గ్రేటర్ ఎన్నికల్లో అనేక చిత్రమైన పరిణామాలు చేసుకున్నాయి. రాజకీయ పార్టీల దగ్గర్నుండి ఓటర్ల వరకు అందరూ భిన్నంగానే బిహేవ్ చేశారు. రాజకీయ పార్టీలైతే ఈ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలతో సమానంగా పోల్చుతూ హడావిడి చేస్తే ఓటర్లు ఓటు వేయాలా వద్దా అనే మీమాంసలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ రోజుల మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడ 18 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇక సాయంత్రం 4 గంటలకు అది 29.7 శాతానికి చేరుకుంది. ఈ లెక్కలు చూసిన అందరూ గ్రేటర్ ఓటర్లను నోటికొచ్చినట్టు తిట్టేశారు. అసలు వారికి ఓటు హక్కు విలువే తెలియదన్నట్టు మాట్లాడారు.
సోషల్ మీడియాలో అయితే ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. పోలింగ్ శాతం తగ్గుతోంది అనగానే ఎప్పటిలాగే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మీద నెపం వేసేశారు. వారంతా ఓటు వేయమని సెలవు ఇస్తే తినేసి పడుకున్నారని, పోలింగ్ రోజును హాలీడేలా ఎంజాయ్ చేశారని, అసలు వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందకూడదని అన్నారు. ఇక వరుస సెలవులు రావడంతో ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగులు సెలవులు పెట్టేసి సొంత ఊళ్లకు వెళ్లిపోయారని మాట్లాడారు. కానీ గ్రేటర్ ఓటర్ ఓటును నిర్లక్ష్యం చేయలేదని రాత్రికి రూఢీ అయింది. పోలింగ్ ముగిసే సమయానికి 45.7 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది.
సాయంత్రం 6 గంటల వరకు కూడ 37, 38 శాతం వరకు మాత్రమే ఉన్న పోలింగ్ ఉన్నపళంగా 45.7 శాతానికి చేరుకోవడం చూస్తే ఓటర్లు సాయంత్రం సమయంలో పోలింగ్ బూతులకు బారులు తీరారని అర్థమైంది. సాధారణంగా పోలింగ్ సమయం ముగిసే నాటికి క్యూలో ఉన్న అందరికీ ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ ప్రకారం 6 తర్వాత ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్ లకు చేరుకున్నారని, అందుకే 2 గంటల వ్యవధిలో పోలింగ్ శాతం 7 నుండి 8 శాతం పెరిగిపోయింది. ఈ మొత్తం 2009, 2016 ఎన్నికలతో పోలిస్తే ఎక్కువే. అంటే గతం కంటే ఈసారి ఎన్నికల్లో ఎక్కువమంది ఓటు హక్కుని ఎక్కువగానే వినియోగించుకున్నారని అర్థమైంది.
ఇక వరుస సెలవుల్లో పోలింగ్ పెట్టకుండా వర్కింగ్ డేస్ లోనే నిర్వహించి ఉంటే పోలింగ్ శాతం 50 శాతం వరకు వెళ్లి ఉండేదనే అంచనా కూడ ఉంది. వరుసగా సెలవులు రావడంతో ఉద్యోగులు కొందరు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. వెళ్ళేటప్పుడు పోలింగ్ రోజుకు వద్దామనే అనుకున్నా రాలేకపోయారు. అదే మామూలు రోజుల్లో పోలింగ్ జరిగి ఉంటే వారంతా నగరంలోనే ఉండేవారు కాబట్టి ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేది. సో.. ఇక్కడ తక్కువ పోలింగ్ శాతం తప్పు ఓటర్లది కాదు సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లనే జరిగింది. అప్పటికీ గత ఎన్నికలను మించి ఈసారి ఓట్లు పడ్డాయి అంటే నగరంలో ఉన్న చాలామంది ఓటు హక్కును వినియోగించుకున్నారనే కదా అర్థం. పైగా ఆఖరులో పడిన ఈ 7, 8 శాతం ఓట్లే విజేతలను డిసైడ్ చేసిన చేయవచ్చు.