తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవే అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోమవారం హోటల్ గోల్కొండలో కాంగ్రెస్ పార్టీ నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించారు. కొన్ని సీట్ల విషయంలో న్యాయ పోరాటం చేయాలని అనుకున్నారు. న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరిపారు.
అయితే సమావేశం ముగిసిన తర్వాత అందరూ బయటకు వెళ్తున్న సమయంలో రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నారు. ఆ సమయంలో మీటింగ్ విశేషాలు మాట్లాడాలని రేవంత్ రెడ్డిని మీడియా రిపోర్టర్లు కోరారు. దానికి ఆయన చేసిన కామెంట్స్ వక్రీకరణకు గురయ్యాయని, ఆయన అనని మాటలను కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వైరల్ చేశారని రేవంత్ సన్నిహితులు తెలిపారు.
ఈ విషయమై రేవంత్ రెడ్డి సన్నిహితుడు అశోక్ జోగుపర్తి అనే యువకుడు మీడియాకు వివరణ ఇచ్చారు. ఆయన వివరణ కింద ఉంది చదవండి.
‘‘మీడియా మిత్రులందరికీ నమస్కారం… ముఖ్యంగా రేవంత్ అన్న అభిమానులకి.. సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో రేవంత్ అన్న గురించి వస్తున్న
తప్పుడు వార్త గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. రేవంత్ అన్న ఎవరితో నేను 2 సంవత్సరాలు మీడియాతో మాట్లాడను అని అనలేదు… వాస్తవానికి జరిగింది ఏమిటి అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను.
ఈరోజు గోల్కొండ హోటల్ దగ్గర మీడియా వాళ్ళు మాట్లాడండి అని రేవంత్ అన్నను ఆడిగారు… దానికి మీరూ 2 సంవత్సరాలు ఎలాగో కేసీఆర్ భజన చేస్తారు… నేను మాట్లాడి లాభం లేదు. మీరెలాగూ నా మాటలు చూపించరు. మాట్లాడినా ఉపయోగం లేదు. అని మాతత్రమే అన్నారు తప్ప నేను రెండు సంవత్సరాలు మాట్లాడను అని అనలేదు.
దానికి మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. అందరూ ముఖ్యంగా రేవంత్ అన్న అభిమానులు నమ్మకండి. సోషల్ మీడియాలో దీన్ని ఖండించండి. రేవంత్ అన్న తరుపున మీకు దీని పైన ఆయన సన్నిహితుడిగా నేను క్లారిటీ ఇస్తున్నాను.
మీడియాతో మాట్లాడను అన్నన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. రేవంత్ అన్న మీద పని గట్టుకొని కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని అందరం ఖండిద్దాం. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన మీడియాకు, ప్రజలకు ఎలా దూరమవుతానని రేవంత్ అన్న ఏనాడూ చెప్పలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయనెప్పుడూ ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతాడు తప్ప సైలెంట్ గా ఉండడు. ఈ విషయంలో జర్నలిస్టు మిత్రులు కూడా రేవంత్ అన్న చేసే పోరాటంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాము. రేవంత్ అన్నతో చర్చించిన తర్వాతే నేను ఈ ప్రకటన వెల్లడిస్తున్నాను.’’ అని అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.