తెలంగాణ ఎన్నికల్లో మట్టిగరిచిన నలుగురు మంత్రులు

తెలంగాణ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతున్నవేళ ముగ్గురు మంత్రులు నేలకూలారు. అన్నిచోట్ల కారు జోరు కనబడుతున్నా నలుగురు మంత్రులు మాత్రం గెలవలేకపోయారు. మరోవైపు స్పీకర్ మధుసూదనాచారి కూడా ఓటమిపాలయ్యారు. స్పీకర్ అయినవారు ఎవరూ తదుపరి ఎన్నికల్లో గెలవరు అన్న సెంటిమెంట్ నిజం చేశారు మధుసూదనాచారి. ఓటమిపాలైన మంత్రుల వివరాలు కింద చదవండి.

ఖమ్మం జిల్లాకు పెద్ద దిక్కుగా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. తుమ్మల అంటే ఖమ్మం, ఖమ్మం జిల్లా అంటే తుమ్మల అన్నట్లుగా ఆయన ఖమ్మం జిల్లాను ఏలారు. టిడిపిలో సుదీర్ఘ కాలం ఉన్న తుమ్మల తెలంగాణ రావడంతో టిఆర్ఎస్ లో చేరారు. వెంటనే మంత్రి అయ్యారు. ఎమ్మెల్సీగా పనిచేశారు. తర్వాత పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో అక్కడ తుమ్మల బరిలోకి దిగారు. ఆప్పుడు గెలిచారు. కానీ ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఖమ్మం రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వర్ రావు రైవల్స్ గా ఉన్నారు. ఇద్దరు టిడిపిలో ఉన్నసమయంలో వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. లాస్టుకు తుమ్మల టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరారు. మంత్రిగా ఉండి ఆయన ఓడిపోవడంతో తుమ్మల రాజకీయ భవిష్యత్తుపై నీలిమేఘాలు కమ్ముకున్నట్లే చెప్పవచ్చు.

ఇక ఓడిపోయిన మరో మంత్రిగా జూపల్లి కృష్ణారావు నిలిచారు. ఆయన కొల్లాపూర్ లో ఓటమిపాలయ్యారు. సుదీర్ఘ కాలం కొల్లాపూర్ ను ఏలిన జూపల్లి అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి విష్ణు వర్ధన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే తన పార్టీ వారే తన కొంప ముంచారని జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఓడిపోయినా టిఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు. తనకేమీ బాధలేదని చెప్పారు. జూపల్లి కృష్ణారావు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మంత్రిగా కొనసాగారు. అయితే పాలమూరు జిల్లాలో జూపల్లి కి మాజీ మంత్రి డికె అరుణకు బద్ధవైరం ఉంది. జిల్లా పై పట్టుకోసం ఇద్దరు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేశారు. అయితే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జూపల్లి టిఆర్ఎస్ లో చేరారు. కేసిఆర్ కేబినెట్ లో పనిచేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే? జూపల్లితోపాటు తన చిరకాల ప్రత్యర్థిగా ఉన్న డికె అరుణ కూడా ఓటమి చెందారు.

జూపల్లి కృష్ణారావు, డికె అరుణ

ఇక మరో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పరిస్థితి మరింత దారుణం. ఆయన ఓడిపోవడం బాధ కలిగించే కంటే ఆయన తమ్ముడు ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ లో రేవంత్ రెడ్డి మీద భారీ మెజార్టీతో గెలిచారు. తమ్ముడి గెలుపు కోసం పనిచేసి అన్న ఓడిపోవడం మాత్రం ఆశ్యర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు. పట్నం నరేందర్ రెడ్డి టిడిపిలో సుదీర్ఘ కాలం రాజకీయాలు చేశారు. ఆయన సతీమణి సునితా మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి హవా నడుస్తున్నవేళ పట్నం మహేందర్ రెడ్డి టిడిపిలో ఉండి రంగారెడ్డి జిల్లాలో హవా కొనసాగించారు.  అనంతర కాలంలో ఆయన టిఆర్ఎస్ గూటికి చేరారు. టిఆర్ఎస్ లో మంత్రి అయ్యారు. కానీ అనూహ్యంగా ఈదఫా ఆయన పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కొడంగల్ లో తన తమ్ముడు గెలిచారు.

పట్నం మహేందర్ రెడ్డి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు ప్రముఖులు ఓటమిపాలయ్యారు. మంత్రి చందూలాల్, స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోయారు. మంత్రి చందూలాల్ ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క అలియాస్ దనసరి అనసూయ చేతిలో ఓటమిపాలయ్యారు. ముందునుంచే చందూలాల్ ఓడిపోతారన్న ప్రచారం జరిగింది. గోండ్ లకు, లంబాడీలకు మధ్య వివాదం చందూలాల్ ఓటమి కారణాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ఆయన మీద వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెప్పినా మంత్రిగా ఉండడంతో ఆయనకే కేసిఆర్ మళ్లీ టికెట్ కట్టబెట్టారు. మంత్రిగా ఉన్న సమయంలో చందూలాల్ కుటుంబం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నది.

చందూలాల్

ఇక తొలి తెలంగాణ అసెంబ్లీలో ప్రముఖుల జాబితాలో ఉన్న స్పీకర్ మధుసూదనాచారి ఓటమి పాలయ్యారు. ఉమ్మడి రాష్ట్రం నుంచే స్పీకర్ గా చేసిన వారు తదుపరి ఎన్నికల్లో గెలవరు అన్న సెంటిమెంట్ ఉంది. అందుకే ఎవరు స్పీకర్ పదవిని తీసుకోవడానికి భయపడే వారు. కానీ కేసిఆర్ విద్యాధికుడైన మధుసూదనాచారిని స్పీకర్ సీటులో ఆసీనులు కావాల్సిందే అని ఆదేశించడంతో ఆయన స్పీకర్ పదవి చేపట్టారు. సెంటిమెంట్ ప్రకారం చారి ఓడిపోయారు.

మధుసూదనాచారి