ఈసారైనా ఆ పదవి రేవంత్ రెడ్డికి దక్కేనా ?

Revanth Reddy Malkajgiri MP

రేవంత్ రెడ్డి .. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరు. ఎదుట ఎవరు ఉన్నా .. వారు ఏ పదవిలో ఉన్నా కూడా విమర్శలు , ఆరోపణలు చేయడం లో ఏ మాత్రం వెనుకడుగు వేయరు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై బలమైన ఆరోపణలతో రెచ్చిపోయే నేతల్లో రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. సీఎం కేసీఆర్ పై , కేసీఆర్ కుటుంబం పై రేవంత్ రెడ్డిలా మరొకరు విమర్శలు ,ఆరోపణలు చేయలేరు. ఇక ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం మొత్తం రేవంత్ చుట్టూనే తిరుగుతుంది.

Revanth Reddy starts fight for GHMC elections
 

గ్రేటర్ లో ఘోర పరాభవంతో టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త పీసీసీ చీఫ్‌ను ఎన్నుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే మొదటి నుంచి ఈ రేసులో ముందున్న రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. కొత్త పీసీసీ చీఫ్‌ను ఎంపిక చేసేందుకు తెలంగాణకు వచ్చిన ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. దీనిపై పార్టీ ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తేనే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నూకలు ఉంటాయని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు మాత్రం ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు వంటి వారికి టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీపీసీసీ చీఫ్ పదవిని ఎవరికి ఇచ్చినా.. మరో వర్గం నేతలు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉండటంతో, అందరినీ ఒప్పించి ఈ పదవికి నాయకుడిని ఎంపిక చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది.దీంతో ఇప్పటికప్పుడు కొత్త టీపీసీసీ చీఫ్‌ ఎంపిక ఉంటుందా , లేక ఈ అంశాన్ని మరికొంతకాలం నాన్చుతారా అనే చర్చ కూడా జరుగుతుంది. గతంలో రెండు మూడు సార్లు దీనిపై చర్చ జరగగా .. ఆ తర్వాత అధిష్టానం ఆ పదవిలో ఉత్తమ్ నే కొనసాగించింది. చూడాలి మరి ఈసారైనా ఆ పదివి రేవంత్ ను వరిస్తుందో ..లేదో