తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం పోటీ చేస్తారా లేదా అన్న విషయంలో గత కొంతకాలంగా చర్చోప చర్చలు సాగాయి. ఆయన పోటీ చేయవద్దని కొందరు వాదిస్తుంటే లేదు.. లేదు పోటీ చేయాల్సిందే అని మరికొందరు వాదిస్తున్నారు. ఈ చర్చ ఇలా ఉండగా ఆయన పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలి అన్నదానిపైనా రకరకాల చర్చలు సాగాయి. తాజా పరిస్థితులను చూస్తే కోదండరాం పోటీ ఖాయమని తేలిపోయింది. మరి ఆయన ఎక్కడినుంచి పోటీ చేస్తారు? టిజెఎస్ వ్యూహరచన ఏంటో పరిశీలిద్దాం.
మహా కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపించడంలేదు. కూటమిలో పెద్దన్న కాంగ్రెస్ తీరు పట్ల సిపిఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. తమకు ఇవ్వనున్న స్థానాలేంటి? ఎన్ని స్థానాలు అన్న లెక్క తేల్చకపోవడంతో సిపిఐ ఒక స్టెప్ ముందుకేసి తను పోటీ చేసే స్థానాల జాబితాను విడుదల చేసి కూటమికి షాక్ ఇచ్చింది. దీంతో కూటమిలో గందరగోళం నెలకొంటుందా అన్న చర్చ మొదలైంది.
సోమవారం రాత్రివేళ హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో కాంగ్రెస్ నేతలు, కోదండరాం మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో టిజెఎస్ కు కేటాయించే సీట్లేమిటి అన్నదానిపై లిస్టును కోదండరాం కు కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఆ లిస్టు పై ఇవాళ టిజెఎస్ చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ లిస్టులో 8 సీట్లు జన సమితికి ఇస్తున్నట్లు, ఆ సీట్ల వివరాలను కూడా జన సమితి అధినేతకు కాంగ్రెస్ అందజేసింది. అయితే తమకు 12 స్థానాలు కావాలని జన సమితి డిమాండ్ పెట్టింది.
జన సమితి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కోదండరాం రామగుండం నియోజకవర్గంలో పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. రకరకాల చర్చలు సాగిన తర్వాత రామగుండం సీటును కోందండరాం పోటీ చేయడానికి ఆ పార్టీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలంగాణ జన సమితి, మహా కూటమి కంటే ముందుగానే ప్రత్యర్థి పార్టీ అయిన టిఆర్ఎస్ చెవిలో పడింది. అందుకే టిఆర్ఎస్ రామగుండం అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అప్పుడే కౌంటర్ షురూ చేశారు.
దమ్ముంటే కోదండరాం నా మీద పోటీ చేసి గెలవాలంటూ ఆయన సవాల్ విసిరారు. కోదండంరాం అంటే గౌరవం ఉంది అంటూనే చెత్త పార్టీలైన టిడిపి, కాంగ్రెస్ తో జట్టు కట్టి ఆయన తన ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారు అని సన్నాయి నొక్కులు షురూ చేశారు. కోదండరాం మీద పోటీ చేస్తే ఆ కిక్కే వేరప్పా అన్న రీతిలో డైలాగులు కొట్టారు. తన చేతిలో కోదండరాం ఓటమి ఖాయమని, కోదండరాం ను ఓడించి అసెంబ్లీలో కాలు పెట్టడం తనకు పెద్ద కష్టమేమీ కాదన్నారు.
కోదండరాం రామగుండంలో పోటీ చేస్తానని అధికారికంగా ప్రకటించకపోయినా సోమారపు సత్యనారాయణ కౌంటర్ షురూ చేశారంటే కోదండరాం అక్కడే పోటీ కన్ఫాం అయినట్లే అని జన సమితి నేత ఒకరు తెలిపారు. ముందుగా కోదండరాం తన సొంత జిల్లా మంచిర్యాలలో పోటీ చేస్తారని చర్చ జరిగింది. ఆ తర్వాత జనగామలో పోటీ అనుకున్నారు. ఒకసారి ఉప్పల్ లో పోటీ చేస్తే ఎలా ఉంటుందని చర్చ జరిగింది. అదంతా కాదు వరంగల్ వెస్ట్ లో పోటీ చేయాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. వరంగల్ వెస్ట్ లో కోదండరాం డిగ్రీ చదివారు. అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో విద్యాధికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి జన సమితి గెలుపు సునాయాసం అని భావించారు.
కానీ అంతిమంగా రామగుండం వైపు మొగ్గినట్లు తెలుస్తోంది. రామగుండం నియోజకవర్గ పరిధిలో సింగరేణి కార్మికుల ఓటుబ్యాంకు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా విద్యాధికులు ఎక్కువే. సింగరేణి కార్మికులు టిఆర్ఎస్ పట్ల తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు టిజెఎస వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు సోమారపు సత్యనారాయణ మీద సొంత పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేకత ఉందని, అదంతా తమకు కలిసొస్తుందని జన సమితి అంచనాల్లో ఉంది.
మరి మంగళవారం సాయంత్రం నాటికి తెలంగాణ జన సమితి తన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనబడుతున్నాయి.