కొడంగల్ లో రేవంత్ రెడ్డి కొత్త వ్యూహం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో పార్టీలన్ని స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టిఆర్ఎస్ కు ఆనందానివ్వగా మిగితా పక్షాలకు బాధ కలిగించాయి. స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో  ఈ సీన్ రిపీట్ రాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తోంది.

కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటి చేసిన రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్ది పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.  పక్కాగా గెలుస్తానన్న ధీమాతో ఉన్న రేవంత్ రెడ్డి ఈ ఓటమిని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకోసమే ఆయన మీడియా ముందుకు, జనాల ముందుకు రాలేదు.  ఆయన కేవలం రెండు సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. దీంతో అంతా రేవంత్ రెడ్డి నిశ్శబ్దమయ్యారెందుకని చర్చ ప్రారంభించారు. అయితే రేవంత్ రెడ్డి ప్రస్తుతం పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల మీదనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్దులకే స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. అభ్యర్దులు పోటి చేయని ప్లేస్ లో నియోజకవర్గ ఇంచార్జ్ లకు బాధ్యతలకు అప్పగించారు. పంచాయతీ ఎన్నికలను ఆసరాగా చేసుకునేందుకు కొడంగల్ నియోజకవర్గంలో మళ్లీ తన పట్టు నిలుపుకునేందుకు రేవంత్ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని నేతలతో రేవంత్ హైదరాబాద్ లో సమావేశమైనట్టు సమాచారం. నియోజకవర్గంలోని రిజర్వేషన్ల వివరాలు పరిశీలించిన ఆయన సర్పంచ్ అభ్యర్దుల ఎంపిక పై ఫోకస్ పెట్టారు. ఏ గ్రామంలో కూడా పార్టీ నేతల మధ్య విబేధాలు లేకుండా చర్చించి అందరికి నచ్చేటట్టుగానే అభ్యర్దుల ఎంపిక ఉండాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. అభ్యర్దుల ఎంపికలో  రేవంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతి అభ్యర్దిని కూడా రేవంతే ఎంపిక చేస్తున్నారని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ కాస్త బలహీనంగా ఉన్న గ్రామాల పై ఎక్కువ దృష్టి పెట్టి పార్టీ బలోపేతం పై ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలన్నీ ఆయన బూత్ వైజ్ గా పరిశీలించి ఏఏ గ్రామాలలో ఎలాంటి చర్యలు తీసుకొని పార్టీ బలోపేతం చేయాలనే దాని పై ఆయన వ్యూహా రచనలు చేస్తున్నారని తెలుస్తోంది. మీడియాకు దూరంగా ఉంటున్న రేవంత్ ఏ విషయం కూడా బయటికి తెలియకుండా లోలోపల తన పని తాను చేస్తున్నారని తెలుస్తోంది. ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే మళ్లీ సత్తా చాటాలని ఆయన ప్రయత్నిస్తున్నారని నేతల ద్వారా తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మీడియా ముందుకు వచ్చి ఇబ్బందులు పడేకన్నా ముందుగా  ఇంట గెలిచి రచ్చగెలవాలన్న ఆలోచనలో రేవంత్ ఉన్నారని కార్యకర్తలు అంటున్నారు.

ముఖ్యంగా యువతకు అవకాశం ఇచ్చే విధంగా ఆయన ప్రణాళికలు వేస్తున్నారు. యువతకు అధిక అవకాశం ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహించినట్టు అవుతుందని పార్టీ బలోపేతం కూడా తొందరగా అయ్యే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి రేవంత్ స్థానిక వ్యూహంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.

అయినా రేవంత్ కు ఆ టెన్షన్ తప్పదా

రేవంత్ రెడ్డి తన ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ తరపున ఎక్కువ మంది సర్పంచ్ లను గెలిపించుకున్నా వారు ఆపరేషన్ ఆకర్ష్ కు లొంగిపోరా అనే టెన్షన్ కూడా రేవంత్ రెడ్డికి ఉంది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులతో, పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతాయి. కేవలం పార్టీలు అభ్యర్దికి మద్దతు మాత్రమే ఇస్తాయి. అటువంటప్పుడు వారు అభివృద్ది పేరుతో గులాబీ గూటికి చేరరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకే అనుకూల పవనాలు వీస్తున్నాయని చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల వరకు కూడా వారు చేజారకుండా రేవంత్ రెడ్డి ఇప్పటికే స్కెచ్ వేశారని తెలుస్తోంది. పార్టీ కోసం, నమ్మిన సిద్దాంతాల కోసం పనిచేసే కమ్యూనిష్టు సర్పంచ్ లు కూడా గతంలో టిఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఇప్పుడు  కొడంగల్ లో గెలిచిన వారు చేజారరన్న నమ్మకం లేదు. అందుకే రేవంత్ ముందు చూపుతో పక్కా ప్లాన్ వేశారని తెలుస్తోంది.