నల్లగొండ సభలో మోదీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగం ఆరంభంలోనే ప్రధాని నరేంద్ర మోదీపై సూటిగా వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా సభలో మోదీ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని, ఘోరమైన మాటలని పేర్కొన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీచేస్తే చచ్చీచెడీ ఒక్కస్థానంలో గెలిచారని, ఇవాళ వాళ్ల మాటలు వింటుంటే కళ్లు తిరిగి కిందపడాలనేట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో కానీ, మోదీ మాట్లాడిన మాటలు కానీ అన్నీ అసత్యాలేనని అన్నారు. 

తెలంగాణలో అమలుచేస్తున్న ఆరోగ్య శ్రీ పథకం కేంద్రం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ కంటే ఎన్నో రెట్లు మెరుగైనదని చెప్పారు. తాము అందిస్తున్న పథకాలనే కాపీ కొడుతూ మోదీ తిరిగి వాటిని తమకే అందిస్తున్నారని ఆరోపించారు. మా ఆరోగ్య శ్రీ గొప్పదో, మీ ఆయుష్మాన్ భారత్ గొప్పదో తేల్చుకోవాలంటే మా జగదీశ్వర్ రెడ్డిని పంపిస్తా, దమ్ముంటే ఎవరైనా ముందుకు రావాలని కేసీఆర్ సవాల్ విసిరారు.

“ఎందుకొచ్చిన సొల్లు ఇదంతా! అయినా ఒక్క మాట అడుగుతున్నా. నరేంద్ర మోదీ ఐదేళ్లలో ఏంచేశాడు? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏంజరిగింది? డబ్బాలో గులకరాళ్లు వేసినట్టు లొల్లి లొల్లి చేస్తారు. రైతులకు ఏమన్నా చేశారా, దళితులకు ఏమైనా చేశారా, ముస్లిం మైనారిటీలకైతే ఏమీ చేయరు” అంటూ నిప్పులు చెరిగారు.