అల్లం నారాయణకు అమర్ సంఘం స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణలో జర్నలిస్టుల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు తయారైందని టియుడబ్ల్యూజె (ఐజెయు) నేత శ్రీనివాసరెడ్డి మూడు రోజుల క్రితం సర్కారుపై మండిపడ్డారు. నిమ్స్ లో తప్ప సర్కారు ఇచ్చిన హెల్త్ కార్డులు ఎక్కడ కూడా పనిచేస్తలేవన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల గురించి సర్కారు పట్టించుకునే పరిస్థితే లేదని విమర్శించారు. ః

ఐజెయు నేత శ్రీనివాసరెడ్డి కామెంట్స్ పై మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ సర్కారు జర్నలిస్టులకు ఏం చేస్తుందో సవివరంగా వెల్లడించారు. తెలంగాణ రాకముందు జర్నలిస్టులకు ఉన్న వెసులుబాట్లు ఏమిటో, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయో అల్లం వివరించారు.

ఇదిలా ఉంటే అల్లం కామెంట్స్ పై మళ్లీ ఐజెయు నేతలు రియాక్ట అయ్యారు. ఐజెయు నేతలు గురువారం ఒక నోట్ రిలీజ్ చేశారు. ఆ నోట్ యదాతదంగా కింద ఇస్తున్నాం. చదవండి.

 

అల్లం గారు, ఇది అసత్య ప్రచారమేనా?

————————————-

ఇళ్ల స్థలాలు తప్ప, తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల కష్టాలన్నీ తీరిపోయినట్లు మీరు చేసిన ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు జర్నలిస్టుల సంక్షేమాన్ని పాలకులకు తాకట్టు పెట్టి, అవాస్తవ లెక్కలతో తప్పుదారి పట్టిస్తూ, ప్రభుత్వం నుండి మెప్పుపొందే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మీ ప్రకటనలో ఎంత వాస్తవం ఉందో హెల్త్ కార్డుల పని తీరే సాక్ష్యం చెబుతుంది. జర్నలిస్టుల గొంతుకగా టీయుడబ్ల్యుజె-ఐజేయు స్పందించి రాష్ట్రంలో జర్నలిస్టులు అనుభవిస్తున్న కష్టాలను తేటతెల్లం చేయగా, వాటిపై చర్చించి పరిష్కారానికి మీ వంతు కృషిచేస్తారని మేము ఆశించాము. కానీ ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్నారు కనక, ఆ పని మీతో సాధ్యం కాక పోవచ్చు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల మీకు  ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా,

టీయుడబ్ల్యుజె-ఐజేయూ వాస్తవాలు మాట్లాడుతున్నందున, కనీసం మీరు ప్రభుత్వ గొంతుకగా మాట్లాడకుండా, మౌనంగా ఉంటే బాగుండేది. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి ఇవ్వాళ మీడియాలో మీరు ఇచ్చిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని నిరూపిస్తూ సాక్ష్యాధారాలతో బహిరంగ చర్చకు మా యూనియన్ సిద్ధంగా ఉంది. అదే సమయంలో మేము వెల్లడించిన జర్నలిస్టుల కష్టాలు వాస్తవమేనని నిరూపించడానికి సిద్ధమే.

 

హెల్త్ కార్డుల విషయానికి వస్తే…

ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఆరోగ్య పథకాన్ని (ఇహెచ్ఎస్) ప్రవేశ పెట్టడానికి యోచించిన సందర్భంలో జర్నలిస్టుల సంఘాలతో పాటు కొన్ని ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు ఆ పథకాన్ని జర్నలిస్టులకు కూడా వర్తింపజేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జెహెచ్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మూడేళ్ల పాటు ఆ పథకం బాగానే పనిచేసింది గానీ, గత మూడు నెలలుగా పనిచేయడం లేదని చెబుతున్నాము. కావాలంటే ఆధారాలు చూపిస్తాము. మీరు చెబుతున్నట్లు మాది అసత్య ప్రచారమైతే, ఆ పథకాన్ని సాధించిన ఉద్యోగ సంఘాలు కూడా హెల్త్ కార్డులు చెల్లడం లేదంటూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి నిన్న వినతిపత్రం ఎందుకు ఇచ్చారు? దీన్నిబట్టి చూస్తే క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో మీకు అవగాహన లేనట్లు అర్థమైపోతుంది. రాష్ట్రంలో సుమారు 17వేల అక్రెడిటేషన్ కార్డులు జారీ కాగా, హెల్త్ కార్డులు మాత్రం 9వేల మందికే జారీ చేసింది వాస్తవం కాదా? అక్రెడిటేషన్ కార్డులు పొందివున్న 8 వేల మందికి హెల్త్ కార్డులు అందించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం, నాన్ అక్రెడిటెటెడ్ జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు ఇస్తామని మూడేళ్ళుగా కాలాయాపన చేస్తున్న విషయం కూడా వాస్తవం కాదంటారా? పలుకుబడి ఉంటే తప్ప, మూడు నెలలుగా కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు పలువురు సామాన్య జర్నలిస్టుల,వారి కుటుంబ సభ్యుల హెల్త్ కార్డులను తిరస్కరించగా, వారు అప్పులు చేసి చికిత్స పొందుతున్న విషయం కూడా వాస్తవం కాదంటారా? అంతెందుకు తమకు ప్రభుత్వం కోట్లాది రూపాయల బకాయి ఇవ్వాల్సి ఉందని, అవి చెల్లించేంతవరకు సేవాలందించలేమని ఇటీవల కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం తేల్చిచెప్పిన విషయం కూడా వాస్తవం కాదంటారా?

 

అక్రెడిటేషన్ కార్డుల విషయానికొస్తే..

రాష్ట్రంలో సుమారు 17వేల కార్డులు జారీ అయిన విషయం అవాస్తవమని మేము ఎక్కడా చెప్పలేదే? ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వివిధ విభాగాలలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు అందిస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని మేము డిమాండ్ చేయడం తప్పే అంటారా? 239 జీవో పుణ్యమా అని రాష్ట్రంలో అర్హత కలిగిన సుమారు 3 వేల మందికి ముఖ్యంగా ఉర్దూ, చిన్న పత్రికల జర్నలిస్టులకు అన్యాయం జరిగింది వాస్తవం కాదంటారా? ఇదే అవాస్తవమైతే మూడు నెలల క్రితం జర్నలిస్టుల సంఘాల బాధ్యులతో సమాచార శాఖ కమీషనరు గారు సమావేశమైన సందర్భంలో 239జీవో సవరించాలనే మా డిమాండుకు మీరు కూడా సై అన్న విషయం కూడా వాస్తవం కాదంటారా?

 

సంక్షేమ నిధి విషయానికి వస్తే…..

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం 100కోట్ల రూపాయలు వెచ్చించిన విషయాన్ని మేము కాదనలేదే? కానీ అవి బాధిత కుటుంబాలకు సక్రమంగా అందడం లేదనేది ముమ్మాటికీ నిజం. నాలుగేళ్ళ కాలంలో ఈ రాష్ట్రంలో ఆకస్మిక మృతి చెందిన జర్నలిస్టుల సంఖ్య 221కాగా, 150 మంది మంది మాత్రమే మృతి చెందారని మీరు ప్రకటించడం తప్పని చెబుతున్నాము. అలాగే ఒక్కరికి లక్ష రూపాయల పరిహారం, మూడేళ్లవరకు నెలకు 3వేల పెన్షన్ ఆ కుటుంబాలను ఆదుకోవడం లేదని, ఇందుకుగాను కనీసం 5లక్షల రూపాయల పరిహారం, నెలకు 5వేల చొప్పున, 5 సంవత్సరాల వరకు పెన్షన్ అందించాలని మేం కోరడం కూడా తప్పేనంటారా?

 

విశ్రాంత జర్నలిస్టులకు పెన్షన్….

58ఏళ్ల వయస్సు నిండి విశ్రాంతి పొందుతున్న జర్నలిస్టులకు దేశంలోని పలు రాష్ట్రాల్లో పెన్షన్ పథకాన్ని అక్కడి ప్రభుత్వాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నాయని, దానిని ఈ రాష్ట్రంలో కూడా అమలుచేయాలని మేము డిమాండు చేయడం కూడా మీకు నచ్చనట్లుంది. అందుకే ఆ విషయంలో మీ స్పందన అగుపించలేదు.

 

ఇంటి స్థలాలు, ఇండ్ల విషయానికొస్తే..

సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇంటి స్థలాలు, ఇండ్ల పరిష్కారానికి సుప్రీం కోర్టు సాకు చూపిస్తూ ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని మీరు సమర్థించడం ఎంతవరకు సమంజసం? కోర్టు వ్యవహారంతో సంబంధం లేకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించే మార్గాలను మాతో పాటు మీరు అన్వేషించి సమాచార శాఖ కమీషనరు గారి దృష్టికి మూడు నెలల క్రితమే తీసుకెళ్లిన విషయాన్ని మీరు మరచిపోయినట్లున్నారు. అందుకే మీ ప్రకటనలో మరోసారి కోర్టు సాకును గుర్తుచేశారు. ఇప్పటికైనా మీరు ప్రభుత్వానికి వకాల్తా పుచ్చుకునే వైఖరికి స్వస్తి పలికి, జర్నలిస్టుల సంక్షేమం కోసం జరిగే పోరాటాల్లో పాలుపంచుకుంటేనే జర్నలిస్టు లోకం హర్షిస్తుందన్న నిజాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాము.

 

ఇట్లు

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె ఐజేయూ) రాష్ట్ర కమిటీ.