ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. మరో చోట మూడో స్థానానికి పరిమితమయ్యింది. ‘జనసేన పార్టీ గనుక మద్దతిచ్చి వుంటే పరిస్థితి ఇంకోలా వుండేది’ అన్నది నిర్వివాదాంశం. అయితే, మిత్రపక్షం జనసేనను తెలంగాణ బీజేపీ గుర్తించలేదు. ‘జనసేన అసలు మాకు మిత్రపక్షమే కాదు’ అని తెలంగాణ బీజేపీ నేతలు కొందరు ఎగతాళి చేశారు. దాంతో జనసేన మనోభావాలు దెబ్బతిన్నాయి.. జనసేన కార్యకర్తలు బీజేపీకి ఎదురు తిరిగారు.
జనసేన అధినేత పవన్ కళ్యాన్ కూడా, తెలంగాణ బీజేపీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావు కుమార్తె.. అన్న కోణంలో వాణీ దేవికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. అయితే వాణీ దేవి, టీఆర్ఎస్ అభ్యర్థి. అయినాగానీ, జనసేన తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుంది. జనసైనికులూ, ఆమెకే ఓటేశారు. మరో స్థానంలో కూడా జనసైనికులు, తమకు నచ్చినవారికి ఓటేసుకున్నారు తప్ప, బీజేపీని ఆదరించలేదు. ‘కొందరు మాకు వ్యతిరేకంగా పనిచేశారు. టీఆర్ఎస్‌తో చేతులు కలిపారు..’ అంటూ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. జనసేనను గట్టిగా, నేరుగా విమర్శించే పరిస్థితి లేకపోవడంతో, మిత్రపక్షం విషయమై ఢిల్లీలో తేల్చుకునేందుకు హస్తిన బాట పట్టారు బండి సంజయ్. అక్కడికి వెళ్ళి మాత్రం ఏం చెబుతారు.? గ్రేటర్ ఎన్నికల సమయంలోనూ, ఇప్పుడూ జనసేనను అవమానించిన తీరుపై బండి సంజయ్ తమను తాము ఎలా సమర్థించుకుంటారట.! బీజేపీతో వుండడం వల్ల జనసేనకు అదనంగా కలిసొచ్చేదేమీ లేదు. ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. మైనార్టీ ఓటు బ్యాంకుని బీజేపీ కారణంగా జనసేన దూరం చేసుకోవాల్సి వస్తోందనే వాదన వుంది. ఎలా చూసినా జనసేన వల్ల బీజేపీకి లాభం.. బీజేపీ వల్ల జనసేనకు నష్టం. ఇదే నిజం. మరి, బీజేపీ అధిష్టానం, తమ మిత్రపక్షమైన జనసేన విషయంలో తెలంగాణ బీజేపీని వారిస్తుందా.? వేచి చూడాల్సిందే.