారం కాకపోయినా వైరల్ అయింది. ఆ ఫొటో కింద ఉంది.