కేటిఆర్ లాగా కేసీఆర్ దానికి ఒప్పుకోలేదు

తెలంగాణలో తిరుగులేని నాయకునిగా సీఎం కేసీఆర్ ఎదిగారు. కనుచూపు మేరలో కూడా అతనితో ఢికొనే నాయకుడు కనిపించడం లేదని చర్చ జరుగుతోంది. రెండో సారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ  రాజకీయాల పై దృష్టి పెట్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రోజు అసెంబ్లీలో ప్రదర్శించిన తీరు అందరిని ఆకర్షించిందని చర్చ జరుగుతోంది.

జవనరి 17 న తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. ముందుగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ముందుగా అజ్మీరా రేఖా నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆమె వెంటనే సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లి కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోబోయారు. అయితే దానికి కేసీఆర్ ఒప్పుకోలేదు. రేఖానాయక్ ను వద్దని వారించారు. ఈ తీరును ఆయన స్వాగతించలేదు.    

కొద్ది రోజుల క్రితం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కేటిఆర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు అనేక మంది నేతలు ఆయనను కలిశారు. ఆయనను కలిసినప్పుడు చాలా మంది నేతలు ఆయన కాళ్లకు దండం పెట్టారు. అప్పుడు కేటిఆర్ వాళ్లకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. దీనికి భిన్నంగా కేసీఆర్ మాత్రం ఈ తీరును స్వాగతించలేదు.

రాజకీయంగా తమకు తిరుగులేదు అని అనుకునే నేతలు పాదాభివందనాలను అంగీకరించే ధోరణి చాలా రాష్ట్రాల్లో చూస్తున్నదే. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ తీరు అధికంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబుకు కూడా ఏపీలో చాలా మంది నేతలు చేశారు. దానికి చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు. కానీ సీఎం కేసీఆర్ ఈ తీరును స్వాగతించకుండా వ్యతిరేకించిన తీరు అభినందనీయం అని పలువురు చర్చించుకుంటున్నారు. కేటిఆర్ తీరు కూడా చర్చనీయాంశమైంది.