కేసీయార్ వరమిస్తే ఇలాగే వుంటది మరి.!

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇటీవల చేరిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కనుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ నిర్ణయం తీసేసుకున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం కల్పిస్తూ, క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న కేసీయార్, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు. గవర్నర్ ఆమోదంతో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అవడం లాంఛనమే. నిజానికి, పార్టీలో చేరిన అతి కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవడం విశేషమే. కేసీయార్ వరమిస్తే పదవులు.. ఆగ్రహిస్తే అక్రమ కేసులు.. అన్న ప్రచారానికి ఇప్పుడు బలం చేకూరుతోంది. మంత్రి వర్గంలో వున్న ఈటెల రాజేందర్ మీద అక్రమ కేసులు బనాయించి, ఆయన్ని బయటకు పంపారన్న ఆరోపణలు ఇప్పటిదాకా చేస్తూ వచ్చిన రాజకీయ ప్రత్యర్థులు, ఇప్పుడు వాటిని మరింత గట్టిగా వినిపిస్తుండడంతో.. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతోంది టీఆర్ఎస్.

నిజానికి, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెలకు పోటీగా కౌశిక్ రెడ్డి నిలబడాల్సి వుంది. కాంగ్రెస్ నుంచే ఆయన పోటీ చేయాల్సి వున్నా.. అంతకు ముందే ఆయన తెలంగాణ రాష్ట్ర సమితితో లాలూచీ పడ్డారు. ఈ విషయం కాంగ్రెస్ కాస్త ముందుగానే గుర్తించి తేరుకుంది. కౌశిక్ రెడ్డికి సంబంధించిన కీలక ఆడియో టేపుల్ని లీక్ చేసింది కూడా. కాగా, హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎవరు బరిలో నిలుస్తారు.? అన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కేవలం భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పేరు మాత్రమే ఇప్పటిదాకా ఖరారయ్యింది. అయితే, ఇంతవరకు హుజూరాబాద్ ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో, హుజూరాబాద్ కేంద్రంగా గులాబీ పార్టీ బీభత్సమైన రాజకీయాలు నడుపుతోంది.. అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా.