ఈసీ ఆదేశం.. మళ్లీ ఆగిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’!

రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఇప్పటికే తెలంగాణలో విడుదలైంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఈసీని కోరారు. దీంతో విడుదలను ఆపారు. ఈ వారంలో అక్కడ సినిమాను విడుదల చేయడానికి వర్మ సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఈసీ ఆదేశంతో మళ్లీ విడుదల తేదీ మారింది.

ఎన్నికలు పూర్తయ్యే వరకూ రాజకీయ నాయకుల బయోపిక్‌లను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌-లక్ష్మీపార్వతి బయోపిక్‌ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’, ప్రధాని మోదీ బయోపిక్‌ ‘పీఎం నరేంద్ర మోదీ’, కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ విడుదల తేదీలు మళ్లీ వాయిదా పడ్డాయి. దీంతో మే 19 తర్వాతే ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ఇక తెలంగాణాలో సినిమా రిలీజ్ అవటంతో…బాగుందని టాక్ రావటంతో ఈ చిత్రంపై ఆంధ్రా జనాల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ నేపధ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పైరసీ వెర్షన్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడి చాలా మంది డౌన్ లోడ్ చేసుకుని మరీ చూసేసారని సమాచారం. రిలీజైన రోజు రాత్రికు ఈ సినిమా పైరసీ వెర్షన్ మంచి కాపీతో జనాల ల్యాప్ టాప్ లపై వాలిపోయింది. దాంతో తొలి రోజు రాత్రికల్లా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ని జనాలు చూడటం, మాట్లాడుకోవటం మొదలెట్టారు.

మరో ప్రక్క ఫేస్ బుక్ లో ను ఫుల్ సినిమాని కొందరు పోస్ట్ చేసేసారు. వాట్సప్ లో బిట్లు బిట్లుగా ఈ సినిమాను హల్ చల్ చేస్తోంది. ఇలా పైరసీ ప్రింట్ ఎపిలో కనిపించి, అలరించింది. ఇలా జనం రకరకాలుగా ఈ సినిమాని చూసేసిన నేపధ్యంలో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఏ మాత్రం ఆంధ్రా జనాలను అలరిస్తుందో చూడాలి.