తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ రాజకీయాల్లో మరీముఖ్యంగా ఏపీ సరిహద్దు జిల్లా ఖమ్మంలో తనకంటూ.. ప్రత్యేకతను సంతరించుకున్న నాయకుడు. టీడీపీలో ప్రారంభమైన తుమ్మల రాజకీయం ఆ పార్టీలో అప్రతిహతంగా సాగింది. దాదాపు పదకొండు సంవత్సరాలు.. ఆయన మంత్రిగా పనిచేశారంటే.. ఏ రేంజ్ లో రాజకీయం సాగిందో అర్ధం చేసుకోవచ్చు. నాలుగు దశాబ్దాలుగా చూస్తే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల రాజకీయానికి తిరుగులేకుండా పోయింది. అయితే, అనూహ్యంగా ఆయన పొలిటికల్ కెరీర్ ఇప్పుడు డోలాయమానంలో పడిపోయింది. టీడీపీ తరఫున వరుస విజయాలతోపాటు.. వరుస ఓటములను కూడా తుమ్మల చవిచూశారు.
ఈ క్రమంలోనే టీఆర్ ఎస్‌లోకి జంప్ చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన తుమ్మల.. టీడీపీలోనే ఉంటారని అనుకున్నా.. రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కేసీఆర్‌కు జై కొట్టారు. అంతకు ముందే 2014లో ఖమ్మం నుంచి ఓడిపోవడం, ఈ క్రమంలోనే పువ్వాడ అజయ్ గెలుపు గుర్రం ఎక్కడం జరిగిపోయింది. ఆ తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పిన తుమ్మల కేసీఆర్ కారెక్కడం, ఆయన ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వడం… తన కేబినెట్లోకి తీసుకోవడం తెలిసిందే. దీంతో కేసీఆర్‌కు నమ్మినబంటుగా వ్యవహరిస్తూ వచ్చారు.
పాలేరులో వచ్చిన ఉప ఎన్నికల్లో.. తుమ్మల పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలో భక్తరామ్‌దాస్ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేయించి.. గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రాజకీయాలు ఎప్పు డూ ఒకేలా ఉండవు. తానే హీరోనని భావించిన తుమ్మలకు మిగిలిన నేతల నుంచి పోటీ పెరిగిపోయింది. వచ్చిన వారిని వచ్చినట్టు.. కేసీఆర్ తన పార్టీ కండువా కప్పేశారు. తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని నమ్మ తుమ్మల కేడర్‌ను ఎప్పుడూ పట్టించుకునే పరిస్థితి లేదు. అదే ఆయన్ను రాజకీయంగా వెనకపడేలా చేసింది. దీనికితోడు.. పాలేరులో 2018లో ఓటమిపాలయ్యారు. అయితే, ఈ ఎన్నికల ప్రచార సమయంలో… తనను గెలిపిస్తే.. అసెంబ్లీకి వెళ్తానని, లేకపోతే.. వ్యవసాయం చేసుకుంటానని తుమ్మల అనేవారు.
బహుశ ఆయన అన్న మాటే నిజమైందా? అన్నట్టుగా.. తుమ్మల ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. స్వపక్ష, విపక్ష పార్టీల్లోని ఆయన ప్రత్యర్థులు అందరూ ఏకమై ఆయన్ను ఓడించారు. ఇక, అప్పటి నుంచి ఆయన తన సొంత ఊరు దమ్మపేట మండలం గండుగులపల్లిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఏదో అడపా దడపా నియోజకవర్గానికి వస్తున్నా.. పెద్దగా యాక్టివ్‌గా మాత్రం ఉండడం లేదు. అటు ఆయన వర్గాన్ని మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో తుమ్మల వారి రాజకీయానికి ఇక ఎండ్ కార్డ్ పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అయితే, కేసీఆర్ ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని.. త్వరలోనే పిలుపు వస్తుందని అంటున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తే.. అప్పుడు తుమ్మల మళ్లీ రీచార్జ్ అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తుమ్మల రాజకీయ జీవితం వెలిగేందుకు ఎమ్మెల్సీ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. మొత్తానికి తుమ్మల ప్రస్తానానికి పెద్ద చిక్కే వచ్చిపడింది. చివర్లో ఆయన పొలిటికల్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ? చూడాలి.