సీఎం  కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రెండు సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఎక్కడ కూడా కనపడలేదు. దాదాపు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు.

పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎక్కడ పెద్దగా కనిపించలేదు. అయితే గతంలో సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసి హాట్ టాపిక్ గా మారిన రేవంత్ మరో సారి అంతే స్థాయిలో కేసీఆర్ పై విమర్శలు చేశారు. సోమవారం మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే…

“తెలంగాణ రైతులంటే సీఎం కేసీఆర్ కు గౌరవం లేదు. నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్ర జొన్న రైతులు ఆందోళన చేస్తున్న కేసీఆర్ కు కనిపించడం లేదు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లిగారు చనిపోతే రెండు సార్లు పోచారం పోయివచ్చిన కేసీఆర్ కు పక్కనే ఉన్న రైతులు కనిపించడం లేదా… రెండు సార్లు నివాళులు అర్పించి వచ్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్లకు నివాళులు అర్పించేందుకు సీఎం కేసీఆర్ కు సమయం దొరకడం లేదా… రెండో సారి పగ్గాలు చేపట్టినా తన ప్రవర్తనను కేసీఆర్ మార్చుకోలేదు. కేసీఆర్ , మోడీలది ఫెవికల్ లాంటి బంధం. అందుకే వారు అంత అతుక్కపోయి ఉంటున్నారు. జవాన్లు, కిసాన్ లు కేసీఆర్ కు అక్కరలేదు.

నాలుగేళ్లుగా రైతుల పరిస్థితి మారలేదు. మద్దతు ధర అడిగితే కుక్కకు బొక్కేసినట్టు రైతుబంధు ఇస్తున్నాడు. రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. రైతుల ఆత్మహత్యలు బయటకు రాకుండా అధికారులు, ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎర్ర జొన్న రైతులు, పసుపు రైతులు రోడ్డెక్కి న్యాయం చేయాలని కోరుతుంటే కనీసం ఒక్క అధికారి, ఎమ్మెల్యే కూడా స్పందించలేదు. 

జవాన్ల పై దాడి జరిగితే కనీసం నివాళి ప్రకటించకపోవడం దారుణం. ధనిక రాష్ట్రంగా చెబుతున్న తెలంగాణ నుంచి అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు చేతులు రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్దమవుతుంది. 

నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన కేసులను తోడి నా పై కేసులు పెడుతున్నారు. ఈడి దాడులను చేయిస్తున్నారు. ఎన్నికల్లో 150 కోట్లను సీజ్ చేశారు. ఎంత మంది మీద ఈడీ కేసులు పెట్టారు. పట్నం నరేందర్ రెడ్డివి 50 లక్షలు సీజ్ చేశారు. అతని మీద ఏం కేసు పెట్టారు. కేసుల పేరుతో వేధించినా వెనుకకు తగ్గేది లేదు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పై పార్టీలో అంతర్గత సమీక్ష చేస్తాం. పార్లమెంటు ఎన్నికల్లో ఆ తప్పులు జరగకుండా ముందుకు వెళుతాం. మెజార్టీ పార్లమెంటు సీట్లు గెలుచుకుంటాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.  ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సారి చిట్ చాట్ లో పాల్గొన్న రేవంత్ ఏ మాత్రం తగ్గకుండా అదే దూకుడుతో మాట్లాడడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.