టిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజకీయ సన్యాసం.. కేసిఆర్, కేటిఆర్ కు షాక్

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి సరికొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. ఆర్టీసి ఛైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తీవ్రమైన, సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. టిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తాను తీవ్రంగా కలత చెందానని ప్రకటించడంతోపాటు ఈ పరిస్థితుల్లో తాను రాజకీయాల్లో కొనసాగలేనని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెబుతూనే కేసిఆర్ కు సూటిగా తగిలేలా బాణాలు సంధించారు సోమారపు. మరిన్ని వివరాలు చదవండి.

రామగుండం కార్పొరేషన్లో స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వర్సెస్ మేయర్ లక్ష్మినారాయణ మధ్య వార్ గత కొంతకాలంగా నడుస్తోంది. ఇండిపెండెంట్ కార్పొరేటర్ గా గెలిచిన లక్ష్మినారాయణను టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి మేయర్ పీఠాన్ని కట్టబెట్టారు. అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు మేయర్ లక్ష్మినారాయణకు పచ్చగడ్డి వస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలపై పలుమార్లు టిఆర్ఎస్ అధిష్టానానికి ఎమ్మెల్యే సోమారపు ఫిర్యాదు చేశారు. అయినా అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో పలుమార్లు కార్పొరేషన్ మీటింగ్ లోనూ సోమారపు అనుచర కార్పొరేటర్లు మేయర్ పై తిరగబడ్డ దాఖలాలున్నాయి. ఈ సమయంలోనే నాలుగేళ్లు నిండడంతో తెలంగాణ అంతటా అవిశ్వాస తీర్మానాల నోటీసులు ఇచ్చారు. తీవ్రమైన వైషమ్యాలు ఉన్న రామగుండం కార్పొరేషన్ లోనూ ఎమ్మెల్యే అనుచరులు మేయర్ మీద అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.

అయితే ఎలాగైనా అవిశ్వాసం నోటీసు వాపస్ తీసుకోవాలని కేసిఆర్ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో కేసిఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటిఆర్ రంగంలోకి దిగారు. అవిశ్వాసం నోటీసు వాపస్ తీసుకోవాలని ఎమ్మెల్యే వర్గాన్ని కేటిఆర్ కోరారు. అయితే కొంత ఘాటుగానే అవిశ్వాసం నోటీసు వాపస్ తీసుకోవాలని కేటిఆర్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు సోమారపు సత్యనారాయణ. తన నియోజకవర్గంలో మేయర్ అవినీతికి పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం వద్దకు తీసుకువెళ్లినా లాభం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కార్పొరేటర్లు అవిశ్వాసం నోటీసు ఇచ్చారని అన్నారు. కానీ టిఆర్ఎస్ పెద్దలు రంగంలోకి దిగి అవిశ్వాసం నోటీసు వాపస్ తీసుకోవాలని వత్తిడి చేయడం బాధాకరమన్నారు. టిఆర్ఎస్ లో తనకు ఏమాత్రం గౌరవం లేదని ఆయన చెప్పారు. ఇక ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉండేకంటే రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాజకీయాలను నుంచి వైదొలుగుతున్నట్లు సోమారపు ప్రకటించారు. తనకు సహకరించి, నాయకుడిగా గుర్తింపునిచ్చిన సింగరేణి కార్మికులకు సోమారపు ధన్యవాదాలు తెలిపారు.

మొత్తానికి సింగరేణిలో సోమారపు ప్రకటన పెద్ద అలజడి రేపిందని చెప్పవచ్చు. అవినీతిపరులకు పార్టీలో సపోర్టు చేస్తున్నారని ఆయన పెద్ద బాంబు పేల్చారు. అంతేకాకుండా తనకు ఆర్టీసి ఛైర్మన్ పదవి ఇచ్చినా.. అధికారాలే లేవని కుండబద్ధలు కొట్టారు. ఆ పదవి వల్ల ఏమాత్రం జనాలకు సేవ చేయలేనన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కొంత బెటర్ గా పనిచేస్తున్నా.. టిఆర్ఎస్ పార్టీలో మాత్రం తనకు తీవ్రమైన అవమానమే మిగిలిందన్నారు. ఇకపై ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు.

రామగుండంలో తన అభిమానులు, కార్యకర్తల సమావేశంలో సోమారపు మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ‘‘నేను ఆరేళ్లపాటు మున్సిపల్ ఛైర్మన్ గా ప్రజలకు సేవ చేశాను. రెండు టర్మ్ లు ఎమ్మెల్యేగా గెలిపించారు. నాకు రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు సంతృప్తినివ్వడంలేదు. సిఎం కేసిఆర్ అనేకసార్లు సర్వేలు చేయిస్తున్నారు. పత్రికలు కూడా సర్వేలు చేయిస్తాయి. ఏ సర్వేలో అయినా టాప్ 5 నుంచి టాప్ 10లో నా పేరు ఉంటుంది. కానీ ప్రజలకు సేవ చేయలేనప్పుడు, నా కార్పొరేటర్లకు సేవ చేయలేనప్పుడు పొలిటికల్ రిటైర్ మెంట్ తీసుకోవడమే నయమని నేను నిర్ణయించుకున్నాను.’’ అని సోమారపు ప్రకటించారు.