గర్ల్స్ హాస్టల్ పై నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీ, షాకింగ్ నిజాలు(వీడియో)

మేడ్చల్ జిల్లా, మేడిపల్లి హెడ్ క్వార్టర్స్ ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంలోని అమ్మాయిలను అడిగి వారి సమస్యలేమిటో కనుక్కున్నారు. వసతి గృహ నిర్వహణపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

  

పురుగులు పడిన, నాసిరకపు పదార్ధాలతో ఆహారాన్ని వండిపెడుతున్నారని, అవి తింటే ఆరోగ్యం పాడవుతుందంటూ ఆవేదన చెందారు. అల్పాహారం లేదు, మూడు పూట్లా అన్నమే పెడుతున్నారు. ఒకే ఒక వంట మనిషి ఉంది. ఆమెకి కూడా వయసైపోయింది. హెల్పర్స్ కూడా లేకపోవటంతో విద్యార్థినులు తమ వంట చేసుకోవాల్సి వస్తుందని తెలిసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పురుగులు, పాములు తరచూ వసతి గృహంలోకి వస్తుండటంతో భయపడుతున్నామని, ఎప్పుడు అవి లోపలికి వస్తాయో అనే భయంతో రాత్రిళ్ళు సరిగా నిద్ర కూడా పొవట్లేదని విద్యార్దునులు తెలపడంతో ఆమె చలించిపోయారు.

 

సెక్యూరిటీ రీత్యా 150 మంది ఉంటున్న గర్ల్స్ హాస్టల్ కి సెక్యూరిటీ గార్డ్ కానీ వాచ్ మాన్ కానీ లేరని ఒక కుక్క కాపలాగా ఉందని కనీసం కాంపౌండ్ వాల్ కూడా లేకపోవడంపై ఆమె మండి పడ్డారు. కాంపౌండ్ వాల్ లేకపోవటం వలన అపరిచితులు హాస్టల్ లోపలికి అర్ధరాత్రిళ్ళు తొంగి చూస్తున్నారని, అటువంటివారు లోపలికి చొరబడితే వారి గతి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాత్రిళ్ళు బాలికలతో ఉండటానికి వార్డెన్ కూడా లేదని, వయసైపోయిన వంటావిడే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆమె వీరికి సహాయం అందించ గలుగుతుందా? బాలికల హాస్టల్ కి వార్డెన్ ని ఏర్పాటు చేయకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పోలీసులను అక్కడికి రప్పించి గర్ల్స్ హాస్టల్ కి రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆ వసతి గృహానికి మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సిటీకి దగ్గరలో ఉన్న ఈ హాస్టల్ పరిస్థితే ఇంత దీనంగా ఉంటే మారుమూల ప్రాంతాలలో ఉన్న హాస్టళ్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కెసిఆర్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటం కాదు వసతి గృహాల్లో ఆడపిల్లల అవసరాలేంటి, వారి సమస్యలేమిటి అని తెలుసుకొని సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆమె ఏం మాట్లాడారో తెలియాలంటే కింద ఉన్న వీడియో చుడండి.