ఒక్క ఫార్ములాతో ప్రభంజనం సృష్టిస్తున్న చంద్రబాబు

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసినప్పటి నుండి రాజకీయవర్గాల్లో వాడి వేడి చర్చలు నడుస్తున్నాయి. ఈ కలయిక తర్వాత రాజకీయ వర్గాల్లోనూ, రాష్ట్ర ప్రజల్లోను అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి. రాహుల్ తో చంద్రబాబు భేటీ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ తో సీట్లు సర్దుబాటు చేసుకుంటారా? లేక జాతీయస్థాయిలో పోరాటానికే కూటమి పరిమితం అవనుందా? ఇలా అనేక సందేహాలు. అయితే చంద్రబాబు తీసుకునే రాజకీయ నిర్ణయాలకు ఒక లెక్క ఉంటుంది. ప్లస్ లు, మైనస్ లు, ఎలా ముందుకెళ్లాలి అని అంచనా వేసుకున్నాకే ఆయన ఒక నిర్ణయానికి వస్తారు. కాంగ్రెస్ తో బంధం గురించి కూడా ఆయన అదే పంధాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.

ఢిల్లీలో రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ-కాంగ్రెస్ పొత్తు ఖరారైందంటూ పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పార్టీ నేతలకు సూచనలు జరీ చేసారు చంద్రబాబు. ఏపీలో పొత్తుల ప్రస్తావన లేదని, కేవలం జాతీయస్థాయిలో కూటమి విషయంలో మాత్రమే కాంగ్రెస్ తో పనిచేయనున్నట్టు చంద్రబాబు స్పష్టత తెలియబరుస్తున్నారు. పార్టీ అంతర్గత చర్చల్లో ఈ విషయమే నేతలకు తేల్చి చెబుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీని కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడమే ఆయన లక్ష్యంగా చెబుతున్నారు చంద్రబాబు.

అయితే దీనికోసం ప్రాంతీయ పార్టీలతో కూటమి పెట్టినా ప్రజల్లో నమ్మకం కుదరదు అనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని ఓడించాలంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకే బీజేపీని ఓడించాలంటే బీజేపీయేతర పార్టీలన్ని కలిసి పోరాడాలి. అప్పుడే బీజేపీకి మరో ఆప్షన్ ఉండదు అనే భావన ప్రజల్లో కలుగుతుంది. ఇక తెలంగాణాలో టీఆరెస్ బలంగా ఉంది. కేసీఆర్ కు పోటీ ఇచ్చే బలమైన నాయకుడు ఎవరు లేరనే భావన అన్ని వర్గాల్లోనూ ఉంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయనను ఎదుర్కోవడం విపక్షాలకు కష్టమే అని టాక్ వినిపించింది.

కానీ కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, టీజేఎస్ మహాకూటమిగా ఏర్పడిన తర్వాత ఆ ఒపీనియన్ చేంజ్ అయినట్టు కనిపిస్తోంది రాజకీయ వాతావరణం. మహాకూటమి ఏర్పడ్డాక రాజకీయ సమీకరణాల్లో అనూహ్య మార్పులు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మహాకూటమి…టీఆరెస్ కు బలమైన పోటీ ఇవ్వనుంది అని చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే ఫార్ములాని దేశం మొత్తం అమలు చేయడానికి పావులు కదుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మోదీని ఎదుర్కోవడానికి దేశం మొత్తం ఏకమైందనే భావన కల్పించడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాహుల్ ని కలిసారని, పొత్తు ప్రస్తావన లేదని పార్టీ వర్గాల సమాచారం.