ప్రజలకు ఆమడ దూరంలో ప్రత్యేక హోదా ఉద్యమం

(యం. పురుషోత్తం రెడ్డి)

రాజకీయ హోదానే లక్ష్యంగా పార్టీలు సాగిస్తున్న ప్రత్యేకహోదా ఉద్యమం మళ్లీ మన ముందుకు వచ్చింది. అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు లేదా కొర్టులో కేంద్రం తన వైఖరిని తెలిపినపుడు మాత్రమే జరిగే ఉద్యమంగా హోదా పోరాటంగా  మారింది. రాజకీయ ప్రక్రియ ద్వారా మాత్రమే వచ్చే అవకాశం ఉన్న హోదాను రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా నేటి రాజకీయ పార్టీలు నడుపుతున్న ఉద్యమం పట్ల ప్రజలకు గానీ ఆయా పార్టీలశ్రేణులకు కూడా నమ్మకం కలిగించలేక పోతున్నది.ఫలితం హోదా ఉద్యమం ప్రజలకు ఆమడదూరంలో ఉంటున్నది.

రాజకీయ ప్రక్రియతోనే హోదా సాధ్యం. కానీ…

విధాన నిర్ణయాలన్నీ రాజకీయ ప్రక్రియతోనే జరుగుతాయి. హోదా కూడా అందుకు మినహయింపుకాదు. కానీ ఏపీలో హోదా ఉద్యమం రాజకీయాలతో సంబంధం లేకుండా సాగుతున్నది. 2014 కు ముందే హోదా కావాలని బీహర్ అసెంబ్లీ తీర్మానం చేసింది. దాని కారణంగా అప్పటి కేంద్రం వేసిన కమిటి ఆ రాష్ట్రానికి హోదా అర్హత లేదని తేల్చింది. అది ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. ఆ తర్వాత ఒడిస్సా కూడా అడిగింది. 2014 విభజన కారణంగా ఏపీకి హోదాను నాటి ప్రధాని మన్మోహన్  గారు రాజ్యసభలో హమీ ఇచ్చినారు. విభజన చట్టంలో ఆ అంశం లేదు.

వెంకయ్య నాయకత్వంలోని బిజెపి  అడ్డంగులు తొలగించి మరీ హోదా ఇస్తామని ప్రజలకు హమీ ఇచ్చినారు. రెండు జాతీయ పార్టీలకూ గతంలో బీహర్ రాష్ట్రం హోదా అడిగిందని తాము ఇవ్వలేదని, భవిష్యత్ లో ఏ రాష్ట్రానికి హోదా ఇచ్చే ఉద్యేశం లేదని తెలుసు. తెలిసినా విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగంగానే హోదానూ ఏపీ కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

హోదాను ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. 2019 తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వాలు. 1. బిజెపి నాయకత్వంలోని  ఎన్డీయే  ప్రభుత్వం 2. కాంగ్రెస్ నాయకత్వంలోనియుపిఎ ప్రభుత్వం. 3. ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్నబిజెపి ప్రభుత్వం తాము హోదాను ఇవ్వలేమని పార్లమెంటులోనూ సుప్రీంలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. రెండవ అవకాశం కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం. కాంగ్రెస్ నేరుగా అధికారంలోకి రాదని అందిరీకి తెలిసిందే. కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతుతో అవకాశం ఉంది. అందులో కీలక భాగస్వామ్య పార్టీలు బీహర్ కు చెందిన లల్లూ ప్రసాద్. బీహర్ కు హోదా ఇవ్వమని గతంలోనే కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్రం తేల్చింది. రేపు వారి కీలక భాగస్వామి అయిన లల్లూను కాదని కాంగ్రెస్ తో రాజకీయంగా సంబంధం లేని జగన్, బాబు నాయకత్వంలోని ఏపీకి హోదా ఇస్తారా. అయినా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ కు ఉంటే విభజన చట్టంలో ఎందుకు పేర్కొనలేదు. తాము అధికారంలోకి వస్దే మొదటి సంతంకం హోదా పైనే అంటున్న కాంగ్రస్ నిన్నటి అవిశ్వాస తీర్మానం సందర్బంగా హోదాను మీరు ఇవ్వకపోతే తాము ఇస్తామని రాహుల్ ఎందుకు చెప్పలేదు.

మరో అవకాశం ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం. అందులో కూడా కీలకంగా ఉండేది లల్లూ, ఒడిస్సా, తమిళనాడు, మమత, అఖిలేష్, మాయావతిలో ఒకరు మన రాష్ట్రం నుంచి జగన్ లేదా బాబులు కీలకంగా ఉంటారు. అలా ఏర్పడే కేంద్రంలో అధిక స్దానాలు ఉండి మనకన్నా వెనుకబడిన బీహర్, ఒడిస్సాలను కాదని ఆపార్టీల భాగస్వామ్యం కలిగిన కేంద్రం ఏపీకీ హోదా ఇవ్వడం సాధ్యమా ? నిన్న అవిశ్వాసం సందర్భంగా  కొన్ని ప్రాంతీయ పార్టీలు బిజెపి  మీద ఉన్న రాజకీయ కారణంతో మద్దతు ఇచ్చినప్పటికి అందులో ఒక్కపార్టీ కూడా ఏపీకి హోదా ఇవ్వాల్సిందే అని మాట్లాడారా లేదు. అలాంటిది రేపు ఇచ్చే పరిస్దితి వస్తే  వారు ఎలా వ్యవహరిస్దారు అనడానికి అవిశ్వాస తీర్మానమే మంచి ఉదా.. కానీ రాజకీయ నిర్ణయంతో వచ్చే అవకాశం ఉన్న హోదాను రాష్ట్రంలోని అధికార టిడిపి విపక్ష వైఎస్ ఆర్ సి  లు పై మౌలిక విషయాల జోలికి వెల్లకుండా హోదా చుట్టూ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.

హోదా ముసుగులో విభజన చట్టాన్ని ఆటకకెక్కించారు

 

రాజకీయ హమీగా ఉన్న హోదా కోసం పోరాడుతున్న పార్టీలు ఆ స్దాయిలో విభజన చట్టం అమలు కోసం పోరాడి ఉంటే మంచి పలితాలు వచ్చి ఉండేది. హోదా వస్తే ప్రయివేటు రంగంలో పరిశ్రమలు వస్తాయి. కానీ విభజన చట్టం అమలు అయితే అత్యంత విలువైన మహా నవరత్నస్దాయి కలిగిన ప్రతిష్టాత్మక కేంద్రసంస్థలు వచ్చి ఉండేవి. హక్కుగా ఉన్న కడప ఉక్కు, దుగిరాజ పట్నం ఓడరేవు, మన్నవరం, లాంటి కీలక సంస్దలు రాష్ట్రానికి వచ్చి ఉండేవి. వాటి విలువ దాదాపు లక్ష కోట్లు. పై సంస్థలు  వచ్చి ఉంటే హోదా రాకపోయినా ప్రయివేటు రంగంలో వాటి చుట్టూ పరిశ్రమలు వచ్చి ఉంటాయి. విశాఖ, హైదరాబాదు, ముంబాయి, చెన్నై అనుబవం అదే చెపుతుంది. హోదా వచ్చినా కీలకమైన ఆసంస్దలు రావు. ఇవి కాక గుంతకల్లుకు రైల్వేజోన్, రాజధాని, పోలవరం, గాలేరు నగరి, హంద్రీ నీవాకు నిధులు, రాయలసీమ, ఉత్తరాంధ్రకు కనీసం 25 వేల కోట్ల నిదులు అదనం. అలా హోదా రాజకీయంతో విలువైన అమలుకు అవకాశం ఉండి హక్కుగా ఉన్న విభజన చట్టం ప్రాధాన్యత కోల్పోయింది.

ప్రజలు  అప్రమత్తంగా ఉండాలి 

హోదా రావాలని కోరుకోవడం వేరు, దానిని ఇవ్వాల్సిన కేంద్రం, దానికి నాయకత్వం వహించే పార్టీల వైఖరిని అర్థంచేసుకోకుండా  కేవలం తమ రాజకీయ ప్రత్యర్థులను  దెబ్బ తీయడమే లక్ష్యంగా పార్టీలు చేస్తున్న పోరాటం రాష్ట్రానికి చేటుతెస్తుంది.  హోదా ను డిమాండు చేస్తూ 25 సీట్లు గెలిపించమని కోరుతున్న వైసిపి , టిడిపిలు 2019 తర్వాత కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అందులో తాము నిర్వహించే పాత్ర ఏమిటి, హోదాను ఏపద్దతిలో రాష్ట్రానికి తీసుకు వస్తారు అన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు.

25 స్థానాలలో  గెలిపించండి అని మాత్రమే అడగడంలో అర్థం  లేదు. అన్నీ రాజకీయ పార్టీల పట్ల విశ్వాసం  కోల్పోయిన ప్రజలు విభజన అనంతరం రాష్ట్రప్రయోజనాల కోసం జరిగే ఉద్యమాలలో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ఇది రాజకీయ పార్టీలకు వరంగా మారింది. ప్రజలు దూరంగా ఉన్న నేపద్యంలో తమ శ్రేనులతో పోరాటాలు నడుపుతూ తమ రాజకీయ ప్రత్యర్ది మీద కోపంతో తమకు ఓట్లు వేయకపోతారా అన్న ధీమాతోనే పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. రాజకీయ పరిణామాల పట్ల, పార్టీలు తమ రాజకీయ హోదా కోసం చేస్తున్న పోరాటాల పట్ల పరిమిత స్దాయిలోనైనా ప్రజలు అవకాశం ఉన్న మేరకు తమ స్పందన తెలియచేయడం అవసరం. ఎలా హోదానూ సాధిస్తారో పార్టీలను ప్రశ్నించాలి. అపుడు మాత్రమే రాజకీయ పార్టీలు కొంతమేరకైనా నిజాయితీగా ఉంటాయి.

 

(యం. పురుషోత్తం రెడ్డి,రాయలసీమ మేధావుల పోరం, తిరుపతి. 9490493436)