ఉత్తమ్ కు సవాల్ విసిరిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల

తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ బిసిల పై మొసలి కన్నీరు కారుస్తున్నాయని టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య విమర్శించారు. తెలంగాణ భవన్ లో నోముల నర్సింహ్మయ్య మాట్లాడారు ఆయన ఏమన్నారంటే…

“బిసిలకు పంచాయతీలల్లో 24 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు ఒప్పుకోకుండా స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. దానిని సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో గత్యంతరం లేక బాధాకర పరిస్థితిలోనే సీఎం కేసీఆర్ ఆ తీర్పును అంగీకరించారు. అధికారంలో ఉండగా బిసీ ఫెడరేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఉత్తమ్ , కోదండరాంలు మొసలి కన్నీరు కారుస్తున్నారు. బిసీల పై ప్రేమ ఒలక పోస్తున్నారు. బిసిలకు పంచాయతీల్లో 90 శాతం సబ్సిడితో పెట్టుబడి సమకూరుస్తున్నాం. బిసిలను అన్ని విధాల అణచివేసిన నేతలే ఇప్పుడు గొంతు పెద్దదిగా చేసుకుని మాట్లాడుతున్నారు. అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాతనే బిసిలకు కోర్టు నిర్ణయించిన రిజర్వేషన్లకు ఒప్పుకున్నాం.

 కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే చట్ట సభల్లో బిసిలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తీర్మానాలు చేయించాలి. విపక్ష నేతలు ఇల్లు కాలితే పేలాలు ఏరుకుంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లికి అఖిల పక్షంగా వెళ్లినా ప్రస్తుత పరిస్థితుల్లో సాధించేదేమి ఉండదు. బిసి నేత ఆర్. కృష్ణయ్య వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. తమిళనాడు తరహాలో తెలంగాణలో రిజర్వేషన్లు సాధించేందుకు అన్ని పార్టీలు సహకరించాలి. బిసిలకు ఎవరేం చేశారో తేల్చుకునేందుకు ఉత్తమ్ దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రావాలి.

చంద్రబాబు  కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారు. కేసీఆర్ భాషను చంద్రబాబు తప్పు పడుతున్నారు. చంద్రబాబు లాగా కేసీఆర్ కి అండీలు గిండీలు రావు. మోడీకి చంద్రబాబుకు ఏం పంచాయతీ ఉందో. ఆ వివాదంలోకి కేసీఆర్ ను ఎందుకు లాగుతున్నారు. ఎన్టీఆరే స్వయంగా కేసీఆర్ ను జామాత దశమ గ్రహం  అని విమర్శించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కింది చంద్రబాబు. వానలు కొడితే వాతలు పోవు. చంద్రబాబు పాత చరిత్రను ప్రజలు మరిచి పోరు. ఏపీ లో కేసీఆర్ కు వస్తున్న ఆదరణను చూసి బాబు ఓర్చుకోలేక పోతున్నారు.

కేసీఆర్ పాలనను చూసి విజయవాడలో కూడా ఆయన నిలువెత్తు విగ్రహం పెట్టాలంటున్నారు. కేసీఆర్ ను దేవుడిలా కొలిచే ప్రజలు తెలంగాణలో ఉన్నారు. కేసీఆర్ ధాటికి మహామహులే మట్టి కరిచారు. చంద్రబాబు తన పద్దతి మార్చుకోవాలి. ఇకనైనా బిసిల పై విపక్షాలు కుహనా రాజకీయాలు మానాలి.” అని నోముల నర్సింహ్మయ్య అన్నారు.