వేల కిలో మీటర్లైనా రైల్లోనే వెళ్లే దేశాధ్యక్షుడెవరో తెలుసా?

ఉత్తర కొరియాను, అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఊన్ ను ఎంత చులకనగా చూసి,ఎగతాళిగా మాట్లాడి, దేశాన్ని భ్రష్టుట్టిస్తున్న మూర్ఖుడిగా ఆయనను పాశ్చాత్య దేశాలన్నీ చిత్రీకరించినా అతగాడు అల్లాటప్ప నాయకుడు కాదు. కిమ్ తెలివయిన నాయకుడు. ప్రపంచం డాలర్ చుట్టూ, అమెరికా చుట్టూ తిరుగుతున్నది కాబట్టి చాలా దేశాలు ఉత్తర్ కొరియాను, కిమ్ ను అమెరికా కళ్లతో చూడ్డం, అమెరికా భాషలోనే అర్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. అమెరికాను తనచుట్టు తిప్పుకుంటున్న పొటి గట్టివాడు కిమ్.

ప్రపంచానికి అమెరికా యే పెద్దశత్రువని కిమ్ అభిప్రాయం. అందుకే అమెరికాని బెదరగొట్టే పని చేపట్టి విజయవంతమయ్యాడు. ఒక వైపు కిమ్ ని కమెడియన్ లాగా చూసినా, అదే కిమ్ తో మాట్లాడేందుకు మహాఅహంకారి అయిన డొనాల్డ్ ట్రంప్ నిన్న రాత్రి ఎయిర్ ఫోర్స్ 1 లో  వియత్నాం రాజధాని హనోయ్ కు చేరుకున్నాడు.

అమెరికా అధ్యక్షుడుఅంటే ప్రపంచాధ్యక్షుడిగా చూసే ఈ రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ఒక దేశంలో దిగాడంటే అంటే ఎంత హడావిడి ఉంటుందో చెప్పలేం. అయితే, హనోయ్ లో అదే మిస్సయింది.

ప్రపంచ మిడియా దృష్టంతా కిమ్ మీదే ఉంది. కిమ్ ఎలా వస్తున్నాడు, ఎంతమందితోవస్తున్నాడు, ఎక్కడ దిగుతాడు ఇవే ప్రశ్నలు. ప్రపంచ చిత్రపటంలో జొన్నగింజంత సైజులో కూడా లేని ఉత్తరకొరియా వైపు ప్రపంచాన్ని తిప్పుకోవడంలో కిమ్ దిట్ట. ఆ మధ్య సింగపూర్ వెళ్లినపుడు అలాగే జరిగింది. ఇపుడు వియత్నాం లో రెండో విడత శాంతి చర్చల కోసం వస్తున్నపుడు అదే జరుగుతూ ఉంది.  పొట్టిగా, బొద్దుగా, విచిత్రమయిన హేర్ కటింగ్ తో  పెద్ద ఆకర్షణ కూడా లేని కిమ్ తో మాట్లాడేందుకు ట్రంప్ భేషజాలన్నీ పక్కన పడేసి వియత్నం వస్తున్నాడు.

కిమ్ ఎలా వస్తున్నాడు?

కిమ్ జాంగ్ ఊన్ హనోయ్ ఎలావస్తున్నాడనే వార్త చాలా గోప్యంగా పెట్టారు. శటిలైట్ కళ్లతో ఎపుడూ ప్రపంచమంతా నిఘా వేసి తనకు సాటిలేదని విర్రవీగే అమెరికా కూడా కిమ్ ఎలా హనోయ్ కి వస్తున్నాడో పసిగట్ట లేకపోయింది. అమెరికా పత్రికలు వూహాగానాలు కూడా చేయలేకపోయారు. చివరకు శనివారం నాడు ఒక ఉత్తర కొరియా రైలొకటి, అకుపచ్చ రంగుతో, దృఢమయిన గోడులున్న బోగీలతో, నిశబ్దంగా పాములా పాకుతూ చైనాలోకి ప్రవేశిస్తున్నపుడ్ కిమ్ హనోయ్ కి రైలులో వస్తున్నాడని పాశ్యాత్య పత్రికలు రాసేశాయి.

అవును, కిమ్ వియత్నాం రావడానికి రైలు మార్గం ఎంచుకున్నాడు. రాజధాని ఫ్యాంగ్ యాంగ్ నుంచి హనోయ్ కి రావడానికి విమానంలో నాలుగు గంటలుపడుతుంది. అయినా సరే, కిమ్ 60 గంటల రైలు ప్రయాణం ఎంచుకున్నాడు. ఈ రైలు చైనాగుండా వియత్నాం చేరుకుంటుంది.

 

రెండున్నర రోజుల పాటు 2800 కిమీ చైనా గుండా ప్రయాణం చేసి వియత్నాం సరిహద్దు పట్టణం డాంగ్ డ్యాంగ్ కు చేరుకుంది కిమ్ రైలు. అక్కడ కిమ్ కు వియత్నం అధికారులు రెడ్ కార్పెట్ అఖండ స్వాగతం పలికారు. తర్వాత అక్కడి నుంచి తానే తెచ్చుకున్న మెర్జిడెజ్ కారులో చుట్టూ తన భద్రతా సిబ్బందితో ఆయన 100 కి మీ దూరాన ఉన్న రాజధాని హనోయ్ బయలు దేరారు. మంగళవారం మధ్యాహ్నానికి హనోయ్ కి వచ్చారు.

ఒక దేశాధ్యక్షుడు 60 గంటల రైలు ప్రయాణం చేసి పొరుగుదేశానికి చేరుకోవడం అనేది కనివిని ఎరుగునిది. ఢిల్లీనుంచి హైదరాబాద్ ఎపి ఎక్స్ ప్రెస్ లేదా తెలంగాణ ఎక్స్ ప్రెస్ లోనో వస్తేనే మహా అలసట ఉంటుంది. మరి అరవై గంటల ప్రయాణం మాటలా? ఎంత గొప్ప రైలయినా వొళ్లూ హూనం అవుతుంది.
కిమ్ రైలు ప్రయాణం ఎలా దిశలో వస్తుందనేది ముందెవరకి చెప్పలేదు. అంతా రహస్యమే, రైలు కదిలాక గాని అది ఎటువోతుందో తెలిసేది కాదు.

కిమ్ జాంగ్ ఊన్ శనివారం మధ్యాహ్నం ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్ నుంచి రైలు లో బయలుదేరారు. ఆదివారం చైనా రేవుపట్టణం తియాంజిన్ చేరుకున్నారు. ‘సోమవారం ఉదయం ఏడు గంటలపుడు ఈ రైలు సెంట్రల్ చైనా వూహన్ పట్టణం దాటినట్లుంది. అక్కడి నుంచి అది దక్షిణం వైపు కదిలినట్లు తెలుస్తున్నది యోన్హాప్ కథనం.’ అంటే వ్యవహారం ఎంత రహస్యంగా ఉందో తెలుసుకోవచ్చు. మంగళవారం ఉదయానికి ఈ రైలు చైనాలో వియత్నం బార్డర్ వైపు తిరిగిందని వార్తలొచ్చాయి.

ఈ రైలు ఉంటుందో కిమ్ తండ్రి కాలంలో  మీడియా లో వార్తలొచ్చాయి.  వాటి  ప్రకారం  ‘కిమ్ రైలు బోగీలు చాలా దృఢంగా ఉంటాయి.అది బుల్లెట్ ప్రూప్ రైలు .లోపల ఉన్నవాళ్లు బయటకు కనిపించకుండా కిటికీ అద్దాలకు కోటింగ్ ఇచ్చారు. ఈ రైలు వేగం గంటలకు 30 కిమీ. ఇందులో సమావేశమందిరాలు, ప్రేక్షకుల గదులు, టివి తెరలండే ఒక కార్యాలయం, శటిలైట్ ఫోన్లు, భోజనశాలలు, ప్రత్యేక బెడ్ రూమ్ లుంటాయి. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇందులో ఒక హెలికాప్టర్ కూడా ఉందని మీడియా వార్తలు. కిమ్ తన రైలు తను ప్రయాణించే మెర్సిడెజ్ కారును కూడా తెచ్చుకున్నారు.

‘కిమ్ ప్రయాణంలో మూడురైళ్లున్నాయి. ఒకటి ముందుగా నడుస్తూ రైల్వే ట్రాక్ మీద భద్రతను పరిశీలిస్తుంది. దీని వెనక కిమ్ ప్రైవేట్ రైలు నడుస్తుంది. చివర మూడో రైలులో భద్రతా సిబ్బంది ఉంటారు. కిమ్ రైలు వెళ్తున్నపుడు రైలు మార్గంలో కరెంటు బంద్ అవుతుంది. అంటే మరొక రైలు రావడం పోవడం జరగదని ఒక వర్గం మీడియా రాసింది. దేశంలో ప్రయాణించినపుడల్లా ఆయన ఈ రైలునే వాడతారు,’ అని చోసున్. కామ్ పేర్కొంది.

కిమ్ కు రైలు ప్రయాణం కొత్త కాదు. ఆ మాటకొస్తే కిమ్ కుటుంబానిది రైలు ప్రయాణాల సంప్రదాయం. పోయినతూరి జనవరి, మార్చిలలో కిమ్ బీజింగ్ పర్యటనలకు వెళ్లింది కూడా రైల్లోనే. అంతకు ముందు 2001 లో కిమ్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ ప్యాంగ్ యాంగ్ నుంచి మాస్కోకు రైల్లోనే వెళ్లారు. అపుడాయన రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ ను కలుసుకునేందుకు రష్యా రాజధాని కొచ్చారు.ఆయన రైలు ప్రయాణంలోనే చనిపోయారు. ఆ బోగీని రాజధానిలోని కుమ్ సుసాన్   రాజభవనంలో చూడవచ్చు. అంతకు ముందు కిమ్ తాత కిమ్ ఇల్ సంగ్ కూడా రైల్లో నే ఎంతదూరమయినా ప్రయాణించే వారు. 1984లో సంగ్ తూర్పుయూరోప్ కమ్యూనిస్టు దేశాల దాకా ఈ రైల్లోనే ప్రయాణించారు.

గత జూన్ లో సింగపూర్ లో  జరిగిన మొదటి సమావేశానికి కిమ్ చైనా వాళ్లందించిన విమానంలో వచ్చాడు. దాని మీద కూడా చైనా జండాయే ఎగురుతూ ఉంది. ఉత్తర కొరియాను చాలా మంది చైనా రాష్ట్రంగా ఎగతాళి చేసేందుకు ఇదే కారణం.