జగదీష్ రెడ్డి హత్యకు కుట్ర కాదు, అవినీతిని తేల్చే ప్రయత్నం : బిజెపి నేత సంకినేని

మంత్రి జగదీష్ రెడ్డి పై హత్యకు రెక్కీ నిర్వహించారని వచ్చిన వార్తలు నిజం కాదని అది మంత్రి అవినీతిని బయట పెట్టేందుకు చేసిన ప్రయత్నమని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే  సంకినేని వెంకటేశ్వరరావు తెలిపారు. మంత్రి జగదీష్ రెడ్డి తన స్వగ్రామం సూర్యాపేట జిల్లా నాగారంలో అక్రమాలకు విరుద్దంగా చెరువు శిఖంలో ఇల్లు నిర్మిస్తున్నారని సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు.

మంత్రి అక్రమాలను వెలికితీసేందుకే ఈ నెల 2న తన కుమారుడు వరుణ్ నాగారంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ చేపట్టారని సంకినేని వెంకటేశ్వరరావు తెలిపారు. మంత్రి జగదీష్ రెడ్డిని హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. జగదీష్ రెడ్డి భూ అక్రమాలను ఆధారాలతో సహా రుజువు చేసేందుకు చేసిన ప్రయత్నమన్నారు. దీనిని కొందరు ఏకంగా రెక్కీ నిర్వహించారు మంత్రి ప్రాణాలకు హాని ఉందని ప్రచారం చేశారని మంత్రిని హత్య చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.

మంత్రి జగదీష్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో అంతా షాక్ కు గురయ్యారు. జగదీష్ రెడ్డిని హత్య చేయాల్సిన అవసరమేముందని,  ఆ అవసరం ఎవరికి ఉందని అంతటా చర్చనీయాంశమైంది. ఎట్టకేలకు అసలు నిజం తెలియడంతో  ఓహో … ఇదా జరిగింది అని అంతా అనుకున్నారు. గ్రామస్థుల్లో కొందరి తప్పుడు ఆలోచనతో ఇంతా జరిగిందానుకున్నారు. మొత్తానికి అసలు నిజం తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.