నిరంకుశ పాలనపై పోరాటం, జర్నలిస్టుల సంక్షేమం మా లక్ష్యం

బంగారు తెలంగాణ ఏర్పడి నాలుగున్నర సంవత్సరాలైన జర్నలిస్టుల సమస్యలు ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పరిస్థితి తయారయిందని జెఎఫ్ఎస్టి నాయకులు నాయకులు అమర్, అమిత్ భట్ ఆరోపించారు. జర్నలిస్టుల అభివృద్ది, సంక్షేమం, జర్నలిస్టుల ప్రయోజనాల కోసం ఏర్పడిన జర్నలిస్టుల యూనియన్లు తెలంగాణలో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ లో జర్నలిస్టుల సన్నాహక సమవేశం జరిగింది. ఈ సమావేశంలో అమర్, అమిత్ మాట్లాడారు.

పాలక పార్టీలకు, ఆ పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ కొందరు జర్నలిస్టు నేతలు తమ స్వలాభం చూసుకుంటున్నారని విమర్శించారు.  మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి జర్నలిస్టుకు అన్ని రకాలుగా న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఈ నూతన వేదికకు శ్రీకారం చుట్టామన్నారు. జర్నలిజంలో పనిచేసే అందరికి ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం, స్థానికంగా పనిచేసే విలేకరుల సమస్యలు, జర్నలిస్టుల  రక్షణ వంటి వంటి అంశాలే తమ ప్రధాన ఎజెండా అన్నారు.

2014 ఎన్నికల ముందు టిఆర్ఎస్ మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు

వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్నవారు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కుటుంబ పెద్దగా ఉన్న జర్నలిస్టు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలకు తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ సర్కారు అనుసరించిన నిరంకుశ వైఖరికి నిరసనగానే తమ ఉద్యమం ముందుకు పోతుందన్నారు.

రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారంలో ముందుకు రానియెడల తిరుగుబాటు తప్పదని వారు హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా ఏర్పడుబోడున్న ఈ నూతన వేదికకు అన్ని జిల్లాలో విస్తరింపజేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నామన్నారు.

హైదరాబాద్ లోని ఇండియన్ మెడికల్ అసోసీయేషన్ సమావేశమందిరం (కోఠి) లో 24.11.2018 శనివారం మధ్యాహ్నం 02:00 గంటలకు హైదరబాద్ జర్నలిస్టుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, గిరిధర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.