అసలు ఎవరూ టచ్ చేయలేరని, దరిదాపుల్లోకి కూడ రాలేరని అనుకున్న తెరాస పరిస్థితి ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఒకటి కాదు రెండు కాదు వరుస ఓటములు కేసీఆర్ ను కలవరపరుస్తున్నాయి. ఆ దెబ్బలు కూడ చిన్నవి కావు పెద్దవే. లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోవడం నుండి మొదలైంది ఈ దెబ్బల పర్వం. ఆ తర్వాత మేనల్లుడు హరీష్ రావు అన్నీ తానై నడిపించిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ చేతిలో మట్టికరవాల్సి వచ్చింది. ఇక్కడ తెరాసకు ప్రమాద ఘంటికలు మోగాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేటీఆర్ సారథ్యంలో నడిచిన టిఆర్ఎస్ కావాల్సినన్ని స్థానాల్ని రాబట్టుకోలేకపోయింది. వంద అనుకుంటే 55 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. 2016 ఎన్నికలకు ఈ ఎన్నికలకు 44 సీట్ల తేడా. ఈ వ్యత్యాసం చాలా పెద్దదే.
ఇలా వరుసగా కీలకమైన ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుండటం అధినేతను ఆలోచనలో పడేసింది. అయితే అనుభవం దృష్ట్యా ఈ పరిణామాలు కేసీఆర్ ను పెద్దగా పరుగులు పెట్టించేవి కాదు. కానీ కేటీఆర్ వైపు నుండి చూస్తే మాత్రం పరుగులు పెట్టాల్సిన అవసరం ముమ్మాటికీ కనిపిస్తోంది. కేసీఆర్ పార్టీ పగ్గాలను రేపో మాపో కేటీఆర్ చేతిలో పెట్టి థర్డ్ ఫ్రంట్ పనుల్లో పడిపోవాలని అనుకున్నారు. దృష్టి మొత్తం ఢిల్లీ స్థాయిలో పెట్టాలని అనుకున్నారు. కానీ వరుస ఓటములతో పరిస్థితులు తారుమారయ్యాయి. నిన్నమొన్నటి వరకు కేటీఆర్ అంటే తండ్రిని మించిన తనయుడిని అంతా అనుకున్నారు. కానీ సరైన ప్రత్యర్ధి తగిలితే తడబడతారని గ్రేటర్ ఫలితాలు రుజువు చేశాయి. తన సంగతి పక్కనబెడితే కేసీఆర్ పర్యవేక్షణ ఉండగానే ఇలా జరిగిందనే కంగారు కేటీఆర్లో కూడ ఉంది.
రేపు తండ్రి ఢిల్లీ రాజకీయాలకు పరిమితమైతే రాష్ట్ర రాజకీయాలను వ్యవహారాలను తానే చూసుకోవాలి. ప్రత్యర్థులను ఒంటిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిస్థితులు గతంలో మాదిరి ఉంది ఉంటే ఆడుతూ పాడుతూ పెత్తనం చేసుకుని ఉండవచ్చు. కానీ బ్యాడ్ టైమ్ దాపురించింది. భారతీయ జనతా పార్టీ ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగిపోతూ ఉంది. చెప్పుకొవడానికి నలుగురే అయినా బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, రఘునందన్ కలిసి తెరాసను ముప్పుతిప్పలు పెట్టేస్తున్నారు. ముందుకెళుతున్న ఊపులో కేంద్రం కూడ వీరికి పూర్తి సహకారం అందిస్తుంది. ఉన్నపళంగా రాష్ట్రం విషయంలో నిర్ణయాలను మార్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే కేసీఆర్, కేటీఆర్ లను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకుముందులా బీజేపీతో ఉప్పు నిప్పులా ఉంటే కుదరదని భావించారు.
అందుకే కేసీఆర్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పర్యటనలో కేసీఆర్ పలు కీలక విషయాలను కేంద్ర నాయకత్వంతో చర్చించనున్నారట. వరద సహాయం, ప్రాజెక్టుల విషయంతో పాటు కొంత సఖ్యత పెంచుకునే పని కూడ చేస్తారని చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లు కేంద్ర స్థాయిలో బీజేపీకి తెరాస పెద్దగా సపోర్ట్ చేసింది లేదు. కొన్ని విషయాల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే ఇకపై అలా ఉండదని, కొంత సామరస్య వాతావరణం ఉంటుందని, భవిష్యత్తులో అవసరమైతే కలిసి ప్రయాణం చేసే విషయం మీద కూడ ఆలోచిస్తామని చెప్పొచ్చట. అంటే కేసీఆర్ మదిలో ఉన్న థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఢిల్లీలో చక్రం తిప్పాలనే కలకు బ్రేకులు పడ్డట్టే అనుకోవాలి. రాజకీయ వర్గాలు చెబుతున్నట్టే ఈ టూర్లో రాజీ అనే మాటే గనుక ఉంటే ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడవ కూటమిని పెట్టడం ఇప్పుడప్పుడే కుదిరి పని కాదు. ఒకవేళ చేస్తే అది ద్వంద వైఖరే అవుతుంది. కేసీఆర్ అలాంటి ముసుగు రాజకీయాలను ససేమిరా చేయరు కదా.