రేవంత్ రెడ్డికి తొలిసారి రాఖీ కట్టిన ములుగు సీతక్క

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి మహిళా నాయకురాలు రాఖీ కట్టారు. ఆమె రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం ఇదే తొలిసారి. ఆమె ఎవరో కాదు ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క అలియాస్ దనసరి అనసూయ. గత ఏడాది రాఖీ పండుగను రేవంత్ రెడ్డి, సీతక్క ఇద్దరూ టిడిపిలో ఉండే జరుపుకున్నారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి సీతక్క రాఖీ కట్టలేదు. కానీ ఈ రాఖీ పండుగ వేళ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కు తనతో పాటు చేరిన వారిలో అత్యంత సన్నిహితుల్లో సీతక్క కూడా ఒకరు. అందుకే తొలిసారి సీతక్క రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఎంఎల్ పార్టీలో కీలక నేతగా ఉన్న సీతక్క తదనంతర కాలంలో జన జీవన శ్రవంతిలో కలిశారు. ఆమె కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి కావడంతో తెలుగుదేశం పార్టీలోకి ఆమెను చేర్చుకోవడమే కాకుండా ములుగు టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆమె ములుగులో గెలిచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ నుంచి ఎంత వత్తిళ్లు వచ్చినా ఆమె టిడిపిలోనే కొనసాగారు. పార్టీ మాత్రం మారలేదు. అయితే తెలంగాణలో టిడిపికి భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్న తర్వాత రేవంత్ తోపాటు ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టిడిపిలో కొనసాగినంత కాలంలో తొమ్మిదేళ్లు వరుసగా టిడిపి అధినేత చంద్రబాబుకు రాఖీ కట్టినట్టు సీతక్క “తెలుగురాజ్యం” కు తెలిపారు. అదే సమయంలో వరంగల్ టిడిపి నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు కూడా సీతక్క నాలుగైదు సార్లు రాఖీ కట్టారు. దయాకర్ రావును జిల్లాలో అందరూ దయన్న అని పిలిచేవారు. సీతక్క కూడా దయన్న అనే పిలిచేవారు.

టిడిపిలో రేవంత్ రెడ్డి, సీతక్క సుధీర్ఘకాలం ప్రయాణం చేసినా ఎప్పుడూ రాఖీ కట్టిన దాఖలాలు లేవు. గతంలో నాలుగైదు సార్లు ఎర్రబెల్లి దయాకర్ రావుకు రాఖీ  కట్టిన సీతక్క ఈసారి మాత్రం దయాకర్ రావుకు రాఖీ కట్టలేదు. ఒకే పార్టీలో లేకపోవడం ఒక కారణమైతే రేవంత్ తో పాటు సీతక్క కాంగ్రెస్ లో చేరకుండా అడ్డుకునేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు విశ్వప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో కానీ సీతక్క మాత్రం టిఆర్ఎస్ కు వెళ్లకుండా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆ సమయంలోన రేవంత్ ఫ్యామిలికి ఎర్రబెల్లికి మధ్య పెద్ద వివాదం కూడా నడిచింది. రేవంత్ సతీమణి రాత్రికి రాత్రే వెళ్లి సీతక్క కాళ్లు పట్టుకుని బతిలాడి కాంగ్రెస్ పార్టీలో చేర్పించింది అని ఎర్రబెల్లి అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఎర్రబెల్లి చేసిన విమర్శలపై సీతక్క కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తన ఇష్టపూర్వకంగానే కాంగ్రెస్ లో చేరినట్లు వెల్లడించారు సీతక్క. అంతేకాకుండా ‘‘దిగజారి మాట్లాడకు దయన్నా’’ అంటూ ఘాటుగా హెచ్చరించారు సీతక్క. ఇటు ఒకే పార్టీలో లేకపోవడం, అటు పార్టీ మారిన సందర్భంలో విబేధాలు రావడంతో సీతక్క ఈసారి ఎర్రబెల్లికి రాఖీ కట్టలేదు

సీతక్క విషయంలో రేవంత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద ఆసక్తికరమైన విషయాలు చెబుతారట. వంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి చేవెళ్ల చెల్లెమ్మ సబితమ్మ ఎలాగో తనకు సీతక్క అలాగే అని రేవంత్ చెప్పినట్లు ఆయన సన్నిహితులు ‘తెలుగు రాజ్యం’కు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు, రాష్ట్ర ఏర్పాటు అనేది పాత బంధాలు తెగిపోయి కొత్త బంధాలు నెలకొన్నాయని చెప్పవచ్చు.