హైదరాబాద్ (కూకట్‌పల్లి): రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం స్పష్టం చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి జనసేన రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకులు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యకర్తలను అధిక సంఖ్యలో సమీకరించి, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే యంత్రాంగం సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశంలో పాల్గొన్న ముఖ్య నేతలు: ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రేమ్‌కుమార్, వీర మహిళ చైర్మన్ కావ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

