టిఆర్ఎస్ ముత్తిరెడ్డికి జనగామలో ఎదురు దెబ్బ

టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో ఆయన దత్తతకు తీసుకున్న గ్రామం షాకిచ్చింది. గతంలో ఎల్లంల గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. పలు అభివృద్ది పనులను కూడా ముత్తిరెడ్డి చేశారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఆయన దత్తత తీసుకున్న గ్రామంలో టిఆర్ఎస్ బలపర్చిన అభ్యర్ది ఓటమిపాలయ్యారు.

టిఆర్ఎస్ నుంచి సర్పంచ్ అభ్యర్దులుగా బక్క సుజాత, ఎర్ర సుజాత పోటి పడ్డారు. దీంతో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బక్క సుజాతను టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఖరారు చేశారు. తనకు సీటు దక్కకపోవడంతో ఎర్ర సుజాత టిఆర్ఎస్ రెబల్ గా నామినేషన్ వేశారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో రెబల్ గా నామినేషన్ వేసిన ఎర్ర సుజాత విజయం సాధించారు.

పెంబర్తిలో కూడా టిఆర్ ఎస్ అభ్యర్ధి ఓటమి పాలయ్యారు. పెంబర్తి గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ టిఆర్ ఎస్, కాంగ్రెస్ లను ఓడించి ఇండిపెండెంట్ అభ్యర్ధి విజయం సాధించాడు. టిఆర్ ఎస్ నుంచి మంద లక్ష్మణ్, కాంగ్రెస్ నుంచి మహేందర్ రెడ్డి, ఇండిపెండెంట్ గా అంబాల ఆంజనేయులు బరిలో నిలిచారు. పెంబర్తి గ్రామాన్ని టిఆర్ఎస్ వశం చేయడానికి ముత్తిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్ధి అంబాల ఆంజనేయులు గౌడ్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్, టిఆర్ ఎస్ కు పెంబర్తిలో షాక్ తగిలింది. 

లింగాల ఘణపురం మండలం నెల్లుట్లలో టిఆర్ఎస్, టిఆర్ఎస్ రెబల్ మధ్య పోటి జరగగా రెబల్ అభ్యర్ధి విజయం సాధించాడు. ఇలా జనగామ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధులు ఓడిపోగా మరికొన్ని చోట్ల రెబల్ అభ్యర్ధులు విజయం సాధించారు.