గత ఐదారు నెలల్లో తెలంగాణలో రాజకీయ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. అప్పటివరకు ఏకపక్షంగా నడిచిన రాజకీయంలో ఇప్పుడు ప్రత్యర్థులు తయారయ్యారు. సోదిలో కూడ లేని బీజేపీ అనూహ్యంగా పుంజుకుని పక్కలో బల్లెంలా మారింది తెరాసకు. తెరాసకు అనడం కంటే కేసీఆర్ కు అనడం కరెక్టేమో. కేసీఆర్ సీఎం అయినప్పటి నుండి ప్రత్యర్థులకు ఆయన షాకులు ఇవ్వడమే తప్ప వేరొకరు ఆయన్ను బెదరగొట్టింది లేదు. కానీ ఇప్పుడు ఆ పని బీజేపీ చేస్తోంది. వరుస విజయాలతో గులాబీ బాస్ అలర్ట్ అయ్యేలా చేసింది. అసలు కేసీఆర్ ఆలోచనలన్నింటినీ తలకిందులు చేసేసింది.
కేసీఆర్ వీలైనంత త్వరగా పార్టీని కుమారుడు కేటీఆర్ చేతిలో పెట్టాలనుకున్న మాట వాస్తవం. అందుకే పాలనలో తనయుడికి అన్ని అధికారాలు ఇచ్చేశారు. కేటీఆర్ సారథ్యంలో నడుచుకోవాలని చెప్పేశారు నాయకులకు. లీడర్లు కూడ కేసీఆర్ నిర్ణయానికి అడ్డుచెప్పకుండా కేటీఆర్ ను నాయకుడిగా అంగీకరించేశారు. చాలాకాలం నుండి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలు మీద దృష్టి పెట్టాలని కేంద్ర రాజకీయాల్లో కీలకం కావాలని ఆశపడుతూ వచ్చారు. అందుకే కుమారుడికి రాష్ట్రాన్ని అప్పజెప్పి తాను ఢిల్లీ పనులు చూసుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్టే ప్రజలను సన్నద్ధం చేయాలనుకున్నారు. కేటీఆర్ త్వరలో సీఎం అనే భావనను ప్రజల మెదళ్లలో పాతుకుపోయేలా ప్లాన్ చేశారు.
సొంత వర్గాలతో ప్రచారం చేయించారు. ఏ దశలోనూ దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అంతా సజావుగానే జరుగుతోంది అనుకునే సమయానికి బీజేపీ అడ్డుపడింది. తిరిగి కేసీఆరే పరిస్థితులను చక్కబెట్టాల్సిన ఆవశ్యకతను తీసుకొచ్చింది. అయితే కేటీఆర్ సీమాన్ ప్రచారం మాత్రం ఆగలేదు. ఇంకా ఊపందుకుంది. ఈటెల రాజేందర్, రెడ్యా నాయక్, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నేతలంతా కేటీఆర్ త్వరలో సీఎం అనే సంకేతాలిచ్చారు. తెరాస నాయకులు ఒకరిని మించి ఒకరు స్టేట్మెంట్లు పాస్ చేశారు. దీంతో కేటీఆర్ సీఎం అనే ప్రచారం మరీ పద్దదైంది. ఇవతల ఏమో కష్ట కాలంలో కుమారుడికి పార్టీని అప్పజెబితే కోరి కష్టాల్లోకి నెట్టినట్టే అవుతుందని భావించిన కేసీఆర్ ఆ నిర్ణయాన్ని వాయిదా వేయాలనుకున్నారు.
అందుకే ముందు సొంత పార్టీ నేతలు చేస్తున్న ప్రచారానికి ఫులుస్టాప్ పెట్టాలని నిర్ణయించుకుని అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఇకపై అలాంటి ప్రచారం జరగకూడదని ఇంకో పదేళ్లు తానే ముఖ్యమంతిగా ఉంటానని, సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని గట్టి క్లాస్ తీసుకున్నారు. ఇన్నాళ్లు కుమారుడి పట్టాభిషేకం మీద ఎలాంటి ఖండన చేయకుండా లోపలే మురిసిపోతూ వచ్చిన కేసీఆర్ పరిస్థితులు మారేసరికి కలల్ని పక్కనబెట్టి సీఎం పదవిలో తానే కొనసాగాలని డిసైడ్ అయ్యారన్నమాట.