తెలంగాణ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పొలిటికల్ ఈక్వేషన్లు కనిపిస్తున్నాయి. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ గత కొంతకాలంగా రాజకీయంగా మౌనం దాల్చారు. దాంతో, తెలంగాణ టీడీపీకి దిశానిర్దేశం కరువయ్యింది.
ఆ మాటకొస్తే, పూర్తిగా తెలంగాణలో టీడీపీ మూతపడినట్లే. ఎప్పుడైతే ఎంపీ రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడయ్యాడో.. ఇక, తెలంగాణలో టీడీపీ ఉనికి పూర్తిగా మాయమైపోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టే, రేవంత్ రెడ్డికి తెలంగాణ టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పడుతున్నాయి. ఎక్కడా టీడీపీ జెండాలు కనిపించకుండా జాగ్రత్త పడుతున్న తెలుగు తమ్ముళ్ళు, కాంగ్రెస్ జెండాలు పట్టుకుని రేవంత్ రెడ్డి వెంట నడుస్తుండడం గమనార్హం.
నిజానికి, చంద్రబాబు ఎర్రబెల్లి దయాకర్ రావుకీ, నాగం జనార్ధన్ రెడ్డికీ తొలుత ప్రాధాన్యతనిచ్చి.. అప్పట్లో రేవంత్ రెడ్డిని ‘కూల్’ చేశారుగానీ.. అప్పట్లోనే రేవంత్ రెడ్డికి తెలంగాణ టీడీపీ బాధ్యతలు పూర్తిగా అప్పగించి వుంటే.. తెలంగాణలో టీడీపీ ఇంతటి దుస్థితిలోకి నెట్టివేయబడేది కాదు. చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదాలు.. టీడీపీని తెలంగాణలో నాశనం చేసేశాయి.
తెలంగాణలో టీడీపీ అంటే ఇకపై గతించిన చరిత్ర. కానీ, రేవంత్ – చంద్రబాబు మధ్య బంధం మాత్రం కొనసాగుతూనే వుంటుంది. అసలు కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డిని పంపించిందే టీడీపీ అధినేత చంద్రబాబు. అంతెందుకు, రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు.. అనే అంటున్నారు. అందుకేనేమో, ఏపీకి చెందిన తెలుగు తమ్ముళ్ళు, సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు. అంతా బాగానే వుందిగానీ, టీడీపీ మద్దతుదారులైన సెటిలర్లు.. రేవంత్ రెడ్డికి మద్దతిస్తారా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.