కరీంనగర్,తెలంగాణ: అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. గత కొద్దికాలంగా తెరాస పార్టీకి కౌశిక్ దగ్గరగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేగాక తాజాగా విడుదలైన కౌశిక్ రెడ్డి ఆడియో టేపులు చర్చాంశనీయంగా మారాయి. “టిఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ నాకే… యూత్ కి ఎన్ని డబ్బులు కావాలో నేను చూసుకుంటా… సభ్యులకు 2000 నుంచి 3000 ఇద్దాం…” అంటూ మాదన్నపేట యువకునితో కౌశిక్ రెడ్డి సంభాషించి నట్లు ఓ ఆడియో టేప్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆడియో టేపుల వ్యవహారంపై 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలంటూ టీపీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసిన కొంత సమయానికే రాజీనామాను ప్రకటించారు కౌశిక్ రెడ్డి.
రాజీనామా ప్రకటన అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ‘ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాకు సహకరించడం లేదు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతరులకు పదవులిస్తున్నారు. పార్టీ పదవుల విషయంలో నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కొందరు సీనియర్ నేతలు పార్టీకి నష్టం కల్గిస్తున్నారని పేర్కొన్నారు. 50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. “సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించడం నన్ను బాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టం ’’ అని కౌశిక్ రెడ్డి అన్నారు