ఆయన గెలిచినా, ఓడినా కేసిఆర్ కేబినెట్ లో మంత్రే

ఆయన మామూలు పొలిటికల్ లీడర్ కాదు. కుసున్న కాడ నుంచే కనుసైగలతో రాజకీయాలను శాసించగలరు. ఉమ్మడి రాష్ట్రంలో కుల బలంతో ఆయన రాజకీయాల్లో చక్రం తిప్పారు. కానీ తెలంగాణలో ఆయన కులానికి బలం లేదు. అయినా సరే తెలంగాణలోనూ ఆయన ఇంటి దగ్గరకే నడుచుకుంటూ వచ్చాయి పదవులు. ఆయన ఏనాడూ పదవులకోసం పాకులాడలేదు. ఆయన వ్యూహ చతరుత, ప్రత్యర్థులను చిత్తు చేయడంలో, మంత్రాంగం నడపడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయన గెలిచినా మంత్రే. ఓడినా మంత్రే అన్నట్లుంది పరిస్థితి. ఇంతకూ ఎవరా నాయకుడు? ఏంది ఆయన ముచ్చట ? చదవండి.

తుమ్మల నాగేశ్వర రావు

మనం ఇంతసేపు చదివింది ఎవరి గురించో కాదు ఒకప్పటి ఖమ్మం జిల్లా టిడిపి అగ్ర నేత, నేడు టిఆర్ఎస్ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు గురించే. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా రాజకీయాలను గత కొంతకాలంగా శాసిస్తున్నారు. ఆయన తెలంగాణ ఉద్యమ కాలంలో ఏనాడూ తెలంగాణ గురించి మాట్లాడలేదు. తెలంగాణ కావాలని కూడా ఏనాడూ ఆయన నినదించలేదు. అంతెందుకు జై తెలంగాణ అనే నినాదం ఏనాడూ ఆయన నోటినుంచి కూడా రాలేదని టిఆర్ఎస్ నేతలు ఇప్పటికీ చెబుతుంటారు. అటువంటి తుమ్మల ఓడిపోయినా సరే కేసిఆర్ కేబినెట్ లో గతంలో మంత్రి అయ్యారు. రేపు సయితం కేసిఆర్ కేబినెట్ లో మంత్రి కానున్నట్లు వార్తలు అందుతున్నాయి.

జై తెలంగాణ నినాదం పలకని తుమ్మల బలా బలాలివే

2014లో తుమ్మల నాగేశ్వర రావు టిడిపి తరుపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయన బంగారు తెలంగాణ నినాదం భుజానికెత్తుకుని టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరిపోయారు. చేరీ చేరగానే కేసిఆర్ ఆయనను మంత్రిని చేశారు. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ తర్వాత పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణించారు. ఆ స్థానంలో తుమ్మలను బరిలోకి దించారు కేసిఆర్. ఇంకేముంది మంత్రి పోటీ చేస్తే గెలవడం కష్టమా అన్నట్లు తుమ్మల పాలేరులో గెలిచారు. ఎమ్మెల్సీ పదవి వదులుకున్నారు. 

ఇక 2018 సీన్ చూద్దాం. ఇప్పుడు తుమ్మల పాలేరులో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014లో ఓడిపోయినట్లే ఇప్పుడు ఓడిపోయినా ఆయన మాత్రం బిందాస్ గా ఉన్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఆయన ఫేస్ ఫీలింగ్ చూస్తే ఏమాత్రం బెరుకు, భయం, ఆందోళన కనిపించడంలేదని అంటున్నారు. ‘‘మా నాయకుడు తుమ్మల గెలిచినా మంత్రే… ఓడినా మంత్రే’’ అని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక టిఆర్ఎస్ నాయకుడు కామెంట్ చేశారు. ప్రస్తుతం కేసిఆర్ కేబినెట్ లో కేసిఆర్ తో పాటు మహమూద్ అలీ ఒక్కరే ఉన్నారు. మరో 16 మందితో విస్తరణ జరగాల్సి ఉంది. అయితే రెండో ఫేస్ లో మరో ఎనిమిది లేదా 10 మందితోనే కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. అందులో ఈ దఫాలోనే తుమ్మల మంత్రిగా కావడం ఖాయమని ఖమ్మం జిల్లా నేతలు అంచనాల్లో ఉన్నారు.

మంత్రిగా ఉండి ఎంపీ కి కొట్లాడే చాన్స్ 

తెలంగాణ సిఎం కేసిఆర్ కు తుమ్మల నాగేశ్వరరావు కుడి భుజం లాంటోడు. ఈ విషయాన్ని కేసిఆరే చెప్పారు. అందుకే డైరెక్ట్ మంత్రిని చేశారు. తర్వాత ఎమ్మెల్సీని చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇప్పుడు కూడా అటువంటి ప్రయోగాలే కేసిఆర్ చేయబోతున్నట్లు పార్టీలో మాట్లాడుకుంటున్నారు. గతంలో టిడిపిలో ఓడిపోయిన తుమ్మలను తీసుకుని మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టిన రీతిలోనే రేపు కూడా మంత్రిని చేసి ఖమ్మం ఎంపీ టికెట్ తుమ్మలకు ఇవ్వొచ్చని పార్టీలో చర్చ సాగుతోంది. తద్వారా 2019లో తుమ్మలను పార్లమెంటుకు తనతోపాటే తీసుకుపోవాలన్న ఆలోచనలో కేసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో మంత్రిగా ఉండి ఎమ్మెల్యేకు కొట్లాడినట్లుగానే రేపు మంత్రిగా ఉండి ఎంపీకి కొట్లాడే చాన్స్ కొట్టేయబోతున్నారు తుమ్మల అని ఆయన అనుచరులు అంటున్నారు. అదే జరిగితే తుమ్మల ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పటికీ అసెంబ్లీకి కానీ, కౌన్సిల్ కు కానీ ఏ చట్టసభకు ఎంపిక కాకుండానే యవ్వారం నడపొచ్చని అంటున్నారు.

ఎందుకంటే ఏ సభకు ఎన్నిక కాకపోయినా డైరెక్ట్ మంత్రి కావొచ్చు. అలాంటి వారు ఆరు నెలలలోపు ఏదైనా (అసెంబ్లీ లేదా కౌన్సిల్) చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే ఈసారి తుమ్మలకు ఆ పరేసాన్ కూడా అక్కర లేదని, పార్లమెంటు ఎన్నికల వరకు మంత్రిగా పవర్ లో ఉంటూనే పార్లమెంటుకు పోటీ చేసి ఎంపీగా వెళ్లిపోతారని అంటున్నారు. ఆయన పార్లమెంటుకు పోయిన తర్వాత ఖమ్మం జిల్లాలో మరో నాయకుడికి మంత్రి పదవి రావొచ్చని చెబుతున్నారు. ఆ కోటాలో చూస్తే ఖమ్మంలో గెలిచిన పువ్వాడ అజయ్ రేస్ లో ఉంటారని అంటున్నారు.

పువ్వాడ అజయ్ కుమార్

పార్లమెంటు ఎన్నికలకు అటూ ఇటూగా కేసిఆర్ సిఎం పదవి నుంచి తప్పుకుని కేటిఆర్ ను సిఎం చేసే అవకాశాలున్నందున పువ్వాడ అజయ్ కేటిఆర్ మంత్రివర్గంలో చేరిపోతారని చెబుతున్నారు. కేటిఆర్ కు అజయ్ అత్యంత సన్నిహితుడు కావడం ఇక్కడ గమనార్హం. కేసిఆర్, తుమ్మల ఇద్దరు సీనియర్లు పార్లమెంటుకు పోతారని, కేటిఆర్, అజయ్ ఇద్దరూ స్టేట్ కేబినెట్ లో ఉండబోతున్నారు అని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక టిడిపి నుంచి గెలిచి టిఆర్ఎస్ లో చేరబోతున్న సండ్ర వెంకట వీరయ్యకు కూడా 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో బెర్త్ దక్కినా దక్కవచ్చన్న చర్చ కూడా ఉంది.

సండ్ర వెంకట వీరయ్య

తుమ్మల బిపి కారు కూడా ఉపసంహరించకపోవడం, మంత్రి హోదాలో తాను హైదరాబాద్ లో నివాసం ఉంటున్న క్వార్టర్ ను కూడా ఖాళీ చేయాలని సంకేతాలు రాకపోవడం, సెక్యూరిటీ కూడా తగ్గించకపోవడం చూస్తే తుమ్మల మరోసారి మంత్రి అయినట్లే అని జిల్లాలో జోరుగా టాక్ సాగుతోంది.