ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తరువాత తెలుగు భాష పూర్తిగా పాడైపోయిందని, భాష లో మాధుర్యం పోయి సంకరమైపోయిందని తెలంగాణ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ చెప్పారు . పత్రికల్లో ఒకప్పుడు ప్రామాణికమైన భాష ఉండేదని , అయితే ఇప్పుడు కొన్ని తెలుగు పదాలకు అర్ధం న్యూస్ ఎడిటర్లకే తెలియడం లేదని ఆయన అన్నారు.
ఆదివారం నాడు సీనియర్ జర్నలిస్ట్ టి. ఉదయవర్లు రచించిన “తీపిగురుతులు ” పుస్తక పరిచయ కార్యక్రమంలో నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా పత్రికలు భాషను సుసంపన్నం చేశాయని , అయితే ఈరోజు పత్రికల్లో వస్తున్న భాషను చుస్తే బాధేస్తుందని చెప్పారు . ఆరోజుల్లో మహామహులైన వారు పత్రికల్లో పనిచేసేవారు . జర్నలిజం అనే వృత్తిని పవిత్రంగా భావించేవారు .ఎంత చదువుకున్నా నిత్య విద్యార్థులుగా ఉండేవారు మరి ఇవాళ్ళ అలాంటివారు కనపడరు అంటూ ఆవేదన చెందారు .
తనకు పత్రికా రంగంలో పాఠాలు చెప్పిన ఏబీకే పక్కన కూర్చోవడం చాలా గర్వగా భావిస్తున్నానని , ఆయన ఇవాళ్టికీ నిత్య విద్యార్థినే అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని నారాయణ చెప్పాడు . మరుగున పడిపోతున్న మహానీయులను “తీపిగురుతులు ” పుస్తకం ద్వారా మన ముందుకు తెచ్చిన ఉదయవర్లును అభినందిస్తున్నానని చెప్పారు .
ఏబికే ప్రసాద్ మాట్లాడుతూ ..ఉదయవర్లు పండిత కుటుంబం నుంచి వచ్చిన వాడని, భాషపై పట్టున్నవాడని చెప్పారు . జర్నలిస్టుగానే కాకుండా , రచయితగా కూడా ఎంతో పేరున్నవాడని ఆయన అన్నారు . తీపిగురుతులు అందరు చదవతగ్గ పుస్తకమని ఏబికే చెప్పారు .
రచయిత ఉదయవర్లు మాట్లాడుతూ , జర్నలిస్టులకే మార్గదర్శకుడు నార్ల వెంకటేశ్వరరావు దగ్గర తానూ శిష్యరికం చేశానని చెప్పాడు. మహనీయులైన వారి మార్గదర్శకత్వంలో జర్నలిస్టుగా ఎదిగానని చెప్పారు . తనకు బాగా సన్నిహితులైన వారి వ్యక్తిత్వం గురించి ఈ పుస్తకంలో రాశానని చెప్పాడు . వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసైనా ఈ కార్యక్రంలో గుడిపూడి శ్రీహరి , కేబీ లక్ష్మి , కే . లక్ష్మణ రావు పాల్గొన్నారు .